మనం బస్సులో ఎక్కినప్పుడు కూర్చోవటానికి చోటు ఉందా లేదా అని వెతుక్కుంటాం. అది కూడా వెనక్కి అయితే కుదుపులు ఉంటాయని ముందు వరసల్లోనే కూర్చోవటానికి పోటీ పడతాం. రైల్లో ఎక్కినప్పుడు కూడా సౌకర్యంగా కిటికీ దగ్గర చోటుకు ఇష్టపడతాం. అంతేకాదు... సభలకు, సమావేశాలకు వెళ్ళినప్పుడు బాగా వినటానికి, చూడటానికి బాగుంటుందని ముందు వరుసల్లో చోటు చూసుకుంటాం. చదువుకునే రోజుల్లో విద్యార్థులు ముందు బెంచీల్లో చోటు కోసం ప్రతిరోజూ పోటీ పడుతుంటారు.
కొన్ని గంటల సేపు ప్రయాణం చేయటానికే సౌకర్యవంతమైన చోటును చూసుకుంటున్నాం. ఆ కాసేపు అదేదో మన సొంత చోటులా భావిస్తూ అందులోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. మరి, శాశ్వతమైన చోటు సంపాదించుకోవాలంటే ఎంత ప్రయత్నించాలి? ఆ శాశ్వతమైన చోటు ఎక్కడుంది? దాని నెలా పొందాలి?
శాశ్వతుడు, నిత్య సత్యుడు అయిన భగవంతుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. తరతరాలుగా వచ్చే ధన ధాన్యాలు, బంగారం వంటి సంపదలు వదలలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. కష్టాలు కోరకుండానే వచ్చినట్లు, సుఖాలు ఆ సమయానికి అవే వస్తాయి. అందుకోసం ఎంతో విలువైన జీవితాన్ని వృ«థా చేసుకోకూడదంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ధర్మాన్ని ఆచరించటానికి తగిన మానవ జన్మను పొందటం చాలా కష్టం. ఈ అవకాశాన్ని మనుషులు సార్థకం చేసుకోవాలి.
ధర్మాన్ని, సత్యాన్ని శ్రద్ధగా పాటించే వ్యక్తులకు దైవం హృదయంలో చోటు లభిస్తుంది. ఆ పరమ పురుషుని పాద పద్మాలను మన హృదయాలలో నిలుపుకోవాలి. మంచితనం, సత్ప్రవర్తన, సత్సాంగత్యం, భక్తి, పరిపూర్ణ విశ్వాసం వంటి వానితో దైవం హృదయంలో చోటు పొందాలి. అదే నిజమైన పొందవలసిన చోటు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏదీ లేదు. – డా. చెంగల్వ రామలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment