Iodine
-
ఇకపైన పొటాషియం ఉప్పు వాడకం?!
మానవ జీవితంలో ప్రాధాన్యం ఉన్న లవణం ఉప్పు (సోడియం క్లోరైడ్). దీన్ని ఆహారంలో తీసుకునే పరిమాణాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుందనేది ప్రచారంలో ఉన్న విషయం. ఒకప్పుడు అయోడిన్ అనే సూక్ష్మ పోషకం లోపం కారణంగా చాలామంది ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నందున అయోడిన్ కలిపిన ఉప్పును వాడుతూ ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. పొటాషియాన్ని తగినంతగా తీసుకోకపోవడం వల్ల బీపీ (బ్లడ్ ప్రెషర్) పెరుగుతున్నదనీ, అందువల్ల ఉప్పులో పొటాషియంను కలిపి తీసుకోవాల్సిన అవసరం ఉందనీ పరిశోధకుల సలహా.ప్రజల్లో అయోడిన్ లోపాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వపరంగా నిర్ణయాలు జరిగాయి. పరిశ్రమల వారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కనుక ప్రపంచంలో అందరికీ ఉప్పుతో పాటు అయోడిన్ కూడా అందింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక ఆరోగ్య సమస్యకు అన్ని దేశాల వారూ కలిసి సమాధానం తెలుసుకుని అమలు చేయగలిగారు. మరి అదే విధంగా పొటాషియం లోపాన్ని తగ్గించడానికి ఇంతటి కృషి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? మనకు తెలిసి హైపర్ టెన్షన్, లేదా అధిక రక్తపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్య. అసలు నిజానికి అనారోగ్యాలు, మరణాలకు ఇదే ఎక్కువగా కారణంగా ఉంటున్నది. అందుకు కారణం ఏమిటి అని వెతికితే ఉప్పు ఎక్కువగా తినడం అని తెలిసిపోయింది. ఇంకేముంది, అందరూ వీలైనంత తక్కువగా ఉప్పు తింటున్నారు. చాలామంది కారం కూడా తినడం లేదు. మొత్తానికి తిండి తీరు మారిపోయింది. ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉన్నది. ఉప్పు ప్రభావం అందరి మీద ఉంటుంది అనడానికి లేదు. ప్రభావం కనిపించే 50 శాతం మందిలో మాత్రం అది సూటిగా తెలిసిపోతుంది. ఉప్పు ప్రభావం మీద జన్యుపరంగా వచ్చే లక్షణాల పాత్ర ఉందని తెలిసింది. పరిశోధకులు అంతా పూనుకుని ఈ విషయం గురించి ఎన్నో సంగతులను కనుగొన్నారు. ఇప్పుడు అందరూ పొటాషియం కలిపిన ఉప్పు తింటే ఈ బ్లడ్ ప్రెషర్ సమస్య తగ్గుతుందని అంటున్నారు. అంటే మనం తినే తిండి తీరు మరొకసారి మారిపోతుందన్నమాట. ఏదో ఒక పేరున అందరూ సోడియం బాగా తింటున్నారు. అవసరం కన్నా ఎక్కువ తింటున్నారు. కనుక రక్తపోటు పెరుగుతున్నది. ఎవరికీ ప్రయత్నించి పొటాషియం తినడం అన్నది తెలియదు. శరీరానికి అవసరమైనంత పొటాషియం తినేవారు మొత్తం జనాభాలో 14 శాతం మాత్రమే ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. సోడియం పూర్తిగా తినకుండా ఉండడం కుదరదు. అదే సమయంలో శరీరంలో సోడియం – పొటాషియం ఉండవలసినంత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంగతి ఎవరికీ అంత వివరంగా తెలియదు. అంటే మరోసారి ప్రభుత్వాలు, పరిశ్రమల వారు పరిస్థితిని గుర్తించి పనిలోకి దిగవలసిన సమయం వచ్చింది. ఒకప్పుడు ఉప్పుతో కలిపి అయోడిన్ తిన్నట్టే, ఇప్పుడు ఉప్పుతోనూ, మరిన్ని రకాలుగానూ సోడియం బదులు పొటాషియం తీసుకోవాలి. ఈ మార్పు వస్తే వెంటనే బ్లడ్ ప్రెషర్ అంటే రక్త పోటు అనే సమస్యకు దానంతట అదే సమాధానం దొరుకుతుంది. కనుక ప్రస్తుతం మన పరిస్థితిని గుర్తించుకొని వెంటనే అదనంగా పొటాషియం తీసుకోవడం మొదలుపెట్టాలి. పరిశ్రమల వారు ఉప్పుతోనూ, తిండి పదార్థాలతోనూ పొటాషియం అదనంగా అందించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి. రక్తపోటు పెరగడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలకు ప్రపంచం తల్లడిల్లి పోతున్నది. సోడియంతో పాటు పొటాషియం తిన్నందుకు రుచిలో ఎటువంటి తేడా కూడా రాదు. ఇది అందరూ గుర్తించవలసిన మరొక విషయం. సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ఉన్న ‘జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే సంస్థలో పనిచేస్తున్న బ్రూస్ నీల్ పొటాషియం వాడుక మంచిదని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం తినే తిండిలో ఎంత పొటాషియం ఉంది అని గుర్తించడం కష్టం. అందరూ అవసరమైన దానికి తక్కువ తీసుకుంటున్నారు అన్నది మాత్రం నిజం. కనీసం 3.5 గ్రాముల పొటాషియం శరీరానికి అందాలి. అందుకోసం అందరూ పండ్లు ఎక్కువగా తినాలట! అన్నట్టు అరటిపళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పళ్లలో కూడా ఉంటుంది. ఏదో రకంగా పొటాషియం శరీరానికి అందే పద్ధతులు రావాలి. త్వరలోనే రక్తపోటు సమస్య తగ్గుతుందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. డా. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత ‘ 98490 62055 -
మీ ఉప్పులో అయోడిన్ ఉందా?
ఓ నాలుగేళ్ల చిన్నారి..రోజూ మంచి ఆహారమే తినిపిస్తారు కానీ వయసుకు తగిన ఎదుగుదల లేదు..ఆ వయసులోని పిల్లల్లో ఉండే చురుకుదనం లేదు..కంటి చూపు కూడా సరిగా ఉన్నట్టూ లేదు..ఏమిటి సమస్య.. ఉప్పు! అవును ఉప్పే.. అయోడిన్ లేని ఉప్పు..పిల్లలకు ఎదుగుదలకు, వికాసానికి కీలకమైన అయోడిన్ లేని ఉప్పు.. ..ఆహారం ద్వారా తగిన అయోడిన్ అందని దేశం మనది. అందువల్లే ఉప్పులో తగిన మోతాదులో అయోడిన్ కలిపి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. తద్వారా అయోడిన్ లోపాన్ని ఎదుర్కొనేలా చర్యలు చేపట్టింది. కానీ తయారీదారుల నిర్లక్ష్యం, కొన్ని కంపెనీల కక్కుర్తి, పలు ప్రాంతాల్లో ఉప్పు తయారు చేసి నేరుగా విక్రయిస్తుండటంతో అయోడిన్ లేని ఉప్పు మార్కెట్లోకి వస్తోంది. మార్కెట్లో విక్రయిస్తున్న ఉప్పులో 30 శాతం వరకు అయోడిన్ ఉండటం లేదని, మరో 20 శాతంలో తక్కువ మోతాదులో ఉందని కేంద్ర ప్రభుత్వ సర్వేలోనే వెల్లడైంది. అయోడిన్ లోపం కారణంగా చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బుద్ధి మాంద్యం, పెద్ద వయసు వారిలో థైరాయిడ్ సమస్యలు సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రం చర్యలు చేపట్టినా.. దేశంలో అయోడిన్ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల కిందే చర్యలు చేపట్టింది. దేశంలో ఆహార వినియోగం కోసం విక్రయించే ఉప్పులో తప్పనిసరిగా అయోడిన్ కలిపేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉప్పును విక్రయించే సంస్థలన్నీ అయోడిన్ కలిపి అమ్ముతున్నాయి. అయితే మన దేశంలో సంప్రదాయ పరిస్థితుల కారణంగా ఇప్పటికీ బస్తాలలో లభ్యమయ్యే ముడి ఉప్పును వినియోగిస్తున్నారు. అందులో తగిన మోతాదులో అయోడిన్ ఉండే అవకాశం లేదు. దీంతో పిల్లల్లో అయోడిన్ లోపం తలెత్తుతోంది. - ఇటీవలి కాలంలో మారిన జీవన శైలి కారణంగా ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఇది కూడా అయోడిన్ లోపానికి కారణమవుతోంది. - హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లో ఆహార పదార్థాలు విక్రయించేవారు తక్కువ ధరకు దొరికే ఉప్పును కొనుగోలు చేస్తుంటారు. అవి ‘అయోడైజ్డ్’కాకపోవడంతో పిల్లల్లో ఎదుగుదల దెబ్బతింటుంది పిల్లల ఎదుగుదలలో అయోడిన్ పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా ఐదు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు వారికి ఇది చాలా అవసరం. లేకుంటే ఎదుగుదల సరిగా ఉండదు. యుక్త వయసులోనూ అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మహిళల్లో గర్భస్రావం, పురుషుల్లో బుద్ధి మాంద్యం సమస్యలు వస్తాయి. అయోడిన్ ఉప్పును వినియోగిస్తే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.. – మాగంటి శేషు మాధవ్, పిల్లలవైద్య నిపుణుడు, వరంగల్ కేంద్ర ప్రభుత్వ సర్వే మేరకు.. దేశంలో అయోడిన్ ఉప్పు వినియోగ కార్యక్రమం ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా నివేదికలు రూపొందిస్తుంది. దేశవ్యాప్తంగా విక్రయించే ఉప్పు శాంపిళ్లను సేకరించి అయోడిన్ శాతాన్ని పరిశీలిస్తుంది. ఇదే సమయంలో చిన్నారుల్లో అయోడిన్ లోపాలపై అధ్యయనం చేస్తుంది. ఈ మేరకు తాజాగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలోని చిన్నారుల్లో అయోడిన్ లోపం ఆందోళనకర స్థాయిలో ఉందని తేలింది. 50 శాతం ‘ఉత్త’ఉప్పే! కేంద్ర ప్రభుత్వ సర్వేలో భాగంగా రాష్ట్రంలో పాత జిల్లాల ప్రాతిపదికన మొత్తం 2,050 ఉప్పు నమూనాలను సేకరించి అయోడిన్ శాతాన్ని పరీక్షించారు. వాటిల్లో 30 శాతం నమూనాల్లో అయోడిన్ ఆనవాళ్లు ఏ మాత్రం లేవని తేలింది. మరో 20 శాతం నమూనాల్లో ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా అయోడిన్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అంటే మొత్తంగా 50 శాతం ఉప్పు ప్రమాణాల మేరకు లేదని వెల్లడైంది. అయోడిన్ ఉప్పు వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఈ సమస్య నెలకొందని గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో అయోడిన్ లేని ఉప్పు తీసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు. లోపిస్తే సమస్యలు ఎన్నో.. అయోడిన్ లోపం వల్ల చిన్నారులలో గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి ఉబ్బడం), హైపోథైరాయిడిజం, కంటి చూపు దెబ్బతినడం, ఎదుగుదల లోపించడం, బుద్ధి మాంద్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో అయోడిన్ లోపం కారణంగా గర్భస్రావం జరిగే అవకాశా లు ఎక్కువ.రాష్ట్రంలోని చిన్నారుల్లో గాయిటర్, కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారు తొమ్మిది శాతం వరకు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంత మహిళల్లోనూ అయోడిన్ లోపం ఎక్కువగా ఉందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. – సాక్షి, హైదరాబాద్ -
అయోడిన్ కిట్టు..వాడితే ఒట్టు
* రెండేళ్లుగా నిలిచిన అయోడిన్ కిట్ల పంపిణీ * గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో అయోడిన్ లోపం * గుర్తించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం * అవగాహన ర్యాలీలతో సరి ఒంగోలు సెంట్రల్ : అయోడిన్..శరీరానికి అత్యావశ్యకమైన పోషకం. ప్రతి మనిషికి రోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. ప్రకృతి ద్వారా లభించాల్సిన ఈ పోషకం వాతా వరణ కాలుష్యంతో శరీరానికి అందడం లేదు. అయోడిన్ ఉన్న ఉప్పును ఆహారంలో తీసుకుంటే.. ఆ లోపాన్ని భర్తీచేయొచ్చు. కానీ అవగాహన లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పును వాడటం లేదు. ఫలితంగా జిల్లాలోని అధిక శాతం మంది పిల్లల్లో అయోడిన్ లోపం ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఆ పిల్లలు గాయిటర్ అనే గొంతు సంబంధిత వ్యాధికి గురవుతున్నారు. మరికొందరు బుద్ధిమాంద్యులుగా మారుతున్నారు. ప్రచారమే తప్ప..పరీక్షలేవీ.. అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడండి. ఆరోగ్యానికి అయోడిన్ మంచిదంటూ ప్రకటనలు, ర్యాలీలతో ఊదరగొట్టే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు..అయోడిన్ లోపాన్ని గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైద్య సిబ్బందికి పదే ళ్ల క్రితం నుంచి వైద్యాధికారులు అయోడిన్ పరీక్ష కిట్లు పంపిణీ చేస్తున్నా సిబ్బంది వాటిని వినియోగించడం లేదు. దీంతో ఎలాగూ వాటిని వాడటం లేదని భావించిన అధికారులు రెండేళ్ల నుంచి సరఫరా నిలిపేశారు. చేయాల్సిందిదీ... పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనంలో..ఇళ్లలో వినియోగించే ఉప్పులోని అయోడిన్ శాతాన్ని పరీక్షించి పిల్లల తల్లిదండ్రులకు ఆహార పరంగా సలహాలు ఇవ్వాలి. జిల్లాలో 920 పంచాయతీలుండగా అదే సంఖ్యలో ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్సీల్లో అయోడిన్ పరీక్ష కిట్లు ఉంటాయి. గ్రామ స్థాయిలో ఆరోగ్యసేవలందించే ఏఎన్ఎంలకు వీటిని అంది స్తారు. వీరికి ఆశ కార్యకర్తలు కూడా సహకరిస్తారు. డ్వాక్రా సంఘాలను కూడా భాగస్వాములను చేశారు. ప్రతి ఇంట్లో వాడుతున్న ఉప్పు శాతాన్ని గుర్తించడానికి ద్రావకంతో కూడిన కిట్లు అందిస్తున్నారు. ఆ ద్రావకాన్ని ఉప్పులో వేస్తే మారే రంగు ఆధారంగా అయోడిన్ శాతాన్ని గుర్తిస్తారు. ఆ మోతాదులో ఎంత అయోడిన్ అవసరమో ప్రజలకు వైద్య సిబ్బంది సూచించాలి. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు గళ్ల ఉప్పును వాడుతున్నారు. దీని వలన శరీరానికి కావాల్సిన అయోడిన్ లభించడంలేదు. ఈ విషయాలన్నింటిపై అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. అయితే అయోడిన్ కిట్లను సిబ్బంది ఏ రోజూ వాడిన దాఖలాలు లేవు. దశాబ్ద కాలం పాటు సరఫరా చేసిన కిట్లు ఉప కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్నా యి. ఫలితంగా కిట్ల సరఫరాను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అయోడిన్ లోపం తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కిట్ల సరఫరా నిలిచింది వాస్తవమే.. కే చంద్రయ్య, డీఎంహెచ్వో అయోడిన్ లోపం తెలుసుకునేందుకు గతంలో కిట్లు సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం వాటిని ఇవ్వడం లేదు. అయోడిన్ లోపంపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు మంగళవారం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్, డైరక్టరేట్ హెల్త్ ఇన్చార్జ్ డాక్టర్ గీతా ప్రసాదిని పాల్గొంటారు.