Samudrala Sethagopacharyulu
-
చర్యల ఉద్దేశం
వ్యక్తులు చేసే పనులు, మాట్లాడే మాటలు మంచివా, చెడ్డవా అని ప్రధానంగా నిర్ణయించేది వాటి ఉద్దేశాన్ని బట్టే కాని పైకి కనిపించేవాటిని బట్టి కాదు. ప్రాణులను హింసించరాదు. మారణాయుధా లతో ఏ ప్రాణినీ గాయపర్చరాదు అనేది నీతి. కాని ప్రమాదాలు, ఇతరుల దాడుల్లో గాయపడిన వారికి ప్రాణహాని సంభవించకూడదనే ఉద్దేశంతో వైద్యులు రోగులకు శస్త్రచికిత్స చేస్తూ ఉంటారు. ఆ సమ యంలో వారు ఉపయోగించే పరికరాలపై ఎవరూ ఆంక్షలు విధించరు. ఎందుకంటే వారు రక్షించే ఉద్దే శంతోటే వైద్యం చేశారు. ప్రాణాలు నిలిపారు. అలాగే భగవంతుడు కూడా భక్తులు సమర్పించే పూలనో, పండ్లనో, వస్తువులనో, పదార్థాలనో కాకుండా భక్తుల ఉద్దేశాన్ని గ్రహిస్తాడు. వారు మంచి ఉద్దేశంతో సమర్పించారా లేదా అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తాడని ‘భావ గ్రాహీ జనార్దనః’ అనే వాక్యం స్పష్టం చేస్తుంది. హనుమంతుడు లంకా నగ రంలో ప్రవేశించిన తర్వాత సీతమ్మను వెతుకుతూ రావణాసురుని అంతఃపురంలోకి ప్రవేశించాడు. అంతఃపుర కాంతలెందరో హనుమం తునికి కనిపించారు కానీ సీతమ్మ దర్శనం కాలేదు. రావణుని శయన మందిరంలో నిద్రిస్తున్న వనితలను ఎందరినో చూశాను కానీ దానివల్ల నాకు ఏదైనా ధర్మలోపం ఏర్పడుతుందేమో అని హనుమంతుడు ముందుగా సంశయగ్రస్తుడయ్యాడు. కానీ పర్యాలో చన చేసిన తర్వాత, సీతమ్మను వెతికే దృష్టితోనే రావ ణుని అంతఃపుర కాంతలను చూశాను కానీ నాకు వేరే ఉద్దేశం లేనందున నేను చేసిన పనిలో ధర్మ విరుద్ధ మైన అంశం కానరావడం లేదని హనుమంతుడు నిర్ధారించుకున్నాడు. అంటే మంచి పనిలో కానీ, చెడు పనిలో కానీ ఇంద్రియాలను అన్నింటినీ ప్రవర్తింపచేసేది మనస్సే. ఆ మనస్సు నా వశంలోనే ఉన్నది. నా మనస్సులో కాని నా దృష్టిలో కాని చేష్టలలో కాని ఏ దురుద్దేశమూ లేనందున ప్రాజ్ఞులెవరూ నేను చేసిన పనిని తప్పుపట్ట రని హనుమంతుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. సమాజ హితాన్ని కోరేవారు, సద్గురువులు ప్రాచీన కాలంలో శాస్త్రకర్తలు ఏర్పరచిన నియమా లను కొన్నింటిని కొన్ని సందర్భాలలో ఉల్లంఘిం చినట్లు పైకి కన్పిస్తుండవచ్చు. కానీ వారలా ప్రవర్తిం చడానికి కారణమేమిటి? వారి ఉద్దేశం ఏమిటి అని ముందు తెలుసుకోవాలి. అపుడే వారు చేసిన పనిలో దాగివున్న ఆంతర్యం ఏమిటో బోధపడుతుంది. ఎక్కువమందికి మేలు కలిగించే ఉద్దేశంతో కాలానుగుణంగా కొన్ని నియమాలను ఉల్లంఘిం చినా తప్పులేదనే వాస్తవాన్ని గుర్తిద్దాం. ( సముద్రాల శఠగోపాచార్యులు ) -
దుఃఖ పరంపర
వివేక సంపన్నుడైన మానవుడు మంచి, చెడులను గుర్తించగలుగుతాడు. అద్భుత కార్యాచరణతో చరిత్రలో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. అయితే మానవునికి అడుగడుగునా ఎదురయ్యే విఘ్నాలు, బాధలు అతడిని దుఃఖ సముద్రంలో ముంచేస్తుంటాయి. బాల్యంలో దుఃఖాలకు చోటు లేదు అనిపిస్తుంది. కానీ యుక్తాయుక్త విచక్షణా జ్ఞాన ముండదు. అందువల్ల ప్రతి పనీ యోగ్యమైనదనే అని పిస్తుంది. అందుకే బాల్య చేష్టల వల్ల ఎన్నో దుఃఖాలను పొందవలసి వస్తుంది. బాల్యావస్థను దాటి యౌవనం లోకి అడుగుపెట్టిన వారికి శరీరంలో పటుత్వం ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగు తారు. పైగా యుక్తాయుక్తములను విచారించగల శక్తి యుక్తులు కూడా ఉంటాయి. కానీ యౌవనంలో మనస్సు, ఇంద్రియాలు భోగానుభ వమునకై ప్రేరేపిస్తుంటాయి. వ్యక్తిని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. యుక్త వయస్సులో ఉన్నవారిలో ఏ కొద్ది మందో తప్ప, అంతా సుఖానుభవమును పొందే ప్రయత్నంలో అనేక విధములైన దుఃఖాలను పొందుతూ ఉంటారు. ఇక ముసలితనంలో కోరికలు తగ్గుముఖం పడు తాయి. ఈ సమయంలోనైనా శాశ్వతానందాన్ని పొందగల కార్యాలను నిర్వహిద్దామనుకుంటే... శారీ రక బలహీనతవల్ల మనస్సు నీరసపడుతుంది. బుద్ధి చలిస్తూ ఉంటుంది. నిరాశా నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. ఈ విధంగా మనిషి జీవితంలో దుఃఖ పరం పరయే రాజ్యమేలుతూ ఉంటుంది. ‘‘నిర్వివేకతయా బాల్యం కామోన్మాదేన యౌవనం ‘ వృద్ధత్వం వికలత్వేన సదా సోపద్రవం నృణామ్’’ అనే శ్లోకం అదే వెల్లడిస్తుంది. ఈ చరాచర ప్రపంచం శాశ్వతమైనది కాదు. ఈ శరీరమూ నశించిపోయే స్వభావాన్ని కలిగినట్టిది. అయినప్పటికీ కూడా జనులు ఈ శరీర సౌఖ్యం కొరకు పడరాని పాట్లు పడుతూ ఆశ్చర్యకరమైన రీతిలో దుఃఖ పరంపరను పొందుతున్నారు ‘‘నిఖిలం జగదేవ నశ్వరం పునరస్మిన్ నితరాం కలేబరమ్ ‘ అథ తస్య కృతే కియానయం క్రియతే హన్త జనైః పరిశ్రమః’’ అనే శ్లోకం అదే చెబుతోంది. ‘‘వాస్తవాన్ని గుర్తించలేని స్థితిలోనున్న ఓ జను లారా! చెడు తలంపుతో జీవనయానాన్ని సాగించే మానవులారా! ఈ శరీరం కూడా సహజంగానే పరి మితమైన శక్తిని కలిగినట్టిది. వయసు పెరిగిన కొద్దీ మరింత బలహీనంగా తయారగునట్టిది. వృద్ధా ప్యంలో రోగాలతో కృశించి పోవునట్టిది. ఎన్నెన్ని ఔష ధాలు సేవించినా ఇట్టి శరీరానికి స్వస్థత చేకూరు తుందా? మరణం రాకుండా ఆగుతుందా? అందు వల్ల శ్రీకృష్ణ నామాన్ని మంత్రంగా భావించి నోరారా పలుకండి, ఔషధంగా స్వీకరించి ఆరోగ్యాన్ని పొందండి లేదా హృదయాభరణంగా ధరించండి’’ అని కులశేఖరులు అనే ఆళ్వార్లు ముకుందమాల అనే స్తోత్రంలో బోధించారు. మన పూర్వుల ఉపదేశాలను శిరసా వహిద్దాం. – సముద్రాల శఠగోపాచార్యులు -
తగిన మర్యాద
జ్యోతిర్మయం గురువులు, అతిథులు, వయసులో పెద్దలు, సత్కార్యాచరణపరులు, జ్ఞానులు, బంధుమిత్రులు ఇలా ఎందరో మహానుభావులు దర్శనం ఇస్తూ ఉంటారు. వారికి తగిన మర్యాద చేయాలి. గౌరవించ వలసినవారిని గౌరవించకపోతే మనం పొందవలసిన శ్రేయస్సును పొందలేం, ‘ప్రతిబధ్నాతి హి శ్రేయః పూజ్య పూజావ్యతిక్రమాత్’ అంటాడు కాళిదాసు. హనుమంతుడు చొరవ చూపి శ్రీరామ సుగ్రీవు లకు మైత్రిని కుదిర్చాడు. ఇప్పటి నుండి సుఖ దుఃఖా లలో ఒకరికొకరు తోడుగా ఉందామని ఇద్దరూ భావించారు. ఆ తర్వాత సుగ్రీవుడు దట్టంగా ఆకులూ, పూలూ నిండిన సాలవృక్ష శాఖను తెచ్చి రామునికి ఆసనంగా అమర్చాడు. కాని శ్రీరామునికి బహిఃప్రాణం లాంటి లక్ష్మణస్వామికి మాత్రం ఆ ఏర్పాటు చేయలేదు. పరివారంతో వచ్చినప్పుడు ప్రభువుతో పాటు, వెంట వచ్చినవారికి కూడా మర్యాదను చేయాలనే విషయాన్ని సుగ్రీవుడు మరిచాడు. లోకజ్ఞానంతో కూడిన శాస్త్రజ్ఞానం మెండుగా ఉన్న హనుమంతుడు సుగ్రీవుని పొరపాటును గుర్తించాడు. వెంటనే శ్రీరామ సేవాతత్పరుడైన లక్ష్మణస్వామికి చందనపు చెట్టుకొమ్మను తెచ్చి ఆసనంగా ఉంచాడు. శ్రీరాముని బలాన్ని తోడుగా చేసుకొని రెట్టించిన బలంతో వాలితో యుద్ధానికి తలపడినప్పటికీ లక్ష్మణునికి తగిన మర్యాద చేయనందుననే సుగ్రీవుడు వాలి చేతిలో పరాభవాన్ని మూటకట్టుకున్నాడని పూర్వుల అభిప్రాయం. అరణ్యవాసంలోనున్న శ్రీరాముని ఒప్పించి తిరిగి అయోధ్యకు తీసుకు వచ్చేందుకు భరతుడు మంత్రి పురోహితులతో, బంధుమిత్రులతో, సైన్యంతో కలసి బయలుదేరాడు. మార్గమధ్యంలో భరద్వాజ మహర్షిని దర్శించి మనసులోని మాట చెప్పాడు. రాజ్యంపై ఆశ లేకుండా అన్నగారికి రాజ్యాన్ని అప్పగించదలచిన భరతునికీ, పరివారానికీ భరద్వాజ మహర్షి విందు ఏర్పాటుచేశాడు. ఆ విందును ఆస్వాదించిన భరతుని సైనికులు తన్మయత్వంతో మేము శ్రీరామచంద్రుడు ఉండే దండకారణ్యానికి కానీ, అయోధ్యకుగానీ వెళ్లాలని భావించడం లేదు. ‘‘నైవాయోధ్యం గమిష్యామః న గమిష్యామః దండకాన్’’ అన్నారు. అంత గొప్పగా భరద్వాజుడు భరతుని పరివారానికి మర్యాద చేశాడు. మన పూర్వుల ఆచరణను ఆదర్శంగా గ్రహించాలి. తమ శక్తికీ, ఎదుటివారి స్థాయికీ తగిన మర్యాదను చేయవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. (వ్యాసకర్త : సముద్రాల శఠగోపాచార్యులు)