దుఃఖ పరంపర
వివేక సంపన్నుడైన మానవుడు మంచి, చెడులను గుర్తించగలుగుతాడు. అద్భుత కార్యాచరణతో చరిత్రలో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. అయితే మానవునికి అడుగడుగునా ఎదురయ్యే విఘ్నాలు, బాధలు అతడిని దుఃఖ సముద్రంలో ముంచేస్తుంటాయి. బాల్యంలో దుఃఖాలకు చోటు లేదు అనిపిస్తుంది. కానీ యుక్తాయుక్త విచక్షణా జ్ఞాన ముండదు. అందువల్ల ప్రతి పనీ యోగ్యమైనదనే అని పిస్తుంది. అందుకే బాల్య చేష్టల వల్ల ఎన్నో దుఃఖాలను పొందవలసి వస్తుంది. బాల్యావస్థను దాటి యౌవనం లోకి అడుగుపెట్టిన వారికి శరీరంలో పటుత్వం ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగు తారు. పైగా యుక్తాయుక్తములను విచారించగల శక్తి యుక్తులు కూడా ఉంటాయి. కానీ యౌవనంలో మనస్సు, ఇంద్రియాలు భోగానుభ వమునకై ప్రేరేపిస్తుంటాయి. వ్యక్తిని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. యుక్త వయస్సులో ఉన్నవారిలో ఏ కొద్ది మందో తప్ప, అంతా సుఖానుభవమును పొందే ప్రయత్నంలో అనేక విధములైన దుఃఖాలను పొందుతూ ఉంటారు.
ఇక ముసలితనంలో కోరికలు తగ్గుముఖం పడు తాయి. ఈ సమయంలోనైనా శాశ్వతానందాన్ని పొందగల కార్యాలను నిర్వహిద్దామనుకుంటే... శారీ రక బలహీనతవల్ల మనస్సు నీరసపడుతుంది. బుద్ధి చలిస్తూ ఉంటుంది. నిరాశా నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. ఈ విధంగా మనిషి జీవితంలో దుఃఖ పరం పరయే రాజ్యమేలుతూ ఉంటుంది.
‘‘నిర్వివేకతయా బాల్యం కామోన్మాదేన యౌవనం ‘
వృద్ధత్వం వికలత్వేన సదా సోపద్రవం నృణామ్’’
అనే శ్లోకం అదే వెల్లడిస్తుంది.
ఈ చరాచర ప్రపంచం శాశ్వతమైనది కాదు. ఈ శరీరమూ నశించిపోయే స్వభావాన్ని కలిగినట్టిది. అయినప్పటికీ కూడా జనులు ఈ శరీర సౌఖ్యం కొరకు పడరాని పాట్లు పడుతూ ఆశ్చర్యకరమైన రీతిలో దుఃఖ పరంపరను పొందుతున్నారు
‘‘నిఖిలం జగదేవ నశ్వరం పునరస్మిన్ నితరాం కలేబరమ్ ‘
అథ తస్య కృతే కియానయం క్రియతే హన్త జనైః పరిశ్రమః’’ అనే శ్లోకం అదే చెబుతోంది.
‘‘వాస్తవాన్ని గుర్తించలేని స్థితిలోనున్న ఓ జను లారా! చెడు తలంపుతో జీవనయానాన్ని సాగించే మానవులారా! ఈ శరీరం కూడా సహజంగానే పరి మితమైన శక్తిని కలిగినట్టిది. వయసు పెరిగిన కొద్దీ మరింత బలహీనంగా తయారగునట్టిది. వృద్ధా ప్యంలో రోగాలతో కృశించి పోవునట్టిది. ఎన్నెన్ని ఔష ధాలు సేవించినా ఇట్టి శరీరానికి స్వస్థత చేకూరు తుందా? మరణం రాకుండా ఆగుతుందా? అందు వల్ల శ్రీకృష్ణ నామాన్ని మంత్రంగా భావించి నోరారా పలుకండి, ఔషధంగా స్వీకరించి ఆరోగ్యాన్ని పొందండి లేదా హృదయాభరణంగా ధరించండి’’ అని కులశేఖరులు అనే ఆళ్వార్లు ముకుందమాల అనే స్తోత్రంలో బోధించారు. మన పూర్వుల ఉపదేశాలను శిరసా వహిద్దాం.
– సముద్రాల శఠగోపాచార్యులు