ఈ సృష్టిలో నిజంగా స్వతంత్రులెవరైనా ఉన్నారా? లౌకిక ప్రపంచాన్ని గమనిస్తే... కుటుంబ సభ్యులు కుటుంబ యజమాని వశంలో ఉంటారు. ఆ యజమాని తనకు జీవనోపాధి ఇచ్చే మరో యజమానికి వశుడు. ఆ యజమాని కూడా చట్టానికీ, ప్రభుత్వానికీ లోబడవలసిందే. సవ్యమైన పాలన అందించే ప్రభువు కూడా ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పాలించాలి. పూర్తి స్వతంత్రుడు కాలేడు. ఇక ప్రజాస్వామ్యమైతే, ప్రజలే స్వాములని పేరులోనే ఉంది. పాలకులు సేవకులు!
ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే... జగత్తంతా దైవాధీనం. శివుడి ఆజ్ఞ లేకుండా చీమ చిటుక్కుమనడం కూడా జరగదని నమ్మకం. ‘నా వల్లనే ఈ జగత్తంతా నడుస్తుంది!’ – మత్తః సర్వ ప్రవర్తతే– అని గీతాచార్యుడి ప్రకటన. ‘పరమాత్మనైన నేను అధిష్ఠానంగా ఉంటుండగా, త్రిగుణాత్మకమైన నా మాయా శక్తి త్రిలోకాలను సృష్టిస్తుంది. భూతకోటి యావత్తూ ఈ మాయా శక్తి వశులై నడుస్తారు’ అంటాడు. అలాంటప్పుడు, ఇక ప్రాణులకు స్వాతంత్య్రం ఎక్కడ? ఏపాటి? పోనీ ఆ దైవం స్వతంత్రుడా అంటే, పూర్తి స్వతంత్రం ఆయనకూ లేదు. ఆ భగవంతుడిని తమ వశంలో ఉంచుకోగల వాళ్ళు కూడా ఉన్నారు.
భాగవతంలో దుర్వాస మహర్షి అంబరీశుడిని అకారణంగా సంహరించబోగా, విష్ణుమూర్తి సుదర్శన చక్రం, తనకున్న దుష్ట శిక్షణ కర్తవ్యాన్ని అనుసరించి, తనంతట తానే మునీంద్రుడిని తరుముతూ వెళ్తుంది. దాన్ని తప్పించుకునే మార్గం తెలియక, తిరిగి తిరిగి ముని చివరికి విష్ణుమూర్తినే ప్రార్థిస్తాడు.
‘నీ ఆయుధాన్ని ఉపసంహరించుకుని నన్ను రక్షించ’మని. ‘అంత స్వతంత్రం నాకెక్కడిది?’ అంటాడు విష్ణుమూర్తి. ‘అహం భక్త పరాధీనః, అస్వతంత్రః ఇవ ద్విజ!– ఓ మునీంద్రా, నేను నా భక్తుల అధీనంలో ఉండేవాడిని. అక్కడ నాకు స్వతంత్రం లేదు. నా హృదయం వాళ్ళకు బందీ. సద్గుణవతులైన స్త్రీలు, సత్పురుషులైన తమ భర్తలను వశం చేసుకొన్నట్టు, ఆ సాధువులు నన్ను వశం చేసుకుంటారు. నా ఆయుధాన్ని ఆపగల శక్తి అంబరీషుడికే ఉంది. నాకు లేదు!’ – ఎం. మారుతి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment