మనిషి జీవితంలో సంస్కారానికి ఆలంబన గృహస్థాశ్రమంలోనే. దానిలోకి వెడితే భార్య వస్తుంది, పిల్లలు వస్తారు...అలా చెప్పలేదు శాస్త్రం. అక్కడ ఆటు ఉంటుంది, పోటు ఉంటుంది. దెబ్బలు తగిలినా, సుఖాలు వచ్చినా... అవన్నీ అనుభవంలోకి రావల్సిందే. వాటిలో నీవు తరించాల్సిందే. కుంతీ దేవి చరిత్రే చూడండి. ఎప్పుడో సూర్య భగవానుడిని పిలిచి నీవంటి కొడుకు కావాలంది. కర్ణుడిని కనింది. అయ్యో! కన్యా గర్భం.. అపఖ్యాతి ఎక్కడ వస్తుందో అని విడిచిపెట్టలేక విడిచిపుచ్చలేక... మాతృత్వాన్ని కప్పిపుచ్చి నీళ్ళల్లో వదిలేసింది. తరువాత బాధపడింది. కొన్నాళ్ళకు పాండురాజు భార్యయింది. సుఖంగా ఉన్నాననుకుంటున్న తరుణంలో సవతి మాద్రి వచ్చింది. పిల్లలు లేరంటే మంత్రంతో సంతానాన్ని ధర్మరాజు, భీముడు, అర్జునుడిని ΄÷ందింది. ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు పాండురాజు. చెప్పింది. మాద్రికి నకులుడు, సహదేవుడు పుట్టారు.
శాపం వచ్చింది. పాండురాజు చచ్చిపోయాడు. మాద్రి సహగమనం చేసింది. ఈ పిల్లలు నీ పిల్లలేనని ఏం నమ్మకం? అని... పాండురాజు పిల్లలకు రాజ్యంలో భాగం ఇవ్వరేమోనని... ఇది ధార్మిక సంతానం అని చెప్పించడానికి మహర్షుల్ని వెంటబెట్టుకుని పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి వెళ్లింది. అంత కష్టపడి వెడితే లక్క ఇంట్లో పెట్టి కాల్చారు. పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేసారు, విషం పెట్టారు. .. అయినా చలించకుండా ఇన్ని కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆఖరికి ధర్మరాజు ఆడిన జూదంతో అన్నీ పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది.
అజ్ఞాతవాసం కూడా అయింది. తిరిగొచ్చారు. కురుక్షేత్రం జరిగింది. హమ్మయ్య గెలిచాం, పట్టాభిషేకం కూడా అయిందనుకున్నది. కంటికి కట్టుకున్న కట్టు కొంచెం జారి... కోపంతో ఉన్న గాంధారి చూపులు ప్రసరిస్తే ధర్మరాజుకు కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. అటువంటి గాంధారీ ధృతరాష్ట్రులు అరణ్యవాసానికి వెడుతుంటే... తన పిల్లలు గుర్తొచ్చి గాంధారి మళ్ళీ ఎక్కడ శపిస్తుందోనని, మీకు సేవ చేస్తానని చెప్పి... సుఖపడాల్సిన తరుణంలో వారి వెంట వెళ్ళిపోయింది. ఆమె పడిన కష్టాలు లోకంలో ఎవరు పడ్డారు కనుక !!!
గంగ ప్రవహిస్తూ పోయి పోయి చివరకు సముద్రంలో కలిసినట్లు ఈ ఆట్లు, పోట్లు కష్టాలు, సుఖాలతో సంసార సాగరంలో చేరి తరించాలి. చివరలో తిలోదకాలు ఇచ్చేటప్పడు ఒక్కొక్కరి పేరు చెబుతున్నారు.. కొంత మంది పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ అంటున్నాడు... కొంత మందికి ధర్మరాజు ‘నావాడు’ అంటున్నాడు. కర్ణుడి పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ కాదన్నాడు. ధర్మరాజు కూడా ‘నావాడు’ కాదన్నాడు... తట్టుకోలేకపోయింది తల్లిగా. ‘‘వరంవల్ల పుట్టాడ్రా.. వాడు నీ అన్నరా, నీ సహోదరుడు... నా బిడ్డ...’’ అంది.
మరి ధర్మరాజేమన్నాడు... తల్లిని శపించాడు..‘‘ఆడవారి నోట్లో నువ్వుగింజ నానకుండుగాక..’’ అని. దీనికోసమా ఇంత కష్టపడ్డది. అప్పుడొచ్చింది ఆమెకు వైరాగ్యం. కృష్ణభగవానుడిని స్తోత్రం చేసింది. గృహస్థాశ్రమం అంటే క్షీరసాగర మథనం. అక్కడ అమృతం పుట్టాలి. జీవితం అన్న తరువాత ఆటుపోటులుండాలి. రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలన్నా, మనిషి తరించి పండాలన్నా గృహస్థాశ్రమంలోనే... అంతే తప్ప భార్యాబిడ్డలకోసం మాత్రమే కాదు.. కర్తవ్యదీక్షతో అన్నీ అనుభవంలోకి వచ్చిన నాడు ఈశ్వర కృప దానంతటదే వస్తుంది. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment