కొండలు, కోనలు, అడవులు, పక్షులు, పశువులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు-ఇవన్నీ మనల్ని ప్రేరేపిస్తాయి. ఏకాగ్రచిత్తంతో ప్రకృతిని పరిశీలిస్తూ పోగా, పోగా అది అద్భుతం అనిపిస్తుంది! ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రకృతి పరిశీలకులుగా ఆరంభించి ఆ ప్రకృతి ప్రేమికులుగా, ఆరాధకులుగా మారిపోతాం. దత్తా త్రేయుని లాగా, ఆంగ్లకవి విలియం వర్డ్స్‌వర్త్ లాగా ప్రకృతిని మన గురువుగా, దైవంగా పరిగణిస్తాం. అయితే అక్కడే ఆగిపోతే కేవలం హేతువాదులుగా, భౌతిక వాదులుగా మిగిలిపోతాం. లేదా నాస్తికులుగా మిగిలిపోయే అపాయం కూడాఉంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ‘‘భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉది. ఈ ప్రకృతిని ‘అపరా’ లేక ‘జడ ప్రకృతి’ అని అంటారు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరొకప్రకృతి ఉంది. అదే నా జీవ రూప పరాప్రకృతి’ లేక ‘చేతన ప్రకృతి’ అని తెలుసుకో’’ (భగవద్గీత 7–అ 4, 5 శ్లోకాలు).
అంటే... జడప్రకృతి, చేతనా ప్రకృతి అనేవి దైవం అనే నాణేనికి రెండు వైపులన్నమాట (బొమ్మ, బొరుసు)! జడప్రకృతిని పరిశీలించి,ప్రేమించి, ఆరాధిస్తున్నవారు అంతటితో తృప్తి పడక చేతనా ప్రకృతిని కూడా పరిశీలించి, పరిశోధించటానికి పరిశ్రమిస్తే– అంటే రెండో వైపును కూడా చూడటానికి ప్రయత్నించి చూస్తే వారే దార్శనికులు, ద్రష్టలు, ఋషులు అవుతారు; పరిపూర్ణ ఆస్తికులవుతారు. అయితే తమాషా ఏంటంటే కొంతమంది కనపడే ప్రకృతిని మాత్రమే నమ్మి నాస్తికులవుతారు. మరి కొందరు కనపడని దైవాన్ని గుడ్డిగా నమ్మి ప్రత్యక్షంగా కనబడే దైవ ప్రతిరూపాలే అయిన మనుషులను దూషిస్తారు, ద్వేషిస్తారు. దైవానికి ఉన్న రెండు వైపులను చూసినవారు పరా ప్రకృతిని, అపరా ప్రకృతిని ప్రేమిస్తారు, పూజిస్తారు. దేన్నీ నిరాకరించరు. వారే నిజమైన ఆధ్యాత్మికత్వం కలవారు, స్వచ్ఛమైన ఆస్తికులు.
– రాచమడుగు శ్రీనివాసులు అసలైన ఆస్తికులు
Comments
Please login to add a commentAdd a comment