భారత దేశంలో అత్యధిక భక్తుల చేత నిత్యం ఆరాధించబడుతున్న దైవం ఆంజనేయ స్వామి. పురాణాల్లో ఏ దేవునికీ లేని ప్రత్యేకత హనుమంతుని సొంతం. హనుమంతుడు గొప్ప వ్యాకరణశాస్త్ర పండితుడు. బాల్యంలో కఠోర దీక్షతో, శ్రద్ధగా సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాలు తెలిసిన వ్యక్తి. ఎదుటివారిని ఆకట్టుకునేలా ప్రసంగించే వాక్చాతుర్యం ఆయన సొంతం.
ఈ అద్భుత తెలివితేటలే శ్రీరామ–సుగ్రీవ మైత్రిని కలిసేలా చేసింది. శ్రీరాముణ్ణి యజమానిగా, సుగ్రీవుణ్ణి మహారాజుగా ఇద్దరికీ సమ ప్రాధాన్యత నిచ్చాడు. లంకలో రావణునికి నీతి వచనాలతో హిత బోధ చేశాడు. మనం హనుమంతుని జీవిత చరిత్ర నుండి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వారిని మెప్పించే నైపుణ్యం, యజమాని (మనం పని చేసే డిపార్ట్‌మెంట్/కంపెనీ) పట్ల పూర్తి విధేయత, నమ్మకం, సంపూర్ణ విశ్వసనీయతతో ఎలా ఉండాలి వంటివి నేర్చుకోవచ్చు.
ఇంతేనా... ఆయన నుంచి నేర్చుకోవలసిన సుగుణాలు చాలానే ఉన్నాయి. ఎదుటివారిపట్ల సముచిత గౌరవం, నమ్మిన వారి కోసం ఏమైనా చేసే త్యాగనిరతి, శత్రువుల పట్ల సమ న్యాయబద్ధంగా వ్యవహరించే మాటతీరు, గురువు పట్ల నిస్వార్థ భక్తి భావన, రాజ్యం పట్ల సైనికుడిగా విద్యుక్త ధర్మం, నిరాడంబర జీవనం, అన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస, ధర్మరక్షణ కోసం శ్రమించే వీరత్వం, ఆపద సమయంలో ప్రదర్శించే ఆత్మ విశ్వాసం లాంటివి ముఖ్యమైనవి.
తాను ఎంత బలవంతుడైనప్పటికీ అతి సాధారణంగా జీవించడం హనుమంతుడు మనకు నేర్పాడు. సముద్రాన్ని దాటినా, లంకను సగం కాల్చినా, సీతమ్మను తీసుకువచ్చే బలం ఉన్నా... ఎప్పుడూ పొంగిపోలేదు. సుగ్రీవుని వేలాది సైన్యంలో తానూ ఒక సైనికుడిగా రాచకార్యంలో భాగంగానే ఈ పనులు నిర్వర్తించానని భావించాడు. ఇంత చేసి అంత చెప్పుకునే చాలామందికి హనుమాన్ కనువిప్పు. ఆధునిక భావి తరానికి చక్కని మార్గదర్శి. హనుమంతుని జీవనాన్ని అధ్యయనం చేసిన వారికే ఆ గొప్పతనం తెలుస్తుంది. – భైతి దుర్గయ్య (నేడు హనుమాన్ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment