Brahmasri caganti Koteshwara Rao
-
ఊరకరారు మహాత్ములు...
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో ఐదవది – ‘....నృయజ్ఞోతిథిపూజనమ్’. అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో... తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. నీకూ పరిమితులు ఉండవచ్చు. వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేక΄ోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు. అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు ΄ోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని ‘నేను పెడుతున్నాను’ అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయినవారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ‘‘ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !’’ అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి ‘భవతీ భిక్షాందేహి’ అంటే... ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండి΄ోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షా΄ాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అది... క్షీరసాగరమథనం!
మనిషి జీవితంలో సంస్కారానికి ఆలంబన గృహస్థాశ్రమంలోనే. దానిలోకి వెడితే భార్య వస్తుంది, పిల్లలు వస్తారు...అలా చెప్పలేదు శాస్త్రం. అక్కడ ఆటు ఉంటుంది, పోటు ఉంటుంది. దెబ్బలు తగిలినా, సుఖాలు వచ్చినా... అవన్నీ అనుభవంలోకి రావల్సిందే. వాటిలో నీవు తరించాల్సిందే. కుంతీ దేవి చరిత్రే చూడండి. ఎప్పుడో సూర్య భగవానుడిని పిలిచి నీవంటి కొడుకు కావాలంది. కర్ణుడిని కనింది. అయ్యో! కన్యా గర్భం.. అపఖ్యాతి ఎక్కడ వస్తుందో అని విడిచిపెట్టలేక విడిచిపుచ్చలేక... మాతృత్వాన్ని కప్పిపుచ్చి నీళ్ళల్లో వదిలేసింది. తరువాత బాధపడింది. కొన్నాళ్ళకు పాండురాజు భార్యయింది. సుఖంగా ఉన్నాననుకుంటున్న తరుణంలో సవతి మాద్రి వచ్చింది. పిల్లలు లేరంటే మంత్రంతో సంతానాన్ని ధర్మరాజు, భీముడు, అర్జునుడిని ΄÷ందింది. ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు పాండురాజు. చెప్పింది. మాద్రికి నకులుడు, సహదేవుడు పుట్టారు.శాపం వచ్చింది. పాండురాజు చచ్చిపోయాడు. మాద్రి సహగమనం చేసింది. ఈ పిల్లలు నీ పిల్లలేనని ఏం నమ్మకం? అని... పాండురాజు పిల్లలకు రాజ్యంలో భాగం ఇవ్వరేమోనని... ఇది ధార్మిక సంతానం అని చెప్పించడానికి మహర్షుల్ని వెంటబెట్టుకుని పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి వెళ్లింది. అంత కష్టపడి వెడితే లక్క ఇంట్లో పెట్టి కాల్చారు. పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేసారు, విషం పెట్టారు. .. అయినా చలించకుండా ఇన్ని కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆఖరికి ధర్మరాజు ఆడిన జూదంతో అన్నీ పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది.అజ్ఞాతవాసం కూడా అయింది. తిరిగొచ్చారు. కురుక్షేత్రం జరిగింది. హమ్మయ్య గెలిచాం, పట్టాభిషేకం కూడా అయిందనుకున్నది. కంటికి కట్టుకున్న కట్టు కొంచెం జారి... కోపంతో ఉన్న గాంధారి చూపులు ప్రసరిస్తే ధర్మరాజుకు కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. అటువంటి గాంధారీ ధృతరాష్ట్రులు అరణ్యవాసానికి వెడుతుంటే... తన పిల్లలు గుర్తొచ్చి గాంధారి మళ్ళీ ఎక్కడ శపిస్తుందోనని, మీకు సేవ చేస్తానని చెప్పి... సుఖపడాల్సిన తరుణంలో వారి వెంట వెళ్ళిపోయింది. ఆమె పడిన కష్టాలు లోకంలో ఎవరు పడ్డారు కనుక !!!గంగ ప్రవహిస్తూ పోయి పోయి చివరకు సముద్రంలో కలిసినట్లు ఈ ఆట్లు, పోట్లు కష్టాలు, సుఖాలతో సంసార సాగరంలో చేరి తరించాలి. చివరలో తిలోదకాలు ఇచ్చేటప్పడు ఒక్కొక్కరి పేరు చెబుతున్నారు.. కొంత మంది పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ అంటున్నాడు... కొంత మందికి ధర్మరాజు ‘నావాడు’ అంటున్నాడు. కర్ణుడి పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ కాదన్నాడు. ధర్మరాజు కూడా ‘నావాడు’ కాదన్నాడు... తట్టుకోలేకపోయింది తల్లిగా. ‘‘వరంవల్ల పుట్టాడ్రా.. వాడు నీ అన్నరా, నీ సహోదరుడు... నా బిడ్డ...’’ అంది.మరి ధర్మరాజేమన్నాడు... తల్లిని శపించాడు..‘‘ఆడవారి నోట్లో నువ్వుగింజ నానకుండుగాక..’’ అని. దీనికోసమా ఇంత కష్టపడ్డది. అప్పుడొచ్చింది ఆమెకు వైరాగ్యం. కృష్ణభగవానుడిని స్తోత్రం చేసింది. గృహస్థాశ్రమం అంటే క్షీరసాగర మథనం. అక్కడ అమృతం పుట్టాలి. జీవితం అన్న తరువాత ఆటుపోటులుండాలి. రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలన్నా, మనిషి తరించి పండాలన్నా గృహస్థాశ్రమంలోనే... అంతే తప్ప భార్యాబిడ్డలకోసం మాత్రమే కాదు.. కర్తవ్యదీక్షతో అన్నీ అనుభవంలోకి వచ్చిన నాడు ఈశ్వర కృప దానంతటదే వస్తుంది. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గింజనే చూస్తే.... గింజవయిపోతావు
‘వాగురయని తెలియక మగ గణములు వచ్చి తగులురీతియున్నది..’’ వాగుర అంటే వల. వల వేసేవాడు వల ఒక్కటే వేయడు. కింద గింజలు వేసి వలేస్తాడు. ఆకలిమీద ఉన్న ప్రాణి కిందున్న గింజలనే చూస్తుంది. రివ్వున వచ్చి వలలో చిక్కుకుని తినేవాడికి అదే గింజయి పోతుంది. తన ఆహారం కోసం వెళ్ళి వేరొకడికి ఆహారమయి పోతుంది. తాను ఏది పొందడానికి వచ్చాడో అది పొందకపోగా వేరొక దానిచేత దానిని పొందబడుతున్నాడు. కారణం – మత్సరం. అప్పటికి నా అంతటి వాడు లేడు.. అని అహంకరించడం. మరొకడిని తక్కువ చేయడం, హేళనచేస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకోవడంలో ఒక చిన్న సంతోషం ఉంది. కానీ నిజానికి అది పతనం చేసే సంతోషం. మృగ గణములు వచ్చి తగులుకున్న రీతిగా నాకు హెచ్చరిక అందట్లేదు. అదే నాకు అప్పటికి సుఖకారణమనిపించి వలకు చిక్కినట్టు నన్ను కట్టిపడేస్తున్నదంటున్నాడు త్యాగయ్య. ఒకసారి పక్షులన్నీ వలలో చిక్కుకుపోయి ఉంటే... అటునుంచి ఒక రుషి వెళ్ళిపోతున్నాడు. రక్షించమని అవి వేడుకున్నాయి. విడిపిస్తాగానీ నేనొక మాట చెబుతా వింటారా...అనడిగితే సరే అన్నాయి. ‘‘గింజలు కనబడగానే వాల రాదు’’. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు మళ్లీ ఇలాటి ఆపద రాదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మరో పది రోజుల తరువాత ఆయన మళ్ళీ అటుగా వస్తుంటే...మళ్ళీ అవే పక్షులు వలలో చిక్కుకుని ‘రక్షించమని వేడుకున్నాయి. నా మాట మీరెందుకు వినలేదని ఆయన అడిగాడు. వినకపోవడమేమిటి... మీరు చెప్పినట్లే కదా చేసాం... అన్నాయి...అంటూ ‘గింజలు కనబడగానే వాలరాదు’ అందుకే వెంటేనే వాలలేదు కదా... అన్నాయి... అలాగే వాగ్గేయకారుల కీర్తనలు ఎన్నిసార్లు పాడుకున్నాం, ఎన్నిసార్లు విన్నాం, ఎన్నిసార్లు చదివాం ... అని కాదు. అది అర్థం కావాలి. అర్థమయితే సుఖం. ఎంత బాగా పాడావు అన్నదానికన్నా... దానిలోని తత్త్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావన్నది కదా ముఖ్యం. తత్త్వం అర్థమయితే అరిషడ్వర్గాలు గురువుగారి అనుగ్రహం వల్ల వెంటనే పోయినట్టే కదా! అప్పుడు ఆయన సద్గురువు. అందుకే కీర్తన చివరన మదమత్సరమను తెరదీయగరాదా... అన్నాడు. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ మదం కూడా ఉంటుంది. అది నాకు కదా దక్కాలి... అన్నప్పుడు కామం ఉంది. వాడికే ఎందుకు దక్కాలి ... అన్నప్పుడు క్రోధం ఉంది. నాకు ఉండాలన్నప్పుడు లోభం ఉంది. దీనికంతా కారణ అజ్ఞానం అన్నప్పుడు మోహం ఉంది. అరిషడ్వర్గాలు అక్కడ పుట్టాయి. అందువల్ల తెర అంత దట్టంగా ఉంది.‘నీలో మత్సరమను తెర ఉంది. అది తొలగించుకో’ అని ఆయన అనలేదు. తన మీద పెట్టుకున్నాడు. శంకరభగవత్పాదులు రాసిన శ్లోకాల్లో నాకు అంటూంటారు. అంటే ఆయనకు కాదు. ఆ శ్లోకం ఎవరు చదువుతుంటే వాళ్ళకు–అని. వాళ్ళకు దైవానుగ్రహం కలగాలి. అలాగే త్యాగరాజస్వామి తనకు అన్వయం చేసుకుని చెప్పారు. మత్సరం ... మద మత్సరం... అసూయ వినాశ హేతువు. ఆ తెర తీయమంటున్నాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు
భక్తి ఎప్పుడూ ఆధిపత్య ధోరణిని, అహంభావాన్ని ప్రదర్శించదు. నేను గొప్ప, నాకిది వచ్చు. నాకన్నా వాళ్లెంత...అన్న వైఖరిని చూపదు. విద్య...విత్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది వినయం. ‘‘విద్యాదదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మంతత సుఖం’’ వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అంతే. అందుకే త్యాగరాజ స్వామి వారిని... మీరంతవారు, మీరింత వారని అంటూంటే... ఆయన పొంగిపోలేదు. పైగా ఆయనేమన్నారు.. అంటే... ఎందరో మహానుభావులు ...అందరికీ వందనములు... అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు, రమించినవారు, పాడినవారు, అర్చించినవారు, అనుభవించినవారు ఎంతో మంది ఉండగా వారి ముందు నేనెంత, వారికి నేనేం చేయగలను, నమస్కారం చేస్తా...’’ అని వారందరినీ ఆదరపూర్వకంగా స్మరించుకున్నారు. వినయం అంటే అదీ. ఆదిశంకరులు అంతటి వారు ‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయాపాలయవిభో’’...‘శివా! నేను పశువును. నీవు పశుపతివి. ఇదే మనిద్దరి మధ్య బంధం’ అన్నారు. అది వినయం. అది విద్యకు పరమార్థం.