తగిన మర్యాద
జ్యోతిర్మయం
గురువులు, అతిథులు, వయసులో పెద్దలు, సత్కార్యాచరణపరులు, జ్ఞానులు, బంధుమిత్రులు ఇలా ఎందరో మహానుభావులు దర్శనం ఇస్తూ ఉంటారు. వారికి తగిన మర్యాద చేయాలి. గౌరవించ వలసినవారిని గౌరవించకపోతే మనం పొందవలసిన శ్రేయస్సును పొందలేం, ‘ప్రతిబధ్నాతి హి శ్రేయః పూజ్య పూజావ్యతిక్రమాత్’ అంటాడు కాళిదాసు.
హనుమంతుడు చొరవ చూపి శ్రీరామ సుగ్రీవు లకు మైత్రిని కుదిర్చాడు. ఇప్పటి నుండి సుఖ దుఃఖా లలో ఒకరికొకరు తోడుగా ఉందామని ఇద్దరూ భావించారు. ఆ తర్వాత సుగ్రీవుడు దట్టంగా ఆకులూ, పూలూ నిండిన సాలవృక్ష శాఖను తెచ్చి రామునికి ఆసనంగా అమర్చాడు. కాని శ్రీరామునికి బహిఃప్రాణం లాంటి లక్ష్మణస్వామికి మాత్రం ఆ ఏర్పాటు చేయలేదు. పరివారంతో వచ్చినప్పుడు ప్రభువుతో పాటు, వెంట వచ్చినవారికి కూడా మర్యాదను చేయాలనే విషయాన్ని సుగ్రీవుడు మరిచాడు. లోకజ్ఞానంతో కూడిన శాస్త్రజ్ఞానం మెండుగా ఉన్న హనుమంతుడు సుగ్రీవుని పొరపాటును గుర్తించాడు. వెంటనే శ్రీరామ సేవాతత్పరుడైన లక్ష్మణస్వామికి చందనపు చెట్టుకొమ్మను తెచ్చి ఆసనంగా ఉంచాడు.
శ్రీరాముని బలాన్ని తోడుగా చేసుకొని రెట్టించిన బలంతో వాలితో యుద్ధానికి తలపడినప్పటికీ లక్ష్మణునికి తగిన మర్యాద చేయనందుననే సుగ్రీవుడు వాలి చేతిలో పరాభవాన్ని మూటకట్టుకున్నాడని పూర్వుల అభిప్రాయం. అరణ్యవాసంలోనున్న శ్రీరాముని ఒప్పించి తిరిగి అయోధ్యకు తీసుకు వచ్చేందుకు భరతుడు మంత్రి పురోహితులతో, బంధుమిత్రులతో, సైన్యంతో కలసి బయలుదేరాడు. మార్గమధ్యంలో భరద్వాజ మహర్షిని దర్శించి మనసులోని మాట చెప్పాడు. రాజ్యంపై ఆశ లేకుండా అన్నగారికి రాజ్యాన్ని అప్పగించదలచిన భరతునికీ, పరివారానికీ భరద్వాజ మహర్షి విందు ఏర్పాటుచేశాడు. ఆ విందును ఆస్వాదించిన భరతుని సైనికులు తన్మయత్వంతో మేము శ్రీరామచంద్రుడు ఉండే దండకారణ్యానికి కానీ, అయోధ్యకుగానీ వెళ్లాలని భావించడం లేదు. ‘‘నైవాయోధ్యం గమిష్యామః న గమిష్యామః దండకాన్’’ అన్నారు. అంత గొప్పగా భరద్వాజుడు భరతుని పరివారానికి మర్యాద చేశాడు. మన పూర్వుల ఆచరణను ఆదర్శంగా గ్రహించాలి. తమ శక్తికీ, ఎదుటివారి స్థాయికీ తగిన మర్యాదను చేయవలసిన ఆవశ్యకతను గుర్తించాలి.
(వ్యాసకర్త : సముద్రాల శఠగోపాచార్యులు)