సీతమ్మను లంకాధిపతియైన రావణుడు అపహరించి తీసుకువెళ్ళి లంకలోని అశోకవనంలో దాచాడు. అది తెలుసుకున్న శ్రీరాముడు వెంటనే సముద్రాన్ని దాటి లంకకు చేరే ప్రయత్నం మొదలుపెట్టాడు. తెప్పలు కట్టుకుని దాటడానికి ఎదురుగా ఉన్నది చిన్న నది కాదు కాబట్టి, సముద్రుడిని ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే మార్గం అని విభీషణుడు సలహా ఇచ్చాడు. దాన్ని అంగీకరించాడు శ్రీరాముడు, సముద్రుడిని దారి వదలమని ప్రార్థించడానికి పూనుకున్నాడు.
సముద్ర తీరంలోని ఇసుకపై దర్భలతో తయారుచేయబడిన చాపమీద తన కుడిభుజాన్ని తలగడగా చేసుకుని శయనించి ఏకాగ్ర చిత్తంతో సాగరుడిని ప్రసన్నం కమ్మని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా విభావరులొక మూడు గడిచాయట! అనగా మూడు రాత్రులు గడిచాయి శ్రీరాముడి జీవితంలో! మూడురోజులు ప్రార్థించినప్పటికీ సముద్రుడి నుండి సమాధానం రాకపోవడంతో సహనం కోల్పోయాడు శ్రీరాముడు.
పక్కనే ఉన్న లక్ష్మణుడితో ‘తమ్ముడా, ఈ సముద్రుడు నన్ను అసమర్థుడిగా జమకట్టాడు. ఇతడితో సహనం పాటించడం వివేకంతో కూడుకున్న పని కాదు. ఇతడు దారికి రావాలంటే దండన ఒక్కటే ఇప్పుడు మిగిలున్న మార్గం. బాణాగ్ని చేత ఈ సాగరుడిని శోషింపజేసి, మన సైన్యం నడిచి వెళ్ళడానికి దారి కల్పిస్తాను!’ అని శక్తిమంతమైన ఒక బాణాన్ని సంధించి సముద్రుడి మీదికి వదిలాడు శ్రీరాముడు.
దశదిశలలో దారుణ అగ్నిశిఖలను విరజిమ్ముతూ ఆ బాణం సముద్రంలో ప్రవేశించగానే, నిలువెల్లా వణికిపోతూ సముద్రుడు పరుగున వచ్చి శ్రీరాముడి ముందు నిలిచాడు. సుముద్రుడి అప్పటి అవస్థను ఏనుగు లక్ష్మణకవి తన ‘రామేశ్వర మాహాత్మ్యము’, ప్రథమాశ్వాసంలోని ఈ క్రింది కంద పద్యంలో అలతి మాటలలో వర్ణించాడు.
"కోపంబు సంహరింపుము
నీ పదకమలములు గొలిచి నిల్చిన నన్నుం
జేపట్టుము మ్రొక్కెద, నా
చాపలము సహింపు రామ సద్గుణధామా!"
‘కోపాన్ని ఉపసంహరించుకో శ్రీరామా! నీ పాదములపై వాలి వేడుకుంటున్న నన్ను సేవకుడిగా భావించి ఆదరించు! సద్గుణాలకు నెలవైన ఓ స్వామీ, నా తెలివితక్కువ చేష్టకు నన్ను దయతో మన్నించు!’ అని సముద్రుడు వేడుకున్నాడు. ధీరులు, శాంతాత్ములు, పరమాత్మ స్వరూపులుగా ఉండేవారి సహనాన్ని పరీక్షించే చాపల్యపు పనికి పూనుకుంటే, సముద్రుడంతటి వాడికైనా భంగపాటు తప్పదని పై సన్నివేశం బోధిస్తుంది. – భట్టు వెంకటరావు
Comments
Please login to add a commentAdd a comment