ఊరకరారు మహాత్ములు... | Grihasthashram Vaishishtyam Story Written By Brahmashri Chaganti Koteswara Rao | Sakshi
Sakshi News home page

ఊరకరారు మహాత్ములు...

Published Mon, Oct 28 2024 9:51 AM | Last Updated on Mon, Oct 28 2024 9:51 AM

Grihasthashram Vaishishtyam Story Written By Brahmashri Chaganti Koteswara Rao

గృహస్థాశ్రమ వైశిష్ట్యం 

గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో  ఐదవది – ‘....నృయజ్ఞోతిథిపూజనమ్‌’. అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే.  నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్‌...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో... తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. 

నీకూ పరిమితులు ఉండవచ్చు.  వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేక΄ోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు. అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు ΄ోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని ‘నేను పెడుతున్నాను’ అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. 

భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.
అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. 

అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయినవారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ‘‘ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !’’ అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.

రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి ‘భవతీ భిక్షాందేహి’ అంటే...  ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండి΄ోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షా΄ాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement