భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా కేవలం యాంత్రికంగా ఎన్ని రకాల, ఎన్ని వర్ణాల పూలతో పూజ చేసినా ఉపయోగం ఉండదు. విశ్వాసం లేకుండా చేసే తీర్థయాత్రల వల్ల, గంగా స్నానాల వల్ల ఫలితం ఉండదు. గంగలో మునక వేస్తే పాపాలు హరిస్తాయంటారు కానీ నిజంగా అలా జరుగుతుందని నమ్మకం ఏమిటి? అనే అవిశ్వాసం తోనే చాలా మంది ఉంటారు. మనుషులలో సందేహ జీవులే ఎక్కువ.
ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఈ విషయం గురించే ‘నిత్యం గంగలో ఎంతోమంది స్నానం చేస్తూ, శివస్మరణ చేస్తున్నారు కానీ ఎవరిలోనూ పూర్తి విశ్వాసం కనిపించటం లేదని అనుకుంటారు. నిజమైన భక్తి ఎవరిదో పరీక్షిద్దామని అనుకుని వృద్ధ దంపతుల రూపంలో గంగా తీరానికి వెళతారు. అక్కడ వృద్ధుడు ఒక గోతిలో పడిపోతాడు. భార్య దుఃఖిస్తూ ఎవరైనా చేయందించి తన భర్తను కాపాడమని అక్కడ చుట్టూ చేరిన వారిని కోరుతుంది.
వాళ్ళు ముందుకు రాబోతుంటే ఆమె ‘మీలో ఎప్పుడూ ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే నా భర్తను కాపాడండి. లేకుంటే, చేయందిస్తున్నప్పుడు మీ చేయి కాలిపోతుంది’ అంది. అక్కడ ఉన్నవారంతా గంగా స్నానం చేసినవారు. నిరంతరం శివ స్మరణ చేసేవారు. అయినా, తమ భక్తి మీద తమకు నమ్మకం లేదు. ఎవరూ ముందుకు రాలేదు. వృద్ధుణ్ణి కాపాడే ప్రయత్నం చేయలేదు.
అంతలో ఒక దొంగ అక్కడకి వచ్చాడు. వృద్ధురాలు చెప్పిన విషయం తెలుసుకుని, వెంటనే గంగలో మూడు మునకలు వేశాడు. వృద్ధుణ్ణి కాపాడాడు. గంగలో మునిగిన తర్వాత తన పాపాలన్నీ నశించిపోయాయని అతని నమ్మకం. వృద్ధునికి చేయందించినపుడు అతని చేయి కాలలేదు. అదీ విశ్వాసమంటే! ఆ తర్వాత అతడు దొంగతనాలు మాని శివభక్తుడయ్యాడు. అపనమ్మకంతో, సందేహంతో చేసే పనులు ఏవీ సత్ఫలితాన్నివ్వవు. చేసే పనిపై విశ్వాసం ఉండాలి. – డా. చెంగల్వ రామలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment