వ్యాస మహర్షి శిష్యులతో కలసి కాశీ నగరంలో ఉన్న కాలంలో ప్రతిరోజూ అక్కడి తీర్థాలను, ఆలయాలను సందర్శించసాగాడు. ఒకనాడు కృత్తివాసేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత వ్యాస మహర్షి శిష్యులతో కలసి కపర్దీశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి బయలుదేరాడు. కపర్దీశ్వర లింగానికి సమీపంలోని పిశాచమోచన తీర్థంలో స్నానమాడి, పితృతర్పణాలు విడిచి, కపర్దీశ్వరుడిని పూజించాడు.
వ్యాసుడు, అతడి శిష్యులు అక్కడ ఉండగానే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక ఆడజింక కపర్దీశ్వర లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయసాగింది. దానిని తినడానికి ఒక పెద్దపులి అక్కడు వచ్చింది. పెద్దపులి జింక మీద పడి, గోళ్లతో చీల్చి దానిని చంపేసింది. వ్యాసుడు, అతడి శిష్యబృందం అటువైపుగా వస్తుండటం గమనించిన పెద్దపులి, చంపేసిన జింకను అక్కడే వదిలేసి పారిపోయింది.
అప్పుడే ఒక అద్భుతం జరిగింది. కపర్దీశ్వరుడి ముందు మరణించిన జింక గొప్ప కాంతితో ప్రకాశించింది. మూడు కళ్లతో, నల్లని మెడతో, తలపై నెలవంకతో ఒక వృషభాన్ని ఎక్కి, అదే ఆకారంలో ఉన్న మరో పురుషుడితో కలసి కనిపించింది. జింక చుట్టూ ఒక జ్వాల వెలిగి, గణేశుడి రూపం పొంది అదృశ్యమైంది. వ్యాసుడి శిష్యులు ఈ పరిణామానికి విభ్రాంతులయ్యారు. ‘మహర్షీ! ఏమిటి ఈ అద్భుతం? దీనికి కారణమేమిటి?’ అని అడిగారు.
‘ఇదంతా కపర్దీశ్వరుడి మహాత్మ్యం. కపర్దీశ్వరలింగం మహా మహిమాన్వితమైనది. దీనిని సేవించినట్లయితే, సమస్త పాపాలూ తొలగిపోతాయి. ఇక్కడే ఉన్న పిశాచమోచన తీర్థంలో స్నానమాడి, కపర్దీశ్వరుడిని పూజిస్తే, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. ఈ మహాత్మ్యాన్ని వివరించాలంటే, మీకు శంకుకర్ణుడి కథ చెప్పాలి’ అన్నాడు వ్యాసుడు.
‘ఎవరా శంకుకర్ణుడు? అతడి కథ ఏమిటి? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. చెప్పండి గురుదేవా!’ అభ్యర్థించారు శిష్యులు.
శిష్యుల అభ్యర్థనకు సాదరంగా తలపంకించిన వ్యాసుడు శంకుకర్ణుడి కథను ఇలా చెప్పసాగాడు:
‘ఈ కపర్దీశ్వర క్షేత్రంలోనే లోగడ శంకుకర్ణుడనే మహాముని ఉండేవాడు. ఆయన నిరంతరం రుద్రమంత్రాలు జపిస్తూ కపర్దీశ్వరుడిని పూలు, పండ్లతో పూజిస్తుండేవాడు. జపతపాలతో యోగసాధనలో గడిపేవాడు. ఒకనాడు ఆయన యోగసాధనలో ఉండగా, ఆకలితో అలమటిస్తున్న పిశాచరూపంలో ఉన్న ఒక పురుషుడు వచ్చాడు. ఆ పిశాచాన్ని చూసి, శంకుకర్ణుడు ఎంతో జాలిపడ్డాడు.
‘ఓ పిశాచమా! నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకొచ్చావు?’ అని ప్రశ్నించాడు. శంకుకర్ణుడు తనను ఆదరంగా ప్రశ్నలు అడగటంతో ఆ పిశాచం కన్నీళ్లు పెట్టుకుని, తన వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు.
‘మునీశ్వరా! గత జన్మలో నేను సంపన్న బ్రాహ్మణుణ్ణి. ధనమదంతో బతికినన్ని రోజులూ ఎవరికీ ఎలాంటి దానధర్మాలూ చేయలేదు. మంచి పనులేవీ చేయలేదు. ఒకనాడు వారణాసికి వెళ్లి, అక్కడ కొలువైన విశ్వేశ్వరుణ్ణి పూజించాను. కొంతకాలానికి కాలధర్మం చెందాను. కాశీ విశ్వేశ్వరుణ్ణి ఒక్కసారి పూజించినందున నేను నరకానికి వెళ్లలేదు. అయితే, బతికి ఉన్నన్నాళ్లూ పుణ్యకార్యాలేవీ చేయకపోగా, పాపాలు చేయడంతో ఇలా పిశాచరూపంలో మిగిలాను. ఆకలిదప్పులకు అలమటిస్తూ దిక్కుతోచక ఇక్కడే సంచరిస్తున్నాను. మహాత్మా! నాకీ పిశాచరూపం నుంచి విముక్తి దొరికే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. నువ్వే నాకు దిక్కు’ అని దీనంగా వేడుకున్నాడు.
‘ఓ పిశాచమా! నువ్వు చాలా పుణ్యాత్ముడివి. లోకంలో నీవంటి పుణ్యాత్ములు చాలా అరుదు. పూర్వజన్మలో నువ్వు సకల విశ్వాధినేత అయిన విశ్వేశ్వరుణ్ణి స్వయంగా స్పృశించి పూజించావు. ఆ పుణ్యఫలం వల్లనే తిరిగి ఇదే క్షేత్రానికి వచ్చావు. నీకు వచ్చిన భయమేమీ లేదు. ఇక్కడ కొలువై ఉన్న కపర్దీశ్వరుణ్ణి మనసారా ప్రార్థించి, ఈ పుష్కరిణిలో స్నానం చేయి. నీకీ పిశాచ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది’ అని ధైర్యం చెప్పాడు శంకుకర్ణుడు.
శంకుకర్ణుడి సూచనతో ఆ పిశాచం కపర్దీశ్వరుణ్ణి స్మరిస్తూ, పుష్కరిణిలో స్నానం చేశాడు. పుష్కరిణిలో స్నానం చేయగానే అతడికి పిశాచరూపం పోయి, గొప్ప తేజస్సుతో దివ్యరూపం వచ్చింది. తనకు పిశాచరూపం నుంచి విమోచన కలిగించిన శంకుకర్ణుడి ముందు మోకరిల్లి, నమస్కరించాడు. వెంటనే దేవతలు పంపిన దివ్యవిమానమెక్కి, దివ్యలోకాలకు వెళ్లిపోయాడు.
ఆ అభాగ్యుడికి పిశాచరూపం పోయినందుకు శంకుకర్ణుడు ఎంతో సంతోషించాడు. ఇదంతా కపర్దీశ్వరుడి మహిమేనని తలచి, కపర్దీశ్వరుణ్ణి స్తుతించాడు. తర్వాత ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అలాగే నేలకొరిగిపోయాడు. ప్రాణాలు కోల్పోయిన శంకుకర్ణుడి జీవాత్మ కపర్దీశ్వర లింగంలో ఐక్యమైపోయింది. మునులారా! ఇదీ శంకుకర్ణుడి వృత్తాంతం. మరణానంతరం పిశాచరూపం పొందిన బ్రాహ్మణుడికి ఆ రూపం నుంచి విముక్తి కలిగించడం వల్లనే ఈ పుష్కరిణి పిశాచమోచన పుష్కరిణిగా ప్రఖ్యాతి పొందింది. ఈ పుష్కరిణిలో స్నానం చేసి, కపర్దీశ్వరుణ్ణి పూజించేవారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి’ అని ముగించాడు వ్యాసుడు. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment