అభిప్రాయం
మానవ జీవితంలో ప్రాధాన్యం ఉన్న లవణం ఉప్పు (సోడియం క్లోరైడ్). దీన్ని ఆహారంలో తీసుకునే పరిమాణాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుందనేది ప్రచారంలో ఉన్న విషయం. ఒకప్పుడు అయోడిన్ అనే సూక్ష్మ పోషకం లోపం కారణంగా చాలామంది ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నందున అయోడిన్ కలిపిన ఉప్పును వాడుతూ ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. పొటాషియాన్ని తగినంతగా తీసుకోకపోవడం వల్ల బీపీ (బ్లడ్ ప్రెషర్) పెరుగుతున్నదనీ, అందువల్ల ఉప్పులో పొటాషియంను కలిపి తీసుకోవాల్సిన అవసరం ఉందనీ పరిశోధకుల సలహా.
ప్రజల్లో అయోడిన్ లోపాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వపరంగా నిర్ణయాలు జరిగాయి. పరిశ్రమల వారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కనుక ప్రపంచంలో అందరికీ ఉప్పుతో పాటు అయోడిన్ కూడా అందింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక ఆరోగ్య సమస్యకు అన్ని దేశాల వారూ కలిసి సమాధానం తెలుసుకుని అమలు చేయగలిగారు. మరి అదే విధంగా పొటాషియం లోపాన్ని తగ్గించడానికి ఇంతటి కృషి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా?
మనకు తెలిసి హైపర్ టెన్షన్, లేదా అధిక రక్తపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్య. అసలు నిజానికి అనారోగ్యాలు, మరణాలకు ఇదే ఎక్కువగా కారణంగా ఉంటున్నది.
అందుకు కారణం ఏమిటి అని వెతికితే ఉప్పు ఎక్కువగా తినడం అని తెలిసిపోయింది. ఇంకేముంది, అందరూ వీలైనంత తక్కువగా ఉప్పు తింటున్నారు. చాలామంది కారం కూడా తినడం లేదు. మొత్తానికి తిండి తీరు మారిపోయింది. ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉన్నది. ఉప్పు ప్రభావం అందరి మీద ఉంటుంది అనడానికి లేదు. ప్రభావం కనిపించే 50 శాతం మందిలో మాత్రం అది సూటిగా తెలిసిపోతుంది. ఉప్పు ప్రభావం మీద జన్యుపరంగా వచ్చే లక్షణాల పాత్ర ఉందని తెలిసింది. పరిశోధకులు అంతా పూనుకుని ఈ విషయం గురించి ఎన్నో సంగతులను కనుగొన్నారు. ఇప్పుడు అందరూ పొటాషియం కలిపిన ఉప్పు తింటే ఈ బ్లడ్ ప్రెషర్ సమస్య తగ్గుతుందని అంటున్నారు. అంటే మనం తినే తిండి తీరు మరొకసారి మారిపోతుందన్నమాట.
ఏదో ఒక పేరున అందరూ సోడియం బాగా తింటున్నారు. అవసరం కన్నా ఎక్కువ తింటున్నారు. కనుక రక్తపోటు పెరుగుతున్నది. ఎవరికీ ప్రయత్నించి పొటాషియం తినడం అన్నది తెలియదు. శరీరానికి అవసరమైనంత పొటాషియం తినేవారు మొత్తం జనాభాలో 14 శాతం మాత్రమే ఉన్నారని పరిశోధకులు గుర్తించారు.
సోడియం పూర్తిగా తినకుండా ఉండడం కుదరదు. అదే సమయంలో శరీరంలో సోడియం – పొటాషియం ఉండవలసినంత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంగతి ఎవరికీ అంత వివరంగా తెలియదు. అంటే మరోసారి ప్రభుత్వాలు, పరిశ్రమల వారు పరిస్థితిని గుర్తించి పనిలోకి దిగవలసిన సమయం వచ్చింది. ఒకప్పుడు ఉప్పుతో కలిపి అయోడిన్ తిన్నట్టే, ఇప్పుడు ఉప్పుతోనూ, మరిన్ని రకాలుగానూ సోడియం బదులు పొటాషియం తీసుకోవాలి.
ఈ మార్పు వస్తే వెంటనే బ్లడ్ ప్రెషర్ అంటే రక్త పోటు అనే సమస్యకు దానంతట అదే సమాధానం దొరుకుతుంది. కనుక ప్రస్తుతం మన పరిస్థితిని గుర్తించుకొని వెంటనే అదనంగా పొటాషియం తీసుకోవడం మొదలుపెట్టాలి. పరిశ్రమల వారు ఉప్పుతోనూ, తిండి పదార్థాలతోనూ పొటాషియం అదనంగా అందించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి.
రక్తపోటు పెరగడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలకు ప్రపంచం తల్లడిల్లి పోతున్నది. సోడియంతో పాటు పొటాషియం తిన్నందుకు రుచిలో ఎటువంటి తేడా కూడా రాదు. ఇది అందరూ గుర్తించవలసిన మరొక విషయం. సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ఉన్న ‘జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే సంస్థలో పనిచేస్తున్న బ్రూస్ నీల్ పొటాషియం వాడుక మంచిదని గట్టిగా చెబుతున్నారు.
ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం తినే తిండిలో ఎంత పొటాషియం ఉంది అని గుర్తించడం కష్టం. అందరూ అవసరమైన దానికి తక్కువ తీసుకుంటున్నారు అన్నది మాత్రం నిజం. కనీసం 3.5 గ్రాముల పొటాషియం శరీరానికి అందాలి. అందుకోసం అందరూ పండ్లు ఎక్కువగా తినాలట! అన్నట్టు అరటిపళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పళ్లలో కూడా ఉంటుంది.
ఏదో రకంగా పొటాషియం శరీరానికి అందే పద్ధతులు రావాలి. త్వరలోనే రక్తపోటు సమస్య తగ్గుతుందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు.
డా. కె.బి. గోపాలం
వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత ‘ 98490 62055
Comments
Please login to add a commentAdd a comment