
ధర్మనిరతే కవచం!
విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముడిని యాగపరిరక్షణార్థం పంపించమని అడిగినప్పుడు, కేవలం పదిహేనేండ్ల బాలుడు, ఈ పసివాడు యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి? అని కంగారుపడి, పంపించడానికి సంకోచించాడు దశరథ మహారాజు. తపస్సు చేయగా చేయగా కలిగిన సంతానం కాబట్టి దశరథుడి మనసులో ఆ కంగారు, దిగులు సహజమే! అయితే, అలా పంపమని అడిగిన విశ్వామిత్రుడు ఆ మాత్రం ఆలోచన లేకుండానే అడిగాడా? అన్నది ఆ క్షణాలలో దశరథుడు, శ్రీరాముడి మీదనున్న అపారమైన ప్రేమ కారణంగా ఆలోచించలేకపోయిన సంగతి.
పిల్లల క్షేమానికి ఏది రక్షగా పనిచేస్తుంది? అని ప్రశ్న వేసుకున్నపుడు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తారో అంత క్షేమంగా వారి పిల్లలు ఉంటారన్న సమాధానాన్ని సూచించిన సన్నివేశం ఇది. దశరథుడి సంకోచానికి విశ్వామిత్రుడు కోపగించుకోవడం చూసిన వశిష్ఠుడు కలగజేసుకుని ‘దశరథ మహారాజా! దక్షప్రజాపతి కుమార్తెలైన జయకు, సుప్రభకు భృశాశ్వుడనే ప్రజాపతి ద్వారా కలిగిన కామరూపులు; మహా సత్వసంపన్నులు, అస్త్రములు అయినటువంటి నూర్గురు కొడుకులను విశ్వామిత్రుడు పొంది ఉన్నాడు.
వాళ్ళల్లో ఏ ఒక్కడైనా కూడా యాగరక్షణ అనే పనికి సరిపోతాడు. ఇక శస్త్రాస్త్రాల సంగతంటావా? ఈయనకు తెలియని శస్త్రాలు, తలుచుకుంటే ఈయన సృష్టించలేని అస్త్రాలు లేవు. అటువంటి ఆయనతో పంపించడానికా నీవు సంకోచిస్తున్నావు?’ అని ఊరడించి, దశరథుడితో ఇంకా ఇలా చెప్పాడు.
"చ. అనలము చేత గుప్తమగు నయ్యమృతంబును బోలె నీ తపో
ధనపరిరక్షితుం డగుచు దద్దయు నొప్పెడు నీ తనూభవుం
డని నకృతాస్త్రుడైనను నిరాయుధుడైన నిశాట కోటికిం
జెనకగ రాదు కౌశికుడు చెప్పగ గేవల సంయమీంద్రుడే"
పూర్వం క్షీరసాగర మథనంతో లభించిన అమృతకలశం భయంకరమైన విషాగ్ని కింద దాచబడి ఉన్నట్లుగా, నీ కొడుకైన శ్రీరాముడనే అమృతకలశం నీ తపోధనం అనే ప్రాణశక్తి చేత పరిరక్షించబడుతూ ఉన్నది. అటువంటి స్థితిలో శ్రీరాముడు నిరాయుధుడుగా ఉన్నప్పటికీ ఆ రాక్షస సమూహం అతడిని ఏమీ చేయలేదు. కౌశికుడు కంటికి కనిపిస్తున్నట్లుగా కేవలం మునిమాత్రుడు కాడు సుమా!’ అని వివరించాడు వశిష్ఠుడు ‘భాస్కర రామాయణం’ బాలకాండలోని పై సన్నివేశంలో. సంతానం ప్రాణాలకు వారి తల్లితండ్రుల ధర్మబద్ధ జీవనమే అన్నిటినీ మించిన రక్ష అని పైసన్నివేశం చాలా బలంగా చెప్పింది. – భట్టు వెంకటరావు