అది దేనిచేత ప్రకాశిస్తుంది... అంటే ఉపాసనా దేవత అనుగ్రహానికి పాత్రమయితే అప్పుడు వినయం వస్తుంది. ఆ వినయం మనకు వాగ్గేయకారులందరిలో కనబడుతుంది. అందుకే వారు ఏది చెప్పినా ఏది చేసినా మనకు సందేశం ఇస్తున్నట్లో, సలహా ఇస్తున్నట్లో ఉండదు. వారికి వారు చెప్పుకున్నట్లు ఉంటుంది. భిన్న కథనాలు ఉన్నప్పటికీ, త్యాగరాజ స్వామివారు ఒకసారి వేంకటాచలం వెళ్ళారు, స్వామి వారి దర్శనం కోసం కూచున్నారు. తెర అడ్డంగా ఉంది. దిగంతాలకు వ్యాపించిన కీర్తిమంతుడిని, సాక్షాత్ ఉపనిషద్బ్రహ్మేంద్రులంతటి వారు నన్నుపిలిచి కీర్తనలు పాడించుకుంటారే, నేనొస్తే తెర వేస్తారా... అని ఆయన కోపగించుకోలేదు. ఈ తెర కాసేపయితే తీస్తారు.. ఇవ్వాళ కాకపోతే రేపయినా తీస్తారు. కానీ లోపల ఇంకొక తెర ఉంది... అనే అర్థంలో ఆయన అన్న మాటేమిటంటే...‘‘తెర తీయగ రాదా, నాలోని తిరుపతి వేంకటరమణా! మదమత్సరమను తెరదీయగరాదా, పరమ పురుషా!’’ అని పిలిచారు. నిజానికి భగవంతుడు ఎక్కడ దర్శనం కావాలి? మన లోపల.. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా... లోపల అక్కడ కనబడాలి. పరమ యోగీంద్రులకు భావగోచరమైన పాదాబ్జములు నాకు దర్శనమయితే నేను యోగిని. .. అన్నారు తెర వేసినందుకుగానీ, తెర తొలగించనందుకు గానీ ఆయన ఎవరినీ నింద చేయలేదు. నా అంతటివాడొస్తే.. అని అహంకరించలేదు. ఎప్పుడు తీస్తారని అడగలేదు. ఇక్కడ ఉన్న తెర ఎవరయినా, ఎప్పుడయినా తీస్తారు. ‘లోపల నాకు అడ్డొస్తోన్న తెరవల్ల నీవు నాకు ఎప్పటికీ కనబడడం లేదు. అది నీవే తీయాలి. నేను తీసుకోలేను. ఇంకొకరు తీయలేరు. అది తీయవయ్యా నాలోని వేంకటరమణా!’– అని వేడుకున్నారు. నిన్ను పొందడానికి నాకు అడ్డొస్తున్నదేమిటంటే మత్సరం... అన్నారు. ఎంతగొప్పమాట! మత్సరం అంటే అన్య సుఖ ద్వేషి. ఇంకొకరికిఏదయినా మంచి జరిగితే మనం చాలా బాధపడి పోతుంటాం. అన్నపానీయాలు ఎక్కవు. నిద్రాసుఖం ఉండదు. వాడికి శుభం జరగడమా, నాకన్నావాడేం గొప్ప. వాడికేం తెలుసని. వాడికి కీర్తి రావడమేమిటి, వాడికి శుభాలు జరగడమేమిటి ... ఇలా ఇతరులను తక్కువచేసి తన గొప్పదనం స్మరించుకోవడం... అది మత్సరానికి ప్రారంభ స్థానం. అది అడ్డొస్తున్నదన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శ్రమ సౌందర్యం.. ఇల్లాలి మోమును నగుచునున్నవాడు మగడు చూచి
ఏ ఇంటిలోనయినా గృహస్థాశ్రమం ప్రారంభం కాగానే భార్య అందం చూసి భర్త సంతోషపడతాడు. భర్త అందం.. అంతకంటే ఎక్కువగా అతని శీలవైభవం, కీర్తిప్రతిష్ఠలు, రుజుత్వం, సమర్ధత చూసుకొని ఆమె మురిసిపోతుంది. కొంతకాలం గడిచేటప్పటికి ఆ సౌందర్యం తాలూకు అనుభూతిలో మార్పు కనపడుతుంది. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లయింది. భర్తకు, పిల్లలకు, అత్తమామలకు, అతిథి అభ్యాగతులకు సేవచేయడంలో ఆమె... కుటుంబపోషణ, అభ్యున్నతికోసం భర్త చెమటోడుస్తుంటారు. చెమటతోపాటు మసి, మట్టి అంటుతున్నా వాటిని వారు గమనించే స్థితిలో ఉండరు. పైగా ఆ సందర్భాల్లో వారిలో ఒకరికి మరొకరు ఇంపుగా కనిపిస్తుంటారు. అది శ్రమ సౌందర్యం. సంగీత సాహిత్యాలు రెండింటిలో అందెవేసిన బహుభాషావేత్త రాళ్ళపల్లి అనంత కష్ణశర్మ గారు హాలుని ‘గాథా సప్తశతి’ ని తెలుగులోకి అనువదించారు. అందులో మానవ జీవిత విలువలకు సంబంధించి ఒక అద్భుతమైన పద్యాన్నిస్తూ...‘‘వంటయింటి పనులనంటిన మసి చేయి సోకియుండ చంద్ర సుందరముగ ఇంపుగొలుపుచున్న ఇల్లాలి మోమును నగుచునున్నవాడు మగడు చూచి’’ అన్నారు. వంటింట్లో ఇల్లాలు పనిచేసుకుంటూ ఉంది. ఆమె చేతికి మసి అంటుకుని ఉంది. అది ఆమె చూసుకోకుండా చెమటను తుడుచుకుంటున్నప్పుడు ఆమె ముఖానికి మసి అంటింది. అక్కడే కొద్ది దూరంలో తన పని చేసుకుంటూ మధ్యలో ఒకసారి భార్యవంక చూసాడు. మచ్చతో ఉన్న చంద్రబింబం మరింత సౌందర్యవంతంగా కనబడినట్లు... ఆయనకు ఆమె ముఖం చాలా ఇంపుగా కనిపించిందట. పార్వతీదేవిని మనం సాధారణంగా రెండు నామాలతో సంబోధిస్తూ ఉంటాం. ఒకటి శివకామసుందరి. రెండవది అఖిలాండేశ్వరి. శివకామసుందరి అన్నప్పుడు ఆమె పరమశివుని ఇల్లాలు. ఆమె అందాన్ని చూచి శంకరుడు అభినందిస్తాడు, సంతోషిస్తాడు. కానీ మనకందరికీ ఆమె జగజ్జనని, అఖిలాండేశ్వరి. ఆమె మాతృత్వం సౌందర్యం. ఆ తల్లిలో ఉన్న మాతృత్వాన్ని చూసుకొని అమ్మా! అని పిలిచి ఎంత కష్టంలో ఉన్నా సేద దీరుతాం. మనకందరికీ అమ్మ. శంకరుడికి మాత్రం ఇల్లాలు. ఒక పార్వతీ దేవి శివకామ సుందరిగా, అఖిలాండేశ్వరిగా పూర్ణత్వాన్ని పొందినట్లు ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కూడా భర్తకి భార్య, పిల్లలకు తల్లి. ఒకనాడు భర్త అందాన్ని చూసి భార్య, భార్య అందాన్ని చూసి భర్త సంతోషించినా కొంతకాలం గడిచిన తరువాత శారీరక అందం తెరమరుగయి, శీల వైభవం మరింత ఇంపుగా కనపడుతుంటుంది. ఇల్లయినా అంతే... ఇల్లు ఎప్పుడూ ఎక్కడి వస్తువులు అక్కడ అమర్చి శుభ్రంగా ఉంటే సంతోషం. పిల్లలు పుట్టి పెద్దయ్యే క్రమంలో వారి అల్లరి దానికితోడు పని భారం, ప్రాధాన్యతల్లో మార్పు వచ్చి... వస్తువులన్నీ చిందరవందరగా పడి కనిపిస్తుంటాయి... ఆ సందర్భంలో ఆ ఇల్లు పిల్లల సందడితో, జీవకళతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రమించినప్పడు వచ్చే చెమట కంపుగా కంటే ఇంపుగా కనిపిస్తుంటుంది.. చెమట విలువ అది. మనం తినే అన్నం ఎంతో మంది రైతులు చెమటోడ్చిన ఫలితం. మనం నిత్యం వాడుతున్న వస్తువులు ఎంతోమంది కార్మికులు చెమటోడ్చి తయారు చేసినవే. మనం పొందుతున్న ప్రశాంతత దేశరక్షణకోసం వేలాది సైనికులు చిందిస్తున్న చెమట ఫలం. చెమట పురోభివృద్ధికి, ప్రగతికి నిదర్శనం. చెమటోడ్చే సమాజంలో, కుటుంబంలో దరిద్రం ఉండదు. శ్రమ సౌందర్యం అందరినీ సంతోషపెడుతుంది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు
‘‘నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్ మహౌషథుల్’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది. ఆయన తేటతెలుగులో అనేక రచనలు చేసారు. ఆయన రచనల్లో అంతర్లీనంగా కులమతాలనే సంకుచిత తత్త్వాన్ని ప్రశ్నించారు. అభ్యుదయ భావాలు కలవారు. ఆయన రచనలు చదువుతుంటే ప్రతిదీ మనకు కళ్లముందు కనిపిస్తుంటుంది. ప్రాతఃస్మరణీయులు. ఆయన కవిత్వం చాలా ఇష్టం. నవ్వవు జంతువుల్...సమస్త ప్రాణికోటిలో ఏ జంతువూ నవ్వదు. మనుష్యులు మాత్రమే నవ్వుతారు. నవరసాలు కళ్ళల్లోంచి ఒలికించినట్లే–మన మానసిక స్థితిని, భావోద్వేగాలను మనం మాటల్లో చెప్పకపోయినా మన నవ్వు చెప్పేస్తుంది. ఎవరయినా ముఖం మాడ్చుకుని దిగాలుగా ఉంటున్నారనుకోండి, ఎవ్వరూ దగ్గరకు వెళ్ళరు, పలకరించరు కూడా. ప్రశాంతం గా, సంతోషంగా ఉన్నవాడి చుట్టూ ఎప్పుడూ పదిమంది ఉంటుంటారు. అసలు నవ్వకుండా బతుకుతున్న వాడి బతుకుకన్నా బరువయినా బతుకు మరొకటి ఉండదు. హాయిగా నవ్వడం, అరమరికలు లేకుండా పకపకా నవ్వడం, సంతోషంగా నవ్వడం, అదీ ఇతరులు బాధపడకుండా నవ్వడం ... ఆ నవ్వు దైవానుగ్రహం. ఎవ్వరిదగ్గరికయినా ఉపకారం ఆశించి వెళ్ళితే వెంటనే వారి ముఖకవళికలు మారిపోతాయి. విచిత్రమైన నవ్వు కనిపిస్తుంది. అడిగిన సహాయం చేస్తారో తెలియదు, చేయరో తెలియదు. అలాటి వారిలో కొన్ని నవ్వులు ఎటూ తేలవు. కొంతమంది నవ్వితే ఓ వారం రోజులు అన్నం సయించదు. మనల్ని అంత క్షోభ పెట్టేటట్లు, బాధపెట్టేటట్లు విషపు నవ్వులు నవ్వుతారు. కొంతమంది ఇతరులు బాధపడితే నవ్వుతారు. బాధితుడిని తన బాధకన్నా ఎదుటివాడి నవ్వు మరింత బాధిస్తుంటుంది. ఎదుటివాడు కష్టంలో ఉన్నట్లు తెలిసి కూడా పిచ్చినవ్వులు నవ్వుతుంటారు కొందరు. ఎవరయినా ఏదయినా సాధిస్తే .. నీ బతుక్కి ఇదెలా సాధ్యం... అన్నట్లు వెకిలినవ్వులు నవ్వుతుంటారు. పువ్వులవోలె ప్రేమరసము వెలిగ్రక్కు విశుద్ధములైన లేనవ్వులు సర్వదుఃఖశమనంబులు... వికసించిన పువ్వులను చూస్తుంటే... మెత్తటి, అతి సున్నితమైన రేకులు, కళ్ళకింపైన రంగులు, మధ్యలో కేసరం, పుప్పొడి, మకరందం, వాటి చుట్టూ తిరిగే తుమ్మెదలు ...మనల్ని కొంచెం సేపు మరిపిస్తుంది, మురిపిస్తుంది... ఇదే అనుభూతి పసిపిల్లల నవ్వుల్లో మనకు కనిపిస్తుంటుంది. ప్రేమగా నవ్వే నవ్వుల్లో కూడా ఈ భావన ఉంటుంది. అవి నిష్కల్మషాలు కాబట్టి వాటి శక్తి ఎక్కువ. మనం ఎంతటి బాధలో ఉన్నా ఆ నవ్వులు మనకు ఉపశమనం కలుగచేస్తాయి. మందుల్లా పనిచేస్తాయి. నవ్వు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. విషపు నవ్వు గుండెల్ని చీలిస్తే, ప్రేమగా నవ్వే ఓ చిర్నవ్వు హృదయాలను పరవశింపచేస్తుంది. చిన్న చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పడానికి మూకశంకరులు అమ్మవారి మీద వంద శ్లోకాలుచేస్తూ మందస్మిత శతకం రాసారు. మన విలువను పెంచేది, తెలియని వారికి పరిచయం చేసేది, మనల్ని ప్రపంచానికి దగ్గర చేసేది.. ఓ చిర్నవ్వు...అదెప్పుడూ మన ముఖాన్ని వెలిగిస్తూనే ఉంటుంది, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తూనే ఉంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నాన్నే నారాయణుడు
