ఓ లక్ష్మీనృసింహ స్వామీ! నాకు చేయూతనివ్వవయ్యా! మమ దేహి కరావలంబమ్!
నాకు కనిపించడం మానేసింది. అంధత్వం ఏర్పడింది. ఎదురుగా మంచీ, చెడూ కనిపిస్తుంటే కూడా ఏది ఏదో పోల్చుకోలేకుండా ఉన్నాను. ఇది పాపం, ఇది పుణ్యం అని గుర్తించలేకపోతున్నాను. ఎటు పోతున్నానో, ఎటు పోవాలో, ఏమి కాబోతున్నదో ఏమీ పాలు పోవడం లేదు. ఇది నేత్రవ్యాధి కాదు. బుద్ధి వైకల్యం. నేను వివేకాన్ని కోల్పోయాను. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు!
మహాబలవంతులైన చోరులు నా మీద దాడి చేసి, అమూల్యమైన నా వివేక ధనాన్ని దొంగిలించుకెళ్లారు. ఆ దొంగలకు ‘ఇంద్రియాలు’ అని నామధేయం. నేను ఏమరుపాటుగా ఉండగా, వాళ్ళు నన్ను ఇట్టే లొంగదీసుకుని, భోగలాలసత అనే ఇనుప గొలుసులతో కట్టివేసి, నా వివేకాన్ని ఊచముట్టుగా దోచేశారు. దాంతో నేను అవివేకిగా, మూర్ఖుడిగా, పాప పుణ్యాల గ్రహింపు లేకుండా, నాకు ఏది మేలో నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను.
నాకు మిగిలిందల్లా ఇంద్రియ భోగాల మీద మితిలేని, మతిలేని వ్యామోహం. ఆ మోహాంధకారం నా జీవితాన్ని చీకటి కూపం చేసేసింది. అది ఏ గోతిలోకి లాక్కెళితే అందులో పడిపోతున్నానే తప్ప, నాకు క్షేమకరమైన మార్గాన్ని స్వయంగా ఎంచుకోగల శక్తిని, దొంగలు దోచారు. నా బుద్ధి పని చేయడం మానేసింది. విచక్షణా జ్ఞాననేత్రం మూసుకుపోయింది. నాకు చేయూత ఇచ్చి, ఈ అంధకారంలో నుంచి బయటపడే మార్గం చూపు స్వామీ!
"అంధస్య, మే, హృత వివేక మహా ధనస్య
చోరైః మహా బలిభిః ఇంద్రియ నామధేౖయెః
మోహాంధకార కుహరే విని పాతితస్య
లక్ష్మీనృసింహ, మమ దేహి కరావలంబమ్!"
– ఎం. మారుతి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment