ముప్పును తగ్గించే కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష! | Reduced Sodium added potassium Salt would save millions of lives: Research | Sakshi
Sakshi News home page

ముప్పును తగ్గించే కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష!

Published Wed, Sep 1 2021 8:17 AM | Last Updated on Wed, Sep 1 2021 11:13 AM

Reduced Sodium added potassium Salt would save millions of lives: Research - Sakshi

తినే ఉప్పు.. శాస్త్రీయ నామం సోడియం క్లోరైడ్‌ ఎక్కువైతే ముందు రక్తపోటు.. జాగ్రత్తలేవీ తీసుకోకపోతే.. కొంత కాలం తరువాత గుండెజబ్బులు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అనేక శాస్త్ర పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి ఈ విషయాన్ని. కానీ మనకే కాదు.. ప్రపంచం మొత్తమ్మీద ఉప్పులేని వంటకం తినడం దాదాపు ఎవరికీ ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? ఉప్పులో సోడియం క్లోరైడ్‌ తగ్గించి.. పొటాషియం క్లోరైడ్‌ పెంచితే సరి అంటున్నారు ‘ద జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’’ శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, చైనాలతోపాటు భారత్‌లోనూ కేంద్రాలున్న ఈ స్వతంత్ర వైద్య పరిశోధన సంస్థ ఇటీవలే ఒక భారీస్థాయి అధ్యయనం ఒకదాన్ని నిర్వహించింది. ఉప్పులో సాపేక్షంగా పొటాషియం క్లోరైడ్‌ను ఎక్కువ చేసి ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలేవీ ఉండవని నిర్ధారించింది. అంతేకాదు.. ఈ కొత్త రకం ఉప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు, అకాల మరణం వంటివి కొంతమేరకు తగ్గుతాయని కూడా ఈ పరిశోధన చెబుతోంది. -సాక్షి, హైదరాబాద్‌ 

ప్రాణాలకు రక్ష! 
కొత్త రకం ఉప్పును అందరూ వాడటం మొదలుపెడితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బ్రూస్‌ నీల్‌ చెబుతున్నారు. అవసరానికి మించి ఉప్పు తినడం ఇప్పుడు అన్నిచోట్ల ఎక్కువ అవుతోందని, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ప్రత్యామ్నాయాల (సైంధవ లవణం వంటివి)ను ఉపయోగించడం ఖరీదైన వ్యవహారం అవుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోడియం క్లోరైడ్‌ తక్కువగా, పొటాషియం క్లోరైడ్‌ ఎక్కువగా ఉన్న ఉప్పును తయారు చేసి, పంపిణీ చేయడంతోపాటు, వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించడం ఎంతైనా అవసరమని, పైగా ఈ కొత్త రకం ఉప్పు ఖరీదు తక్కువేనని వివరించారు. తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిని మినహాయించి మిగిలిన వాళ్లు ఎవరైనా ఈ కొత్తరకం ఉప్పును వాడవచ్చునని చెప్పారు. 

ఇదీ పరిశోధన... 
ప్రత్యామ్నాయ ఉప్పు ప్రభావాన్ని, సమర్థతను అంచనా వేసేందుకు ‘ద జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’’ చైనాలో దాదాపు 21 వేల మందిపై పరిశోధన నిర్వహించింది, గుండెపోటు లేదా అదుపులో లేనంత ఎక్కువ రక్తపోటు ఉన్న వారిని దాదాపు 600 గ్రామాల నుంచి ఎంపిక చేసింది. 2014 ఏప్రిల్‌లో మొదలుపెట్టి 2015 జనవరి వరకూ అంటే దాదాపు తొమ్మిది నెలలపాటు వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ ఉప్పు మరికొందరికి సాధారణ ఉప్పు అందించింది.

ఒక్కో వ్యక్తికి రోజుకు 20 గ్రాముల చొప్పున ఈ ప్రత్యామ్నాయ ఉప్పును అందించి వంట, నిల్వ (ఊరగాయ లాంటివి)లకు వాడేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ తరువాత అంటే 2015 నుంచి ఐదేళ్లపాటు ఈ గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వచ్చింది. ఐదేళ్ల కాలంలో మూడు వేల మంది గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రత్యామ్నాయ ఉప్పును తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 14 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తేలింది. గుండెకు సంబంధించిన సమస్యల విషయానికి వస్తే 13 శాతం తగ్గుదల నమోదు కాగా... అకాల మృత్యువు బారిన పడే అవకాశం 12 శాతం వరకూ తగ్గింది.

చదవండి:  హర్ష్‌ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు 

సిద్దిపేటలోనూ పరిశోధన 
ప్రత్యామ్నాయ ఉప్పును వాడటం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుందనేందుకు ‘ద జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’’ భారత్‌లో జరిపిన ఒక పరిశోధన తార్కాణంగా నిలుస్తోంది. సుమారు ఆరు నెలల క్రితం వెలువడ్డ ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. ప్రత్యామ్నాయ ఉప్పు వాడిన వారిలో సిస్టోలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ గణనీయంగా తగ్గింది. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో తాము 502 మందిపై ఈ పరిశోధన నిర్వహించామని వీరిలో కొంతమందికి 70 శాతం సోడియం క్లోరైడ్, 30 శాతం పొటాషియం క్లోరైడ్‌ల మిశ్రమమైన ప్రత్యామ్నాయ ఉప్పును, మరికొందరికి వంద శాతం సోడియం క్లోరైడ్‌ ఇచ్చామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సుధీర్‌ రాజ్‌ థౌట్‌ తెలిపారు.

చదవండి : మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’

మూడు నెలల తరువాత పరిశీలించినప్పుడు ప్రత్యామ్నాయ ఉప్పును వాడిన వారిలో సిస్టోలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌  4.6 యూనిట్లు తగ్గిపోగా, డయాస్టోలిక్‌ బ్లడ్‌ప్రెషర్‌లో, మూత్రంలో ఉప్పు అవశేషాల విషయంలోనూ సానుకూల మార్పులు కనిపించాయని వివరించారు. ఈ ఫలితాలు రక్తపోటు నివారణకు ఉపయోగించే మాత్రల ప్రభావంతో పోల్చదగ్గదిగా ఉందన్నారు. 

చదవండి : జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement