కురుక్షేత్ర యుద్ధం
జ్యోతిర్మయం
కురుక్షేత్ర యుద్ధం కౌరవ పాండవుల మధ్య జరిగింది అంటాం. కురుక్షేత్ర యుద్ధం సర్వనాశనం అనే మాటకు సరైన, యథార్థమైన ఉదాహరణ. అందులో పాండవుల తరఫున ఏడు అక్షౌహిణీల సైన్యం, కౌరవుల తరఫున పదకొండు అక్షౌహిణీల సైన్యం, మొత్తం ఇరవై ఐదు లక్షల మంది సైనికులు యుద్ధం చేశారు. చివరకు మిగిలింది కేవలం పన్నెండు మంది ప్రముఖ వీరులు. పాండవుల పక్షాన పంచ పాండ వులూ, కృష్ణుడూ, సాత్యకీ, యుయుత్సువూ. కౌరవుల వైపు అశ్వత్థామా, కృపాచార్యుడూ, కృతవర్మా, వృష కేతుడూ మాత్రమే మిగిలారు.
మరి లోకంలో ఉన్న వీరాధివీరులందరూ కలిసి ఇంతటి మహా యుద్ధం చేసి సాధించిందేమిటి? ధర్మం పూర్తిగా వదిలేసి అయినా, దాయాదులకు ఎంతటి ద్రోహం చేసి అయినా, చిరకాలం కురు రాజ్యాధిపతిగా ఉండి పోవాలన్న కాంక్షతో, అవధులు లేని అసూయతో, మొండితనంతో, మూర్ఖత్వంతో యుద్ధంలోకి దిగిన దుర్యోధనుడు బంధుమిత్ర పరివార సమేతంగా తన అసూయాగ్నిలో తనే భస్మమై పోయాడు. ఎంతో శ్రమపడి స్వపక్షం సర్వనాశనాన్ని సాధించాడు.
గెలిచిన పక్షం సాధించింది కూడా, అది పోగొట్టు కొన్న దానితో పోలిస్తే స్వల్పమే. బంధువులనూ, మిత్రులనూ, పుత్రులనూ కోల్పోయి ధర్మరాజు ముప్పై ఆరు సంవత్సరాల స్వల్ప కాలం రాజ్యం అయితే చేశాడు కానీ, ఆ ‘నెత్తుటి కూడు’ ఆయనకు చెప్పుకోదగ్గ ఆనందాన్ని మిగిల్చినట్టు కనబడదు. ద్రౌపది తనకు జరిగిన పరాభ వాలకు ప్రతీకారం తీర్చుకొన్నట్టు అయింది కానీ ఆమె చెల్లించిన మూల్యం? దుస్సహమైన గర్భ శోకం! ఐదుగురు దివ్య పురుషులు ఆమె భర్తలు, కానీ కురు సింహాసనం మీద కూర్చోబెట్టేందుకు వారసుడు మాత్రం ఒక్కడూ మిగలలేదు. చివరికి, యుద్ధంలో కష్టపడి గెలుచుకొన్న రాజ్యానికి, ఆ యుద్ధానికి దారి తీసిన కారణాలతో ఎటువంటి సంబంధమూ లేని ఉత్తరాభిమన్యుల కుమారుడు పరీక్షిత్తు ఉత్తరాధికారి అయ్యాడు, అదీ కేవలం దైవానుగ్రహం వల్ల.
యుద్ధాలకూ, పగలకూ, ప్రతీకారాలకు, కక్ష లకూ, కావేషాలకూ తరచుగా ఫలితం ఇంత మాత్రంగానే ఉంటుంది. రాగద్వేషాలూ, కామ క్రోధాలూ సుఖసాధనాలు కావు. రాజ భోగాలూ, ఐహిక సుఖాలూ నీటి బుడగల పాటివే. దృశ్య ప్రపంచమంతా క్షణ భంగురం. స్వధర్మ పాలన ఇహ పర శ్రేయస్సును ఇస్తుంది. ఫల వైరాగ్య బుద్ధితో ధర్మాచరణ చేయటం చిత్త శాంతిని కలిగిస్తుంది. వాచ్యంగా చెప్పినా, వ్యంగ్యంగా చెప్పినా, ధ్వన్యాత్మకంగా చెప్పినా మహా భారతం ముఖ్యంగా బోధించేది ఈ విషయమే.
అందుకే మహాభారతాన్ని శ్రద్ధగా చదివే పాఠకుడికి కలిగేది వీర రసానుభవమో, బీభత్స రసానుభవమో మరొకటో కాదు, భారతంలో ఆద్యంతం ధ్వనించే ప్రధాన రసం శాంత రసం అంటారు ఆనంద వర్థనుడి వంటి ఆలంకారికులు.
(వ్యాసకర్త: ఎం మారుతి శాస్త్రి)