శ్రమ సౌందర్యం.. ఇల్లాలి మోమును నగుచునున్నవాడు మగడు చూచి | Diligence beauty is make everyone happy | Sakshi
Sakshi News home page

గురువాణి: శ్రమ సౌందర్యం.. ఇల్లాలి మోమును నగుచునున్నవాడు మగడు చూచి

Published Mon, Aug 1 2022 12:24 AM | Last Updated on Mon, Aug 1 2022 7:46 AM

Diligence beauty is make everyone happy - Sakshi

ఏ ఇంటిలోనయినా గృహస్థాశ్రమం ప్రారంభం కాగానే భార్య అందం చూసి భర్త సంతోషపడతాడు. భర్త అందం.. అంతకంటే ఎక్కువగా అతని శీలవైభవం, కీర్తిప్రతిష్ఠలు, రుజుత్వం, సమర్ధత చూసుకొని ఆమె మురిసిపోతుంది. కొంతకాలం గడిచేటప్పటికి ఆ సౌందర్యం తాలూకు అనుభూతిలో మార్పు కనపడుతుంది.

ఆమె ఇద్దరు పిల్లలకు తల్లయింది. భర్తకు, పిల్లలకు, అత్తమామలకు, అతిథి అభ్యాగతులకు సేవచేయడంలో ఆమె... కుటుంబపోషణ, అభ్యున్నతికోసం భర్త చెమటోడుస్తుంటారు.  చెమటతోపాటు మసి, మట్టి అంటుతున్నా వాటిని వారు గమనించే స్థితిలో ఉండరు. పైగా ఆ సందర్భాల్లో వారిలో ఒకరికి మరొకరు ఇంపుగా కనిపిస్తుంటారు. అది శ్రమ సౌందర్యం.

సంగీత సాహిత్యాలు రెండింటిలో అందెవేసిన బహుభాషావేత్త రాళ్ళపల్లి అనంత కష్ణశర్మ గారు హాలుని ‘గాథా సప్తశతి’ ని తెలుగులోకి అనువదించారు. అందులో మానవ జీవిత విలువలకు సంబంధించి ఒక అద్భుతమైన పద్యాన్నిస్తూ...‘‘వంటయింటి పనులనంటిన మసి చేయి సోకియుండ చంద్ర సుందరముగ ఇంపుగొలుపుచున్న ఇల్లాలి మోమును నగుచునున్నవాడు మగడు చూచి’’ అన్నారు.

వంటింట్లో ఇల్లాలు పనిచేసుకుంటూ ఉంది. ఆమె చేతికి మసి అంటుకుని ఉంది. అది ఆమె చూసుకోకుండా చెమటను తుడుచుకుంటున్నప్పుడు ఆమె ముఖానికి మసి అంటింది. అక్కడే కొద్ది దూరంలో తన పని చేసుకుంటూ మధ్యలో ఒకసారి భార్యవంక చూసాడు. మచ్చతో ఉన్న చంద్రబింబం మరింత సౌందర్యవంతంగా కనబడినట్లు... ఆయనకు ఆమె ముఖం చాలా ఇంపుగా కనిపించిందట.

పార్వతీదేవిని మనం సాధారణంగా రెండు నామాలతో సంబోధిస్తూ ఉంటాం. ఒకటి శివకామసుందరి. రెండవది అఖిలాండేశ్వరి. శివకామసుందరి అన్నప్పుడు ఆమె పరమశివుని ఇల్లాలు. ఆమె అందాన్ని చూచి శంకరుడు అభినందిస్తాడు, సంతోషిస్తాడు. కానీ మనకందరికీ ఆమె జగజ్జనని, అఖిలాండేశ్వరి. ఆమె మాతృత్వం సౌందర్యం. ఆ తల్లిలో ఉన్న  మాతృత్వాన్ని చూసుకొని అమ్మా! అని పిలిచి ఎంత కష్టంలో ఉన్నా సేద దీరుతాం. మనకందరికీ అమ్మ. శంకరుడికి మాత్రం ఇల్లాలు. ఒక పార్వతీ దేవి శివకామ సుందరిగా, అఖిలాండేశ్వరిగా పూర్ణత్వాన్ని పొందినట్లు ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కూడా భర్తకి భార్య, పిల్లలకు తల్లి.

ఒకనాడు భర్త అందాన్ని చూసి భార్య, భార్య అందాన్ని చూసి భర్త సంతోషించినా కొంతకాలం గడిచిన తరువాత శారీరక అందం తెరమరుగయి, శీల వైభవం మరింత ఇంపుగా కనపడుతుంటుంది. ఇల్లయినా అంతే... ఇల్లు ఎప్పుడూ ఎక్కడి వస్తువులు అక్కడ అమర్చి శుభ్రంగా ఉంటే సంతోషం. పిల్లలు పుట్టి పెద్దయ్యే క్రమంలో వారి అల్లరి దానికితోడు పని భారం, ప్రాధాన్యతల్లో మార్పు వచ్చి... వస్తువులన్నీ చిందరవందరగా పడి కనిపిస్తుంటాయి... ఆ సందర్భంలో ఆ ఇల్లు పిల్లల సందడితో, జీవకళతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

శ్రమించినప్పడు వచ్చే చెమట కంపుగా కంటే ఇంపుగా కనిపిస్తుంటుంది.. చెమట విలువ అది. మనం తినే అన్నం ఎంతో మంది రైతులు చెమటోడ్చిన ఫలితం. మనం నిత్యం వాడుతున్న వస్తువులు ఎంతోమంది కార్మికులు చెమటోడ్చి తయారు చేసినవే. మనం పొందుతున్న ప్రశాంతత దేశరక్షణకోసం వేలాది సైనికులు చిందిస్తున్న చెమట ఫలం. చెమట పురోభివృద్ధికి, ప్రగతికి నిదర్శనం. చెమటోడ్చే సమాజంలో, కుటుంబంలో దరిద్రం ఉండదు. శ్రమ సౌందర్యం అందరినీ సంతోషపెడుతుంది.
 -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement