ఇస్లామ్ ధర్మంలోని ఐదు మౌలిక సూత్రాల్లో ‘హజ్’ కూడా ఒకటి. కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనే మౌలిక సూత్రాల్లో ఏ ఒక్కదాన్ని నమ్మక పోయినా విశ్వాసం పరిపూర్ణం కాదు. అందుకని ఈ ఐదు అంశాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఇందులోని చివరి అంశం హజ్. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం మక్కాలో నిర్మించిన దైవ గృహ సందర్శనా ప్రక్రియను ‘హజ్’ అంటారు.
హజ్ అనేది ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్ హజ్జ్ నెల పదవ తేదీన మక్కాలో నిర్వహించబడుతుంది. అదేరోజు యావత్ ప్రపంచ ముస్లింలు ఈద్ జరుపుకొని ఖుర్బానీలు సమర్పిస్తారు. ఇస్లామీయ క్యాలండరులో ఇది చివరి నెల. దీని తరువాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
అందుకే ఈ నెలకు ఎనలేని ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ నెలలోని మొదటి పదిరోజులూ చాలా ప్రాముఖ్యం కలిగినవి. ఈ దశకంలో దైవ కారుణ్యం కుండపోతగా వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ గొప్ప ప్రాముఖ్యాన్ని కలిగి దేవుని కృపకు పాత్రమవుతుంది. ఈ దినాల్లో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరం కావు. ఈరోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా (ఉపవాసం)... ఏడాది మొత్తం పాటించే రోజాలకు సమానం. ‘అరఫా’ (జిల్ హజ్ నెల 9వ తేదీ) నాటి ఒక్క రోజా రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అరఫా రోజు సైతాన్ ఘోర పరాజయాన్ని చవిచూస్తాడు. అవమాన భారంతో చితికి పోతాడు.
‘అరఫా’ రోజు ‘లాయిలాహ ఇల్లల్లాహు వహదహూ లాషరీ కలహు, లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలాకుల్లి షయ్ ఇన్ ఖదీర్’ అనే దుఆ ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. దీనితో పాటు ‘తహ్ లీల్’ అంటే, ‘లాయిలాహ ఇల్లల్లాహ్’; ‘తక్బీర్’ అంటే, ‘అల్లాహుఅక్బర్’; ‘తహ్ మీద్’ అంటే, ‘అల్ హందులిల్లాహ్’; ‘తస్ బీహ్’ అంటే, ‘సుబ్ హానల్లాహ్’ అని తరచుగా ధ్యానిస్తూ ఉండాలి. అరఫా రోజే కాకుండా ‘అయ్యామె తష్రీఖ్’లో కూడా అంటే, పండుగ తరువాతి మూడు రోజులూ (జిల్ హజ్ నెలలోని 11, 12, 13 తేదీలు) వీలైనంత అధికంగా ఈ వచనాలు పఠించాలి. కనుక ఈ సుదినాలను సద్వినియోగం చేసుకుంటూ పండుగ ముందు రోజు పాటించే ‘అరఫా’ ఉపవాసం పాటించి, సత్కార్యాలు ఆచరిస్తూ దైవక్రృపకు పాత్రులు కావడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ సన్మార్గ పథం అనుగ్రహించుగాక! – మదీహా అర్జుమంద్ (నేడు బక్రీద్)
Comments
Please login to add a commentAdd a comment