థైరాయిడ్ సమస్య అనగానే హైపర్ థైరాయిడిజమ్, హైపో థైరాయిడిజమ్‌లు గుర్తుకొస్తాయి. హషిమోటో థైరాయిడైటిస్ అనేది హైపో థైరాయిడిజమ్‌లోని ఒక సమస్య. ఇది తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థే తమపై ప్రతికూలంగా పని చేయడం వల్ల వచ్చే ఒక రకం ఆటో ఇమ్యూన్ డిసీజ్. అందుకే దీన్ని ‘ఆటోఇమ్యూన్ హైపో థైరాయిడిజమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.
మన దేహంలో మెడ దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో ఓ కీలకమైన థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది దేహంలోని అనేక రకాల జీవక్రియలకు అవసరమైన థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తూ ఉంటుంది. తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిపై వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ‘థైరాక్సిన్’ హార్మోన్ స్రావాలు తగ్గుతాయి. దాంతో అది హైపో థైరాయిడిజమ్‌కు దారితీస్తుంది. ఫలితంగా సరిపోయినంత థైరాక్సిన్ దొరకక దేహానికి అవసరమైన జీవక్రియలు జరగవు. ఈ హైపోథైరాయిడిజమ్‌లోని ఒకానొక కండిషన్ పేరే ‘హషిమోటో థైరాయిడైటిస్’.
కారణాలు: ‘హషిమోటో థైరాయిడైటిస్’కు కారణాలు ఇంకా తెలియదు. కానీ కొన్ని జన్యుపరమైన కారణాలతో, అలాగే హార్మోన్ స్రావాల లోపాలతో ఇలా జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అదీగాక థైరాయిడ్ సమస్య వచ్చే మహిళల్లోని 20% మందిలో తర్వాత్తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశాలూ ఎక్కువని కూడా తెలుసుకున్నారు. గతంలోనైతే ఆహారంలో అయోడిన్ లేని ఉప్పు కారణంగా ఈ సమస్య వచ్చేది. ఎందుకంటే థైరాయిడ్ బాగా పని చేయాలంటే అయోడిన్ అవసరం. పిండదశలోనే ఈ సమస్యతో మానసిక, శారీరక ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. దాన్ని ‘క్రెటినిజమ్’ అని అంటారు. అయితే ఇటీవల ఐయోడైజ్‌డ్ ఉప్పు లభ్యతతో... వ్యాధి రావడం తగ్గింది.
కొన్ని రకాల రేడియేషన్‌లకు గురికావడమూ ఈ సమస్యకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమందిలో థైరాయిడ్‌లో గడ్డ లేదా క్యాన్సర్ కణితి రావడంతో, దాన్ని తొలగించడంతోనూ హైపోథైరాయిడిజమ్ రావచ్చు. అయితే... ‘హషిమోటో థైరాయిడైటిస్’లో థైరాయిడ్ గ్రంథి అలాగే ఉంటుందిగానీ... దాని పనితీరు తగ్గుతూపోతుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో దీని విస్తృతి ఎక్కువ.
లక్షణాలు: దీని లక్షణాలు వేర్వేరు వయసువాళ్లలో వేర్వేరుగా కనిపిస్తాయి. స్థూలంగా ఈ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి.
- మెడదగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథిలో వాపు రావడంతో మెడ ముందుభాగం ఉబ్బినట్లుగా కనిపించడం ప్రధానమైన / కీలకమైన లక్షణం
- హైపోథైరాయిడిజమ్‌లో థైరాయిడ్ గ్రంథి పనితీరు లోపించినప్పుడు స్థూలకాయం సాధారణం. అందువల్ల ఈ సమస్య బాధితులు బాగా బరువు పెరుగుతుంటారు
- నీరసం, నిస్సత్తువ, తీవ్రమైన అలసట
- పాలిపోయినట్లుగా కాస్త ఉబ్బినట్లుగా కనిపించే ముఖం
- కండరాల, కీళ్ల నొప్పులు
- మలబద్ధకం
- మహిళల్లో గర్భధారణ సమస్యలు, సంతానలేమి, యువతుల్లో ఆలస్యంగా రజస్వల కావడం, అయ్యాక నెలసరి సక్రమంగా రాకపోవడం, రుతుసమయంలో రక్తం ఎక్కువగా పోవడం వంటి ఇబ్బందులు
- జుట్టు రాలిపోవడం, పలచబడటం
- గుండె స్పందనల వేగం తగ్గడం
- కుంగుబాటు (డిప్రెషన్)కు గురికావడం వంటి మానసిక సమస్యలు కనిపిస్తాయి
- పుట్టిన పిల్లల్లో పుట్టుకతోనే (కంజెనిటల్‌గా) హైపోథైరాయిడిజమ్ ఉంటే వాళ్ల మెదడు పెరుగుదల మందగిస్తుంది. పిల్లల దశలోనే వస్తే వాళ్ల ఎదుగుదల దెబ్బతింటుంది. స్కూల్ చదువుల్లో పర్‌ఫార్మెన్స్ తక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిర్ధారణ: టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్ష చేయించినప్పుడు టీ3, టీ4 మోతాదులు నార్మల్‌గా లేదా తక్కువగానే ఉన్నప్పటికీ టీఎస్‌హెచ్ మోతాదులు ఎక్కువగా ఉంటాయి. యాంటీ–టీపీవో యాంటీబాడీస్ పరీక్షలు చేసినప్పుడు టీఎస్‌హెచ్ మోతాదులతో పాటు యాంటీ–టీపీవో యాంటీబాడీస్, యాంటీ థైరోగ్లోబ్లు్యలిన్ యాంటీబాడీస్ పరీక్షల్లో వాటి మోతాదుల్లో పెరుగుదల కనిపిస్తే దాన్ని ‘హాషిమోటో థైరాయిడైటిస్ / ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజమ్’గా నిర్ధారణ చేయవచ్చు.
డా‘‘ శ్రీనివాస్ కందుల కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్
(చదవండి: సున్నపు రాయి ఇంత ప్రమాదమా? అదే ఆ తల్లికి తీరని కడుపు కోత మిగిల్చింది!)
Comments
Please login to add a commentAdd a comment