పూర్వం ధ్రువసంధి అయోధ్యకు రాజుగా ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మనోరమ, రెండో భార్య లీలావతి. సద్గుణ సంపన్నుడైన ధ్రువసంధి యజ్ఞయాగాదికాలు చేస్తూ, బ్రాహ్మణులకు, సాధు సజ్జనులకు, పేదసాదలకు విరివిగా దానాలు చేస్తుండేవాడు.
ధ్రువసంధికి మనోరమ ద్వారా సుదర్శనుడు, లీలావతి ద్వారా శత్రుజిత్తు అనే కొడుకులు కలిగారు. వారిద్దరూ గురుకులవాసంలో సకల శాస్త్రాలు, అస్త్రశస్త్ర విద్యలు నేర్చి, అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. ధ్రువసంధి పెద్దకొడుకు సుదర్శనుడికి త్వరలోనే పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. వినయశీలుడు, వీరుడు అయిన సుదర్శనుడికి ప్రజామోదం కూడా ఉండేది. అయోధ్య ప్రజలందరూ సుదర్శనుడే తదుపరి రాజు కాగలడని అనుకునేవారు.
సుదర్శనుడికి పట్టాభిషేకం చేయడానికి ధ్రువసంధి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుసుకుని, అతడి రెండో భార్య లీలావతి తండ్రి, శత్రుజిత్తు మాతామహుడు యుధాజిత్తు సహించలేకపోయాడు. తన మనవడినే రాజుగా చేయాలని ధ్రువసంధిని కోరాడు. పెద్దకొడుకుకే పట్టాభిషేకం చేయడం ధర్మమని తేల్చి చెప్పిన ధ్రువసంధి అతడి కోరికను నిరాకరించాడు.
సుదర్శనుడిపై అసూయతో రగిలిపోతున్న యుధాజిత్తు ఒకనాడు అకస్మాత్తుగా తన సేనలతో అయోధ్యపై విరుచుకుపడ్డాడు. ధ్రువసంధిని చెరసాలలో పెట్టి, తన మనవడైన శత్రుజిత్తుకు రాజ్యాభిషేకం చేసి, తానే అధికారం చలాయించడం మొదలుపెట్టాడు. తన సేనలతో ఎలాగైనా సుదర్శనుడిని, అతడి తల్లి మనోరమను బంధించడానికి ప్రయత్నించాడు.
అయితే, ప్రమాదాన్ని శంకించిన మనోరమ కొందరు మంత్రులు, ఆంతరంగికుల సాయంతో కొడుకు సుదర్శనుడితో కలసి అరణ్యాల్లోకి వెళ్లిపోయింది. అరణ్యమార్గంలో ముందుకు సాగుతుండగా, మార్గమధ్యంలో కనిపించిన భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంది. భరద్వాజ మహర్షి వారికి జరిగిన అన్యాయం తెలుసుకుని, జాలితో తన ఆశ్రమంలోనే వారికి వసతి కల్పించాడు.
మనోరమ, సుదర్శనులను ఎలాగైనా పట్టి బంధించి, చెరసాల పాలు చేయాలని భావించిన యుధాజిత్తు వారిని వెదకడానికి రాజ్యం నలుమూలలకు, పొరుగు రాజ్యాలకు వేగులను పంపాడు. కొన్నాళ్లు గడిచాక వారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం తెలుసుకున్నాడు.
సైన్యాన్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని యుధాజిత్తు ఒకనాడు భరద్వాజుడి ఆశ్రమానికి చేరుకున్నాడు.
‘ఓ మునీ! నువ్వు అన్యాయంగా సుదర్శనుడిని, మనోరమను నీ ఆశ్రమంలో బంధించి ఉంచావు. వాళ్లను వెంటనే నాకు అప్పగించు’ అని దర్పంగా ఆదేశించినట్లు పలికాడు.
అతడి మాటలకు భరద్వాజుడు కన్నెర్రచేసి కోపంగా అతడివైపు చూశాడు.
భరద్వాజ మహర్షి ఎక్కడ శపిస్తాడోనని యుధాజిత్తు మంత్రులు భయపడ్డారు. వెంటనే యుధాజిత్తును వెనక్కు తీసుకుపోయారు. ‘మళ్లీ ఈ పరిసరాల్లో కనిపిస్తే నా క్రోధాగ్నికి నాశనమవుతారు’ అని హెచ్చరించాడు భరద్వాజుడు. ఆ మాటలతో యుధాజిత్తు పరివారమంతా వెనక్కు తిరిగి చూడకుండా అయోధ్యకు పరుగు తీశారు.
భరద్వాజుడి ఆశ్రమంలో ఒక మునికుమారుడు మనోరమకు క్లీబ మంత్రాన్ని ఉపదేశిస్తుండగా, సుదర్శనుడు విన్నాడు. ఆ శబ్దం అతడికి ‘క్లీం’ అని వినిపించింది. క్లీంకారం దేవీమంత్రం. సుదర్శనుడు తదేక దీక్షతో క్లీంకారాన్ని జపించసాగాడు.
సుదర్శనుడి నిష్కల్మష భక్తికి అమ్మవారు సంతసించి, అతడి ముందు ప్రత్యక్షమైంది. అతడికి ఒక దివ్యాశ్వాన్ని, గొప్ప ధనువును, అక్షయ తూణీరాలను ఇచ్చింది. ‘నువ్వు తలచినంతనే నీకు సాయంగా వస్తాను’ అని పలికి అదృశ్యమైంది.
ఆనాటి నుంచి సుదర్శనుడు, మనోరమ నిరంతరం భక్తిగా దేవిని పూజించసాగారు.
కొన్నాళ్లకు ఒకనాడు ఒక నిషాదుడు సుదర్శనుడిని చూడవచ్చాడు. అతడు ఒక రథాన్ని సుదర్శనుడికి కానుకగా సమర్పించాడు. అమ్మవారు ఇచ్చిన అస్త్రశస్త్రాలు ధరించి, నిషాదుడు బహూకరించిన రథంపై సుదర్శనుడు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో అతడికి అమ్మవారి శక్తి తోడుగా నిలిచింది.
సుదర్శనుడి ధాటికి యుధాజిత్తు సేనలు కకావిలకమయ్యాయి. అతడి ధనుస్సు నుంచి వెలువడుతున్న బాణాలు తరుముకొస్తుంటే, వారంతా భీతావహులై పలాయనం చిత్తగించారు. యుద్ధంలో ఘనవిజయం సాధించిన సుదర్శనుడు తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment