స్వర్ణగిరి, చంద్రగిరి రాజ్యాల మధ్య తరతరాలుగా శత్రుత్వం ఉంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చంద్రగిరి రాజు చంద్రసేనుడు ఇరుగుపొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఒకరోజు స్వర్ణగిరి రాజు సూర్యసేనుడికి ఒక లేఖ పంపాడు. ‘సూర్యసేన మహారాజులవారికి నమస్కారములు.
నేను మీతో మైత్రి కోరుకుంటున్నాను. శత్రుత్వమనేది మన తండ్రుల మధ్య ఉండేది. మన మధ్య కాదు. ప్రజల మధ్య కాదు. ఆ శత్రుత్వం వారితోనే అంతమవనీ. మన రాజ్యాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కోరుకుంటున్నాను. మీరు అంగీకరించగలరని భావిస్తున్నాను’ అని లేఖలో కోరాడు.
సూర్యసేనుడు అందుకు సమాధానంగా..
‘మా నాన్న తన జీవితకాలమంతా మీ రాజ్యాన్ని శత్రురాజ్యంగానే భావిస్తూ వచ్చాడు. మీతో కలవలేదు. నేనూ మా నాన్నగారి మార్గంలోనే నడుస్తాను. మీతో స్నేహం నాకిష్టం లేదు’ అంటూ చంద్రసేనుడితో స్నేహాన్ని తిరస్కరిస్తూ లేఖ రాశాడు. ఇరుగు పొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం మంచిదని, వారు స్నేహ హస్తం అందిస్తున్నప్పుడు తిరస్కరించడం మంచిది కాదని మంత్రి ఎంత చెప్పినా సూర్యసేనుడు ఒప్పుకోలేదు.
ఒకసారి చంద్రగిరి రాజ్యంలో విపరీతంగా వర్షాలు కురవడంతో చెరువులు తెగి వరద వచ్చింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పేదల గుడిసెలు కొట్టుకొని పోయాయి. వరద వల్ల చాలా నష్టం వాటిల్లింది. ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు ఆహారపదార్థాలు, నిత్యావసర వస్తువులు, వస్త్రాలు,« దనం, ఔషధాలు మొదలగునవి అందించి వరద బాధితులను ఆదుకున్నారు. సూర్యసేనుడు మాత్రం మంత్రి చెప్పినా ‘శత్రురాజ్యానికి మనమెందుకు సాయం చేయాలి?’ అంటూ పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు.
ఒకసారి సాయంత్రం సూర్యసేనుడు వనవిహారం చేస్తూ ఓ మొక్కపై అందంగా ఊగుతున్న ఓ పువ్వును చూశాడు. దాన్ని తుంచి వాసన చూశాడు. కొద్ది సేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. రాజ భటులు భవనానికి చేర్చారు. రాజ వైద్యుడు వైద్యం చేసి మెలకువ తెప్పించాడు. ఆ రోజు నుండి ఆయన తీవ్రమైన నరాల నొప్పితో బాధ పడసాగాడు. రాజవైద్యుడు.. అనేక రకాల ఔషధాలు వాడినా నరాల జబ్బు నయం కాలేదు. మంత్రి, రాజవైద్యుడు చుట్టు పక్కల రాజ్యాల నుండి రాజవైద్యులను పిలిపించి వైద్యం చేయించారు.
రోజురోజుకీ నొప్పి పెరుగుతోంది కానీ తగ్గలేదు. రాజవైద్యుడు సూర్యసేనుడితో ‘మహారాజా! మీరు అంగీకరిస్తే ఒక మాట చెబుతాను. చంద్రగిరి రాజ్య వైద్యుడు సౌశీల్యుడిని మించిన వైద్యుడు ఈ చుట్టుపక్కల లేడు. వైద్యశాస్త్రంలో దిట్ట. ఆయనకు తెలియని వైద్యం లేదు. ఆయన మాత్రమే మీ జబ్బును నయం చేయగలడని నా నమ్మకం’ అని చెప్పాడు. సూర్యసేనుడు తటపటాయిస్తూ ‘చంద్రసేనుడు మనతో స్నేహం కోరితే తిరస్కరించాను. ఆ రాజ్యం వరదలతో అతలాకుతలమైతే నేను పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు. ఇప్పుడు నా కోసం వాళ్ళ వైద్యుడిని చంద్రసేనుడు పంపుతాడంటారా?’ అన్నాడు సందేహంగా.
అక్కడే ఉన్న మంత్రి ‘ప్రయత్నిస్తే తప్పులేదు కదా! నేనే స్వయంగా వెళ్లి అడుగుతాను’ అన్నాడు. సూర్యసేనుడు అంగీకరించాడు. మంత్రి చంద్రగిరి రాజ్యానికి వెళ్లి చంద్రసేనుడితో విషయం చెప్పాడు. చంద్రసేనుడు మారుమాట్లాడకుండా తన వైద్యుడిని పంపడానికి సమ్మతించాడు. సౌశీల్యుడు.. మంత్రిని జబ్బు వివరాలు అడిగి రకరకాల ఔషధాలు తీసుకుని స్వర్ణగిరికి వచ్చాడు. సూర్యసేనుడిని పరీక్షించి కొంతకాలం ఆ రాజ్యంలోనే ఉండి తన వైద్యంతో జబ్బును నయం చేశాడు.
చంద్రసేనుడి పట్ల తన ప్రవర్తనకు సూర్యసేనుడు పశ్చాత్తాపపడ్డాడు. ఇరుగుపొరుగుతో శత్రుత్వం మంచిది కాదని, అందరితో కలసిమెలసి ఉండటమే ఉత్తమ లక్షణమని, పట్టింపులతో సాధించేదేమీ లేదని సూర్యసేనుడు గ్రహించాడు. చంద్రసేనుడి ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ, స్నేహం కోరుతూ లేఖ రాశాడు. ఆనాటి నుంచి రెండు రాజ్యాల మధ్య స్నేహం చిగురించింది. – డి.కె.చదువులబాబు
ఇవి చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి?
Comments
Please login to add a commentAdd a comment