జ్యోతిర్మయం
‘కాలోహ్యయం నిరవధిః, విపులా చ పృథ్వీ’ అన్నాడు భవభూతి. ‘కొందరికి నేను రాసేది రుచించదు. పోని వ్వండి, వాళ్ల అభిరుచీ, విజ్ఞతా వాళ్లవి. నా కవిత్వం వాళ్లను ఉద్దేశించి రాయలేదు. నాలాంటి అభిరుచీ, దృక్పథం ఉన్నవాళ్లు కూడా ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ, ఎప్పుడో ఒకప్పుడు, పుట్టకపోరు. కాలం అవధులు లేనిది, పృథ్వి కూడా విశాలమైనదే!’ అంటాడు.
ప్రతి ఘటనకూ దేశ, కాల, కర్తృత్వపరంగా ఒక చిరునామా ఉంటుంది. అందుకే పవిత్ర కార్యాలు ఆరంభించినప్పుడు కాలాన్నీ, దేశాన్నీ, కర్తనూ ఆయన ఉద్దేశాన్నీ ప్రస్తావిస్తూ సంకల్పం చెబుతారు. ఈ సంకల్పంలో కాలం ప్రస్తావన ‘శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ..’ అని మొదలవటం గమనార్హం. సృష్టికి బాధ్యుడయిన బ్రహ్మ, ఒక్కొక్క బ్రహ్మకు నూరేళ్ల ఆయుష్షు. దాన్ని మహాకల్పం అంటారు. అందులో మొదటి యాభై సం వత్సరాలు పద్మకల్పం. చివరి యాభై సంవత్సరాలూ వరాహ కల్పం. మనం ప్రస్తుత బ్రహ్మగారి ఆయుః పరిమితిలో ద్వితీయ పరార్ధంలో ఉన్నాం. అదే శ్వేత వరాహకల్పం.
మనుషుల లెక్కలో కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు నాలుగూ ఒక మహాయుగం. అలాంటి వెయ్యి మహాయుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు.
బ్రహ్మగారి ఇవ్వాళ్టి రోజున ఇప్పటికి ఇరవై ఏడు మహాయుగాలు గడిచి, ఇప్పుడు ఇరవైఎనిమిదో మహాయుగంలో, కలియుగం నడుస్తున్నది. ఇది మహాభారత యుద్ధమూ, కృష్ణ నిర్యాణమూ తరువాత ఆరంభమయింది. ఇంకా పదివేల సంవత్సరాలు కూడా కాలేదని లెక్క. అందుకే ఇది కలియుగం ప్రథమ పాదం.
బ్రహ్మగారి ఉదయం నుంచి ఆయనకు రాత్రి అయ్యే లోపుగా పద్నాలుగుసార్లు అవాంతర ప్రళ యాలు సంభవించి, మళ్లీ సృష్టి జరుగుతుంది. ఈ పద్నాలుగు కాల భాగాలనూ పద్నాలుగు మన్వంత రాలు అంటారు. ప్రస్తుతం జరుగుతున్నది ఏడో మన్వం తరం. వైవస్వత మనువు దీనికి ప్రభువు కనుక ఇది వైవస్వత మన్వంతరం.
ఈ కలియుగం ప్రథమ పాదంలో ప్రభవాది సంవత్సరాల చక్రంలో ప్రస్తుతం దుర్ముఖి నామ సంవత్సరం. అందులో ఇప్పుడు దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, చాంద్రమాన కాల గణన పద్ధతిలో ప్రస్తుతం ఆషాఢ మాసం, కృష్ణపక్షం వగైరా, వగైరా.
ఆ అనంతమైన చక్రంలో మహా అయితే నూరు మానవ సంవత్సరాల స్వల్పకాలం ‘ఉదర నిమిత్తం బహుకృత వేషం’గా నాటకాలాడే మనిషి ఉనికి లిప్తపాటుకు లెక్క రాదు. అంత మాత్రానే మానవుడు సృష్టి, స్థితి, లయలను తనే శాసించగలననీ భ్రమించటం విడ్డూరం.
(వ్యాసకర్త: ఎం. మారుతి శాస్త్రి)