maruti sastry
-
దొంగల దోపిడి..
ఓ లక్ష్మీనృసింహ స్వామీ! నాకు చేయూతనివ్వవయ్యా! మమ దేహి కరావలంబమ్!నాకు కనిపించడం మానేసింది. అంధత్వం ఏర్పడింది. ఎదురుగా మంచీ, చెడూ కనిపిస్తుంటే కూడా ఏది ఏదో పోల్చుకోలేకుండా ఉన్నాను. ఇది పాపం, ఇది పుణ్యం అని గుర్తించలేకపోతున్నాను. ఎటు పోతున్నానో, ఎటు పోవాలో, ఏమి కాబోతున్నదో ఏమీ పాలు పోవడం లేదు. ఇది నేత్రవ్యాధి కాదు. బుద్ధి వైకల్యం. నేను వివేకాన్ని కోల్పోయాను. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు!మహాబలవంతులైన చోరులు నా మీద దాడి చేసి, అమూల్యమైన నా వివేక ధనాన్ని దొంగిలించుకెళ్లారు. ఆ దొంగలకు ‘ఇంద్రియాలు’ అని నామధేయం. నేను ఏమరుపాటుగా ఉండగా, వాళ్ళు నన్ను ఇట్టే లొంగదీసుకుని, భోగలాలసత అనే ఇనుప గొలుసులతో కట్టివేసి, నా వివేకాన్ని ఊచముట్టుగా దోచేశారు. దాంతో నేను అవివేకిగా, మూర్ఖుడిగా, పాప పుణ్యాల గ్రహింపు లేకుండా, నాకు ఏది మేలో నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను.నాకు మిగిలిందల్లా ఇంద్రియ భోగాల మీద మితిలేని, మతిలేని వ్యామోహం. ఆ మోహాంధకారం నా జీవితాన్ని చీకటి కూపం చేసేసింది. అది ఏ గోతిలోకి లాక్కెళితే అందులో పడిపోతున్నానే తప్ప, నాకు క్షేమకరమైన మార్గాన్ని స్వయంగా ఎంచుకోగల శక్తిని, దొంగలు దోచారు. నా బుద్ధి పని చేయడం మానేసింది. విచక్షణా జ్ఞాననేత్రం మూసుకుపోయింది. నాకు చేయూత ఇచ్చి, ఈ అంధకారంలో నుంచి బయటపడే మార్గం చూపు స్వామీ!"అంధస్య, మే, హృత వివేక మహా ధనస్యచోరైః మహా బలిభిః ఇంద్రియ నామధేౖయెఃమోహాంధకార కుహరే విని పాతితస్యలక్ష్మీనృసింహ, మమ దేహి కరావలంబమ్!"– ఎం. మారుతి శాస్త్రి -
దేవుడు స్వతంత్రుడా?
ఈ సృష్టిలో నిజంగా స్వతంత్రులెవరైనా ఉన్నారా? లౌకిక ప్రపంచాన్ని గమనిస్తే... కుటుంబ సభ్యులు కుటుంబ యజమాని వశంలో ఉంటారు. ఆ యజమాని తనకు జీవనోపాధి ఇచ్చే మరో యజమానికి వశుడు. ఆ యజమాని కూడా చట్టానికీ, ప్రభుత్వానికీ లోబడవలసిందే. సవ్యమైన పాలన అందించే ప్రభువు కూడా ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పాలించాలి. పూర్తి స్వతంత్రుడు కాలేడు. ఇక ప్రజాస్వామ్యమైతే, ప్రజలే స్వాములని పేరులోనే ఉంది. పాలకులు సేవకులు!ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే... జగత్తంతా దైవాధీనం. శివుడి ఆజ్ఞ లేకుండా చీమ చిటుక్కుమనడం కూడా జరగదని నమ్మకం. ‘నా వల్లనే ఈ జగత్తంతా నడుస్తుంది!’ – మత్తః సర్వ ప్రవర్తతే– అని గీతాచార్యుడి ప్రకటన. ‘పరమాత్మనైన నేను అధిష్ఠానంగా ఉంటుండగా, త్రిగుణాత్మకమైన నా మాయా శక్తి త్రిలోకాలను సృష్టిస్తుంది. భూతకోటి యావత్తూ ఈ మాయా శక్తి వశులై నడుస్తారు’ అంటాడు. అలాంటప్పుడు, ఇక ప్రాణులకు స్వాతంత్య్రం ఎక్కడ? ఏపాటి? పోనీ ఆ దైవం స్వతంత్రుడా అంటే, పూర్తి స్వతంత్రం ఆయనకూ లేదు. ఆ భగవంతుడిని తమ వశంలో ఉంచుకోగల వాళ్ళు కూడా ఉన్నారు.భాగవతంలో దుర్వాస మహర్షి అంబరీశుడిని అకారణంగా సంహరించబోగా, విష్ణుమూర్తి సుదర్శన చక్రం, తనకున్న దుష్ట శిక్షణ కర్తవ్యాన్ని అనుసరించి, తనంతట తానే మునీంద్రుడిని తరుముతూ వెళ్తుంది. దాన్ని తప్పించుకునే మార్గం తెలియక, తిరిగి తిరిగి ముని చివరికి విష్ణుమూర్తినే ప్రార్థిస్తాడు.‘నీ ఆయుధాన్ని ఉపసంహరించుకుని నన్ను రక్షించ’మని. ‘అంత స్వతంత్రం నాకెక్కడిది?’ అంటాడు విష్ణుమూర్తి. ‘అహం భక్త పరాధీనః, అస్వతంత్రః ఇవ ద్విజ!– ఓ మునీంద్రా, నేను నా భక్తుల అధీనంలో ఉండేవాడిని. అక్కడ నాకు స్వతంత్రం లేదు. నా హృదయం వాళ్ళకు బందీ. సద్గుణవతులైన స్త్రీలు, సత్పురుషులైన తమ భర్తలను వశం చేసుకొన్నట్టు, ఆ సాధువులు నన్ను వశం చేసుకుంటారు. నా ఆయుధాన్ని ఆపగల శక్తి అంబరీషుడికే ఉంది. నాకు లేదు!’ – ఎం. మారుతి శాస్త్రి -
విరజా నది
శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా భద్రాద్రి మీద కొలువై ఉంటాడు. నిజానికి వైకుంఠమే కొద్ది పాటి మార్పులతో భద్రాచల శిఖరం అయింది అంటాడు భక్తాగ్రేసరుడు భద్రాచల రామదాసు. అలాగే దక్షిణాది వైష్ణవులు శ్రీరంగ మహా క్షేత్రాన్ని వైకుంఠ ధామంగా భావిస్తారు. వాళ్లకు కావేరీ నదే విరజానది. ఆ విరజానదే ఈ కావేరి, శ్రీరంగనాథ ఆలయమే వైకుంఠం. శ్రీహరి విరజా తీరంలో, దివ్య భోగాలతో ఇందిరా సహితుడిగా ఎలా శోభిల్లుతుంటాడో, అచ్చం అలాగే కావేరీ తీరంలో శ్రీరంగధాముడై సౌఖ్య శ్రీలతో చెన్నారుతుంటాడు, అంటుంది శ్రీరంగ మహాత్మ్య కావ్యం. విరజ అనే పౌరాణిక నాయిక బ్రహ్మకైవర్త పురాణంలో కనిపిస్తుంది. ఈమె అతిలోక సౌందర్యవతి. రాధాకృష్ణులు నివసించే గోలోకంలోనే ఈమె నివాసం కూడా. ఈమె కూడా తన మధుర భక్తితో రాధా వల్లభు డిని వలచి, వలపించుకొన్న ధన్యురాలు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు విరజా దేవితో విహరిస్తుండగా, రాధాదేవి కంటబడతాడు. రాధాదేవి కోపించి, విరజను నదిగా మారిపొమ్మని శపిస్తుంది. నదీ రూపం పొందినా, విరజ వైకుంఠాన్ని తన తీరంలో కలుపుకొని, వైకుంఠుడయిన నారాయణుడితో సాన్ని హిత్యాన్ని కొనసాగిస్తూ ఆయనను సేవిస్తూనే ఉంది. విరజకు శ్రీహరి ద్వారా ఏడుగురు పుత్రులు కలిగారు. కానీ ఆ బిడ్డల ఆలనా, పాలనా, పోషణ తనను శ్రీకృష్ణ సాంగత్యానికి దూరం చేస్తున్నాయన్న వేదనతో, ఆమె తన సంతానాన్నే సప్త సముద్రాలుగా మార్చి వేసిందట. ‘అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు. అమా యకులైన పిల్లలనెందుకమ్మా అలా శపించావు?’ అని ప్రశ్నించాడట వైకుంఠంలో శ్రీహరి ఆంతరంగిక సేవ కులలో ఒకడైన సుదాముడు. దాంతో, విరజ ఆయన మీద కూడా కోపించి ‘నువ్వు రాక్షసుడిగా పుడతావు!’ అని శపించిందట. ఫలితంగా సుదాముడే శంఖ చూడుడనే రాక్షసుడిగా పుట్టాడు. పురాణ కథలు ప్రతీకాత్మకమైన పాత్రల ద్వారా, కథల ద్వారా ధర్మాన్ని, సన్మార్గాన్నీ బోధించుతాయి. ఈ కోణం నుంచి చూస్తే విరజా నది అంటే రజం లేనిది. రజం అంటే దుమ్మూ, ధూళీ, మాలిన్యం, కాలుష్యం. కాలుష్యం లేని పరిశుద్ధమైన, పావనమైన నది విరజా నది. కల్మషమూ, కాలుష్యమూ లేని శుద్ధ త్వాన్నీ, పవిత్రతనూ భగవంతుడైన శ్రీహరి అభిమా నిస్తాడు. కనుక ఆయన నివాసం విరజా నదీ తీరంలో. కల్మషం లేని, పరిశుద్ధతగల విరజమైన పరిసరాల లోనూ, అంతఃకరణాలలోనూ భగవంతుడు నెలవై ఉంటాడు. – ఎం. మారుతిశాస్త్రి -
విపులా చ పృథ్వీ
జ్యోతిర్మయం ‘కాలోహ్యయం నిరవధిః, విపులా చ పృథ్వీ’ అన్నాడు భవభూతి. ‘కొందరికి నేను రాసేది రుచించదు. పోని వ్వండి, వాళ్ల అభిరుచీ, విజ్ఞతా వాళ్లవి. నా కవిత్వం వాళ్లను ఉద్దేశించి రాయలేదు. నాలాంటి అభిరుచీ, దృక్పథం ఉన్నవాళ్లు కూడా ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ, ఎప్పుడో ఒకప్పుడు, పుట్టకపోరు. కాలం అవధులు లేనిది, పృథ్వి కూడా విశాలమైనదే!’ అంటాడు. ప్రతి ఘటనకూ దేశ, కాల, కర్తృత్వపరంగా ఒక చిరునామా ఉంటుంది. అందుకే పవిత్ర కార్యాలు ఆరంభించినప్పుడు కాలాన్నీ, దేశాన్నీ, కర్తనూ ఆయన ఉద్దేశాన్నీ ప్రస్తావిస్తూ సంకల్పం చెబుతారు. ఈ సంకల్పంలో కాలం ప్రస్తావన ‘శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ..’ అని మొదలవటం గమనార్హం. సృష్టికి బాధ్యుడయిన బ్రహ్మ, ఒక్కొక్క బ్రహ్మకు నూరేళ్ల ఆయుష్షు. దాన్ని మహాకల్పం అంటారు. అందులో మొదటి యాభై సం వత్సరాలు పద్మకల్పం. చివరి యాభై సంవత్సరాలూ వరాహ కల్పం. మనం ప్రస్తుత బ్రహ్మగారి ఆయుః పరిమితిలో ద్వితీయ పరార్ధంలో ఉన్నాం. అదే శ్వేత వరాహకల్పం. మనుషుల లెక్కలో కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు నాలుగూ ఒక మహాయుగం. అలాంటి వెయ్యి మహాయుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు. బ్రహ్మగారి ఇవ్వాళ్టి రోజున ఇప్పటికి ఇరవై ఏడు మహాయుగాలు గడిచి, ఇప్పుడు ఇరవైఎనిమిదో మహాయుగంలో, కలియుగం నడుస్తున్నది. ఇది మహాభారత యుద్ధమూ, కృష్ణ నిర్యాణమూ తరువాత ఆరంభమయింది. ఇంకా పదివేల సంవత్సరాలు కూడా కాలేదని లెక్క. అందుకే ఇది కలియుగం ప్రథమ పాదం. బ్రహ్మగారి ఉదయం నుంచి ఆయనకు రాత్రి అయ్యే లోపుగా పద్నాలుగుసార్లు అవాంతర ప్రళ యాలు సంభవించి, మళ్లీ సృష్టి జరుగుతుంది. ఈ పద్నాలుగు కాల భాగాలనూ పద్నాలుగు మన్వంత రాలు అంటారు. ప్రస్తుతం జరుగుతున్నది ఏడో మన్వం తరం. వైవస్వత మనువు దీనికి ప్రభువు కనుక ఇది వైవస్వత మన్వంతరం. ఈ కలియుగం ప్రథమ పాదంలో ప్రభవాది సంవత్సరాల చక్రంలో ప్రస్తుతం దుర్ముఖి నామ సంవత్సరం. అందులో ఇప్పుడు దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, చాంద్రమాన కాల గణన పద్ధతిలో ప్రస్తుతం ఆషాఢ మాసం, కృష్ణపక్షం వగైరా, వగైరా. ఆ అనంతమైన చక్రంలో మహా అయితే నూరు మానవ సంవత్సరాల స్వల్పకాలం ‘ఉదర నిమిత్తం బహుకృత వేషం’గా నాటకాలాడే మనిషి ఉనికి లిప్తపాటుకు లెక్క రాదు. అంత మాత్రానే మానవుడు సృష్టి, స్థితి, లయలను తనే శాసించగలననీ భ్రమించటం విడ్డూరం. (వ్యాసకర్త: ఎం. మారుతి శాస్త్రి) -
కురుక్షేత్ర యుద్ధం
జ్యోతిర్మయం కురుక్షేత్ర యుద్ధం కౌరవ పాండవుల మధ్య జరిగింది అంటాం. కురుక్షేత్ర యుద్ధం సర్వనాశనం అనే మాటకు సరైన, యథార్థమైన ఉదాహరణ. అందులో పాండవుల తరఫున ఏడు అక్షౌహిణీల సైన్యం, కౌరవుల తరఫున పదకొండు అక్షౌహిణీల సైన్యం, మొత్తం ఇరవై ఐదు లక్షల మంది సైనికులు యుద్ధం చేశారు. చివరకు మిగిలింది కేవలం పన్నెండు మంది ప్రముఖ వీరులు. పాండవుల పక్షాన పంచ పాండ వులూ, కృష్ణుడూ, సాత్యకీ, యుయుత్సువూ. కౌరవుల వైపు అశ్వత్థామా, కృపాచార్యుడూ, కృతవర్మా, వృష కేతుడూ మాత్రమే మిగిలారు. మరి లోకంలో ఉన్న వీరాధివీరులందరూ కలిసి ఇంతటి మహా యుద్ధం చేసి సాధించిందేమిటి? ధర్మం పూర్తిగా వదిలేసి అయినా, దాయాదులకు ఎంతటి ద్రోహం చేసి అయినా, చిరకాలం కురు రాజ్యాధిపతిగా ఉండి పోవాలన్న కాంక్షతో, అవధులు లేని అసూయతో, మొండితనంతో, మూర్ఖత్వంతో యుద్ధంలోకి దిగిన దుర్యోధనుడు బంధుమిత్ర పరివార సమేతంగా తన అసూయాగ్నిలో తనే భస్మమై పోయాడు. ఎంతో శ్రమపడి స్వపక్షం సర్వనాశనాన్ని సాధించాడు. గెలిచిన పక్షం సాధించింది కూడా, అది పోగొట్టు కొన్న దానితో పోలిస్తే స్వల్పమే. బంధువులనూ, మిత్రులనూ, పుత్రులనూ కోల్పోయి ధర్మరాజు ముప్పై ఆరు సంవత్సరాల స్వల్ప కాలం రాజ్యం అయితే చేశాడు కానీ, ఆ ‘నెత్తుటి కూడు’ ఆయనకు చెప్పుకోదగ్గ ఆనందాన్ని మిగిల్చినట్టు కనబడదు. ద్రౌపది తనకు జరిగిన పరాభ వాలకు ప్రతీకారం తీర్చుకొన్నట్టు అయింది కానీ ఆమె చెల్లించిన మూల్యం? దుస్సహమైన గర్భ శోకం! ఐదుగురు దివ్య పురుషులు ఆమె భర్తలు, కానీ కురు సింహాసనం మీద కూర్చోబెట్టేందుకు వారసుడు మాత్రం ఒక్కడూ మిగలలేదు. చివరికి, యుద్ధంలో కష్టపడి గెలుచుకొన్న రాజ్యానికి, ఆ యుద్ధానికి దారి తీసిన కారణాలతో ఎటువంటి సంబంధమూ లేని ఉత్తరాభిమన్యుల కుమారుడు పరీక్షిత్తు ఉత్తరాధికారి అయ్యాడు, అదీ కేవలం దైవానుగ్రహం వల్ల. యుద్ధాలకూ, పగలకూ, ప్రతీకారాలకు, కక్ష లకూ, కావేషాలకూ తరచుగా ఫలితం ఇంత మాత్రంగానే ఉంటుంది. రాగద్వేషాలూ, కామ క్రోధాలూ సుఖసాధనాలు కావు. రాజ భోగాలూ, ఐహిక సుఖాలూ నీటి బుడగల పాటివే. దృశ్య ప్రపంచమంతా క్షణ భంగురం. స్వధర్మ పాలన ఇహ పర శ్రేయస్సును ఇస్తుంది. ఫల వైరాగ్య బుద్ధితో ధర్మాచరణ చేయటం చిత్త శాంతిని కలిగిస్తుంది. వాచ్యంగా చెప్పినా, వ్యంగ్యంగా చెప్పినా, ధ్వన్యాత్మకంగా చెప్పినా మహా భారతం ముఖ్యంగా బోధించేది ఈ విషయమే. అందుకే మహాభారతాన్ని శ్రద్ధగా చదివే పాఠకుడికి కలిగేది వీర రసానుభవమో, బీభత్స రసానుభవమో మరొకటో కాదు, భారతంలో ఆద్యంతం ధ్వనించే ప్రధాన రసం శాంత రసం అంటారు ఆనంద వర్థనుడి వంటి ఆలంకారికులు. (వ్యాసకర్త: ఎం మారుతి శాస్త్రి)