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ–ఈ నలుగురినీ సాక్షాత్తు ఈశ్వర స్వరూపాలుగా భావించి నమస్కరించిన ఉపనిషత్తు మనకూ అలాగే ప్రబోధం చేసింది. ఈ క్రమంలో మొదట తల్లి వైభవాన్ని గురించి తెలుసుకున్నాం కదా. తండ్రిని పరబ్రహ్మంగా ఎందుకు భావించాలో ఇప్పుడు చూద్దాం. పితృదేవోభవ–తండ్రి సాక్షాత్ పరమాత్మ స్వరూపమే. ఆయన చర్మచక్షువులకు కనబడేవాడు కాడు. పాలలోనే నెయ్యి ఉన్నది. కానీ మామూలు కన్నులకు కనిపించదు. కానీ ఆ పాలను కాచి, తోడుపెట్టి, కవ్వంతో చిలికి, వెన్నతీసి, కాచితే నెయ్యి వస్తుంది. పాలలో ఉన్న నెయ్యి ఎలా కనబడదో, అలా విశ్వనాథుడే విశ్వం రూపంలో ఉన్నప్పటికీ అందరికీ కనిపించడు. కొంత సాధన చేసినవారికి తప్ప ఇతరులకు పరమాత్మ దర్శనం లభించదు. ‘మాయ’ అనే తెర అడ్డు ఉన్న కారణంగా నామరూపాత్మకమైన జగత్తుతో తాదాత్మ్యత చెంది పునరావృత్తి చెందుతుంటాడు. కానీ ఈ లోకంలో మనకున్న మాంసనేత్రాలతో చూడడానికి యోగ్యమైన పరబ్రహ్మ స్వరూపమే తండ్రి. అందుకే తల్లికి తొలి నమస్కారం చేయించిన వేదం... తరువాత తండ్రిని పరబ్రహ్మగా గుర్తించి నమస్కరించాలన్నది. తండ్రి ఎలా పరబ్రహ్మ అవుతున్నాడు? ఇటువంటి ప్రశ్నలకు మనం సాధికారికంగా ఏదయినా చెప్పాలంటే ప్రమాణంగా వేటిని స్వీకరించాలి? ’భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి నీవు ఇలా బతకవలసి ఉంటుంది’ అని మార్గదర్శనం ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయి–వాటిలో మొదటిది శృతి. అంటే వేదం. వేదమే ప్రమాణం. శృతి భగవంతుని ఊపిరి. తరువాత స్మృతి. దీనిలోని విషయాలు రుషులు సంకలనం చేసినవి. ఈ రెండింటినీ జనసామాన్యానికి మరింత స్పష్టంగా చూపించేవి పురాణాలు. కాలానుగుణంగా ఇవి ధర్మంపట్ల మనకు అనురక్తిని కలిగిస్తుంటాయి. తరువాత శిష్టాచారం. అంటే శృతి, స్మృతి, పురాణం కూడా తెలియకపోతే పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి, శాస్త్రం తెలిసినవారి నడవడి ఎలా ఉంటుందో చూసి తెలుసుకోవడం. ఈ నాలుగూ కూడా తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడచుకోవాలి. కాబట్టి మొట్టమొదటి ప్రమాణం శృతి. స్మృతులను అందరూ చదువుకోలేరనుకుని, కలియుగంలో మానవుల అల్పాయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాసభగవానులు వేద విభజన చేసారు. స్వర ప్రధానంగా మూడుగా చేసి వాటిలో అత్యంత ప్రధానమైన అధర్వణ వేదాన్ని అత్యంత భద్రంగా మధ్యలో ఉంచారు. మళ్ళీ అత్యంత ప్రధానమైన రుద్రాధ్యాయాన్ని అధర్వణ వేదం మధ్యలో ఉంచారు.(ఈ భూలోకంలో ఎంత పెద్ద కష్టాన్నయినా తప్పించగలిగేది శివాభిషేకం. ఆ అభిషేకానికి వాడే భాగమే రుద్రాధ్యాయం.) ఈ రుద్రాధ్యాయంలో కూడా అత్యంత శక్తిమంతమైన మహామంత్రాన్ని దాని మధ్యలోని అష్టమానువాకంలో పెట్టారు. అందులో ఒకచోట ’నమశ్శంకరాయచ, మయస్కరాయచ..’ అంటుంది వేదం. శంకరాయచ అంటే తండ్రి. శంకరుడు ఈ లోకంలో తండ్రిరూపంలో తిరుగుతాడు. ఆ పరబ్రహ్మమే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా మూడు మూర్తులైనట్లు, అంటే.. మూడు మూర్తులు కలిసిన పరబ్రహ్మ–తండ్రిగా మన కంటిముందు తిరుగుతుంటాడు. ‘ఆ తండ్రికి చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే’ అంది వేదం– అదే పితృదేవోభవ. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు