
వేసవి వచ్చిందంటే చాలు... ఫ్యాన్ నాన్ స్టాప్‌గా తిరగాల్సిందే. ఏసీ ఎప్పుడూ పని చేయాల్సిందే. కరెంట్ బిల్లు భారం సంగతి ఎలా ఉన్నా... ఏసీల అధిక వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బెంగళూరుకు చెందిన వారణాసి సత్యప్రకాష్ ‘వారణాసి హౌజ్’ను సృష్టించాడు. ఏసీ అవసరం లేకుండానే ఈ ఇల్లు చల్లగా ఉంటుంది.
ఇంటి నిర్మాణం విషయానికి వస్తే... హీట్ ట్రాపింగ్ సిమెంట్ గోడలకు బదులుగా బోలు మట్టి బ్లాకులను ఎంచుకున్నాడు. ఇవి ఉష్ణోగ్రతను సహజంగా నియంత్రిస్తాయి. వేసవిలో ఇంటిని చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. ఫ్రెంచ్ కిటికీల వల్ల తగినంత వెంటిలేషన్ ఉంటుంది. ఇంటి రూపకల్పనలో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, భూగర్భ జలాలను రీచార్జ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేపల కొలను, నీటి ప్రవాహాలు, బావి ఉన్నాయి.
కారు షెడ్‌కు దగ్గరలో అందమైన పూలతోట... వర్షపు నీటిని భద్రపరిచే ఏర్పాటు కూడా కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ కూలింగ్ అవసరం లేకుండా రెడ్ ఆక్సైడ్ ఫ్లోర్స్, పైన్ వుడ్ ఇంటీరియర్స్, నేచురల్ చిమ్నీ... మొదలైనవి కనిపిస్తాయి.‘క్రాస్ వెంటిలేషన్, డిస్‌ప్లేస్‌మెంట్ వెంటిలేషన్ సూత్రాలను మిళితం చేసి ఇంటికి రూపకల్పన చేశాం’ అంటున్నాడు సత్యప్రకాష్.
(చదవండి: మామయ్య ప్రవర్తనతో నరకం కనిపిస్తోంది!)