ఆధ్యాత్మికథ
విభీషణుడు విశ్రవసు, కైకసిల సంతానమే విభీషణుడు, రావణాసురుని చిన్న తమ్ముడు. అందరికంటే పెద్దవాడు రావణాసురుడు, కుంభకర్ణుడు రెండవవాడు. విభీషనుడు వీరిద్దరికంటే పూర్తి భిన్నమైన వాడు. సంస్కారవంతుడు, ఉత్తమోత్తమగుణాలు కలవాడు. సోదరులంటే అభిమానం కలవాడు. అందులో రావణాసురుడు అంటే భయభక్తులున్నవాడు. సీతమ్మ వారిని రావణాసురుడు చెర పట్టినప్పుడు‘అన్నా నీకు ఇది తగదు’ అని మొదట హెచ్చరించింది విభీషణుడే. తదుపరి ఎన్నడూ రావణుని మందిరానికి వెళ్ళింది లేదు.
హనుమ లంకాదహనం చేసినప్పుడు మరోసారి రావణునికి హితబోధ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. రావణుడు, సీతమ్మ దగ్గరకు వెళ్ళి గడువు పెట్టి వస్తున్నప్పుడు, రావణుని ఏకాంతంగా కలసి చెప్పాలనుకుని భయంతో విరమించుకున్నాడు. ఈ దిశలో రామలక్ష్మణులు, వానర సైన్యంతో సముద్రాన్ని దాటి రావడం, రావణునితో సమర భేరి మోగించడం జరిగింది ఆ సమయంలో రాచకొలువులో కోపోద్రిక్తుడై యుద్ధంలో ఆ రోజు విధులను కొంతమంది రాక్షస వీరులను నియమించాడు. అప్పుడు కూడా విభీషనుడు, రావణునికి చెప్పలేకపోయాడు. అన్న అంటే అంత భయం అతనికి. యుద్ధంలో రాక్షస వీరులు మరణిస్తుంటే తట్టుకోలేక పోయాడు విభీషణుడు. అప్పుడే పూజ ముగించి దైర్యంతో నేరుగా రావణుని దగ్గరకు వెళ్ళాడు.. అప్పుడు రావణుడు ‘‘రా విభీషణా!రేపు యుద్ధంలో నీవే నాయకత్వం వహించాలి’’ అని చెబుతుండగా, విభీషణుడు చేతులు జోడించి ‘అగ్రజా! యుద్ధం మనకు వద్దు.
సీతమ్మ పరమ సాధ్వి. ఆ రామలక్ష్మణులు దైవాంశ సంభూతులు... అందువల్ల... ’’ అంటుండగా రావణుని తీక్షణ చూపులు చూడలేక తల దించుకున్నాడు. మళ్ళీ ధైర్యంతో ‘ఒక్కసారి ఆలోచించు ఒక రాజుగా మీకు ఇది శ్రేయస్కరం కాదు. రాజు ప్రజల బాగోగులు చూడాలి. స్త్రీలకు రక్షణగా ఉండాలి. నా మాట విను, ఆ సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించు. సమయం మించి పోలేదు. చేసిన తప్పు ఒప్పుకుని ఆ శ్రీరాముల వారిని శరణు వేడు. నీకు జయం కలుగుతుంది. శరణుజొచ్చిన వారిని అక్కున చేర్చుకునే మంచి గుణాలు అయనకు ఉన్నాయి, మీ మేలు కోరి ఈ లంక ప్రజల తరపున చివరిసారిగా చెబుతున్నాను. సీతమ్మ వారిని అప్పగించు, చేసిన తప్పు ఒప్పుకో! నిన్ను శ్రీ రాములు వారు కరుణిస్తారు’’ అని పరి పరి విధాలుగా చెప్పాడు.
ఆ మాటలు విని రావణుడు ‘‘అయ్యిందా నీ ఉపన్యాసం? నాకే నీతులు చెబుతావా! ముల్లోకాలలోనూ నాకు ఎదురు లేదు అనే విషయం నీకు తెలియదా! ఆ రాముని వధించి, సీతను వివాహం చేసుకొనుటకే నేను నిశ్చయించుకున్నా, నీ హితబోధ నాకు కాదు. ఇదే నిన్ను శాసిస్తున్నాను. రేపు యుద్ధ భూమిలో నీవే ప్రధాన బాధ్యత వహించాలి ఇది నా ఆజ్ఞ’’ అని చర చర వెళ్ళిపోయాడు రావణుడు. విభీషణుడు అన్నీ ఆలోచించి శ్రీరాముల వారి దగ్గరకు ‘శరణు, శరణు’ అని వెళ్ళాడు.
శ్రీ రాముడు అతన్ని చూశాడు. వినమ్రంగా, చేతులు జోడించి ఉన్న విభీషణుని చూడగానే ఆసనంపై నుంచి లేచి తన హృదయానికి హత్తుకున్నాడు.‘నా జన్మ ధన్యమైంది ప్రభూ’’ అంటూ శ్రీ రాముల వారి పాదాలు తాకి తన భక్తి, వినయం నిరూపించుకున్నాడు. ఆ విధంగా శ్రీరాముడితో విభీషణునికి స్నేహం కుదిరింది. రాముడికి యుద్ధంలో చేదోడుగా ఉన్నాడు. రావణుని మరణానంతరం లంకకు విభీషణుడు రాజైనాడు. ఇది శ్రీ రాముల వారు, విభీషణునికి ఇచ్చిన కానుక. లంకకు రాజైన విభీషణుడు సుపరిపాలన చేసి, ప్రజలకు ఉత్తమ పాలన అదించాడు. విభీషణుని చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు
Comments
Please login to add a commentAdd a comment