* రెండేళ్లుగా నిలిచిన అయోడిన్ కిట్ల పంపిణీ
* గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో అయోడిన్ లోపం
* గుర్తించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం
* అవగాహన ర్యాలీలతో సరి
ఒంగోలు సెంట్రల్ : అయోడిన్..శరీరానికి అత్యావశ్యకమైన పోషకం. ప్రతి మనిషికి రోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. ప్రకృతి ద్వారా లభించాల్సిన ఈ పోషకం వాతా వరణ కాలుష్యంతో శరీరానికి అందడం లేదు. అయోడిన్ ఉన్న ఉప్పును ఆహారంలో తీసుకుంటే.. ఆ లోపాన్ని భర్తీచేయొచ్చు. కానీ అవగాహన లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పును వాడటం లేదు. ఫలితంగా జిల్లాలోని అధిక శాతం మంది పిల్లల్లో అయోడిన్ లోపం ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఆ పిల్లలు గాయిటర్ అనే గొంతు సంబంధిత వ్యాధికి గురవుతున్నారు. మరికొందరు బుద్ధిమాంద్యులుగా మారుతున్నారు.
ప్రచారమే తప్ప..పరీక్షలేవీ..
అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడండి. ఆరోగ్యానికి అయోడిన్ మంచిదంటూ ప్రకటనలు, ర్యాలీలతో ఊదరగొట్టే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు..అయోడిన్ లోపాన్ని గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైద్య సిబ్బందికి పదే ళ్ల క్రితం నుంచి వైద్యాధికారులు అయోడిన్ పరీక్ష కిట్లు పంపిణీ చేస్తున్నా సిబ్బంది వాటిని వినియోగించడం లేదు. దీంతో ఎలాగూ వాటిని వాడటం లేదని భావించిన అధికారులు రెండేళ్ల నుంచి సరఫరా నిలిపేశారు.
చేయాల్సిందిదీ...
పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనంలో..ఇళ్లలో వినియోగించే ఉప్పులోని అయోడిన్ శాతాన్ని పరీక్షించి పిల్లల తల్లిదండ్రులకు ఆహార పరంగా సలహాలు ఇవ్వాలి. జిల్లాలో 920 పంచాయతీలుండగా అదే సంఖ్యలో ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్‌సీల్లో అయోడిన్ పరీక్ష కిట్లు ఉంటాయి. గ్రామ స్థాయిలో ఆరోగ్యసేవలందించే ఏఎన్‌ఎంలకు వీటిని అంది స్తారు. వీరికి ఆశ కార్యకర్తలు కూడా సహకరిస్తారు. డ్వాక్రా సంఘాలను కూడా భాగస్వాములను చేశారు. ప్రతి ఇంట్లో వాడుతున్న ఉప్పు శాతాన్ని గుర్తించడానికి ద్రావకంతో కూడిన కిట్లు అందిస్తున్నారు. ఆ ద్రావకాన్ని ఉప్పులో వేస్తే మారే రంగు ఆధారంగా అయోడిన్ శాతాన్ని గుర్తిస్తారు.
ఆ మోతాదులో ఎంత అయోడిన్ అవసరమో ప్రజలకు వైద్య సిబ్బంది సూచించాలి. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు గళ్ల ఉప్పును వాడుతున్నారు. దీని వలన శరీరానికి కావాల్సిన అయోడిన్ లభించడంలేదు. ఈ విషయాలన్నింటిపై అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. అయితే అయోడిన్ కిట్లను సిబ్బంది ఏ రోజూ వాడిన దాఖలాలు లేవు. దశాబ్ద కాలం పాటు సరఫరా చేసిన కిట్లు ఉప కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్నా యి. ఫలితంగా కిట్ల సరఫరాను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అయోడిన్ లోపం తెలుసుకోవడం కష్టతరంగా మారింది.
కిట్ల సరఫరా నిలిచింది వాస్తవమే.. కే చంద్రయ్య, డీఎంహెచ్‌వో
అయోడిన్ లోపం తెలుసుకునేందుకు గతంలో కిట్లు సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం వాటిని ఇవ్వడం లేదు. అయోడిన్ లోపంపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు మంగళవారం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్, డైరక్టరేట్ హెల్త్ ఇన్‌చార్జ్ డాక్టర్ గీతా ప్రసాదిని పాల్గొంటారు.
అయోడిన్ కిట్టు..వాడితే ఒట్టు
Published Tue, Oct 21 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM
Advertisement
Advertisement