చర్యల ఉద్దేశం
వ్యక్తులు చేసే పనులు, మాట్లాడే మాటలు మంచివా, చెడ్డవా అని ప్రధానంగా నిర్ణయించేది వాటి ఉద్దేశాన్ని బట్టే కాని పైకి కనిపించేవాటిని బట్టి కాదు.
ప్రాణులను హింసించరాదు. మారణాయుధా లతో ఏ ప్రాణినీ గాయపర్చరాదు అనేది నీతి. కాని ప్రమాదాలు, ఇతరుల దాడుల్లో గాయపడిన వారికి ప్రాణహాని సంభవించకూడదనే ఉద్దేశంతో వైద్యులు రోగులకు శస్త్రచికిత్స చేస్తూ ఉంటారు. ఆ సమ యంలో వారు ఉపయోగించే పరికరాలపై ఎవరూ ఆంక్షలు విధించరు. ఎందుకంటే వారు రక్షించే ఉద్దే శంతోటే వైద్యం చేశారు. ప్రాణాలు నిలిపారు.
అలాగే భగవంతుడు కూడా భక్తులు సమర్పించే పూలనో, పండ్లనో, వస్తువులనో, పదార్థాలనో కాకుండా భక్తుల ఉద్దేశాన్ని గ్రహిస్తాడు. వారు మంచి ఉద్దేశంతో సమర్పించారా లేదా అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తాడని ‘భావ గ్రాహీ జనార్దనః’ అనే వాక్యం స్పష్టం చేస్తుంది.
హనుమంతుడు లంకా నగ రంలో ప్రవేశించిన తర్వాత సీతమ్మను వెతుకుతూ రావణాసురుని అంతఃపురంలోకి ప్రవేశించాడు. అంతఃపుర కాంతలెందరో హనుమం తునికి కనిపించారు కానీ సీతమ్మ దర్శనం కాలేదు. రావణుని శయన మందిరంలో నిద్రిస్తున్న వనితలను ఎందరినో చూశాను కానీ దానివల్ల నాకు ఏదైనా ధర్మలోపం ఏర్పడుతుందేమో అని హనుమంతుడు ముందుగా సంశయగ్రస్తుడయ్యాడు. కానీ పర్యాలో చన చేసిన తర్వాత, సీతమ్మను వెతికే దృష్టితోనే రావ ణుని అంతఃపుర కాంతలను చూశాను కానీ నాకు వేరే ఉద్దేశం లేనందున నేను చేసిన పనిలో ధర్మ విరుద్ధ మైన అంశం కానరావడం లేదని హనుమంతుడు నిర్ధారించుకున్నాడు.
అంటే మంచి పనిలో కానీ, చెడు పనిలో కానీ ఇంద్రియాలను అన్నింటినీ ప్రవర్తింపచేసేది మనస్సే. ఆ మనస్సు నా వశంలోనే ఉన్నది. నా మనస్సులో కాని నా దృష్టిలో కాని చేష్టలలో కాని ఏ దురుద్దేశమూ లేనందున ప్రాజ్ఞులెవరూ నేను చేసిన పనిని తప్పుపట్ట రని హనుమంతుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. సమాజ హితాన్ని కోరేవారు, సద్గురువులు ప్రాచీన కాలంలో శాస్త్రకర్తలు ఏర్పరచిన నియమా లను కొన్నింటిని కొన్ని సందర్భాలలో ఉల్లంఘిం చినట్లు పైకి కన్పిస్తుండవచ్చు. కానీ వారలా ప్రవర్తిం చడానికి కారణమేమిటి? వారి ఉద్దేశం ఏమిటి అని ముందు తెలుసుకోవాలి. అపుడే వారు చేసిన పనిలో దాగివున్న ఆంతర్యం ఏమిటో బోధపడుతుంది.
ఎక్కువమందికి మేలు కలిగించే ఉద్దేశంతో కాలానుగుణంగా కొన్ని నియమాలను ఉల్లంఘిం చినా తప్పులేదనే వాస్తవాన్ని గుర్తిద్దాం.
( సముద్రాల శఠగోపాచార్యులు )