శివపార్వతులు ఒకనాడు కైలాస పర్వతంపై ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. శివుడిని ఆటపట్టించడానికి పార్వతీదేవి వెనుక నుంచి ఆయన కళ్లు మూసింది. పరమేశ్వరుడి కళ్లు మూయడంతో కొన్ని క్షణాలు అంతటా చీకటి ఆవరించింది. అప్పుడు అంధుడైన ఒక బాలుడు జన్మించాడు. సంతానం కోసం తన గురించి తపస్సు చేస్తున్న హిరణ్యాక్షుడికి శివుడు ఆ బాలుడిని అప్పగించాడు. పుట్టు అంధుడు కావడం వల్ల ఆ బాలుడికి అంధకుడనే పేరు వచ్చింది.
అంధకుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అంధకుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతడి అంధత్వాన్ని పోగొట్టడమే కాకుండా, అనేక వరాలనిచ్చాడు. వరగర్వితుడైన అంధకుడు ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు.
ఒకనాడు అంధకుడు కైలాసంలో సంచరిస్తున్న శివపార్వతులను చూశాడు. అతడికి పార్వతీదేవిపై మోహం కలిగింది. పార్వతీదేవిని తనకు అప్పగించాలని, లేకుంటే తనతో యుద్ధానికి సిద్ధపడాలని శివుడికి కబురు పంపాడు.
అంధకుడి అనుచితమైన కోరిక తెలుసుకున్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంధకుడితో యుద్ధానికి తలపడ్డాడు. అవంతీ దేశంలోని మహాకాలవనంలో ఇద్దరికీ భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో అంధకుడు శివుడిని నానా రకాలుగా బాధించాడు. సహనం నశించిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు అంధకుడి శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. ఆ రక్తధారల నుంచి అనేక అంధకాసురులు పుట్టుకొచ్చారు. శివుడు సంహరించే కొద్ది మరింత మందిగా పుట్టుకు రాసాగారు.
అంధకుడి నెత్తురు కిందపడకుండానే తాగేయడానికి మహేశ్వరి, బ్రహ్మీ, కౌమారి, మాలినీ, సౌవర్ణీ తదితర 189 మాతృకా శక్తులను శివుడు సృష్టించాడు. ఈ మాతృకా శక్తులు అంధకాసురుడి శరీరం నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తాగేశారు. అంధకాసురుడి రక్తం తాగి తృప్తి చెందిన మాతృకలు కొద్దిసేపు ఆగారు. ఈలోగా మరింతమంది అంధకాసురులు పుట్టుకొచ్చి రకరకాల ఆయుధాలతో పరమశివుడిని బాధించడం ప్రారంభించారు.
అంధకాసురుడి బాధ భరించలేక శివుడు చివరకు మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు హుటాహుటిన అక్కడకు చేరుకుని, శుష్కరేవతి అనే శక్తిని సృష్టించాడు. ఆ శక్తి వెళ్లి అంధకాసురుడి శరీరంలోని రక్తాన్ని చుక్కయినా వదలకుండా పీల్చేసింది. దాంతో కొత్త అంధకాసురులు పుట్టడం ఆగిపోయింది. పోరులో మిగిలిన అంధకాసురులను శివుడు సంహరించాడు.
చివరకు శివుడు తన త్రిశూలంతో అసలు అంధకుడిని పొడిచాడు. అతడు నేలకూలి మరణించబోతూ శివుడిని భక్తిగా స్తుతించాడు. మరణానంతరం తనకు శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అంధకాసురుడు తృప్తిగా కన్నమూశాడు.
అంధకాసురుడి మరణం తర్వాత రక్తం రుచి మరిగిన 189 మాతృకలకు ఇంకా ఆకలి తీరలేదు. వారంతా శివుడి వద్దకు వచ్చి, ‘శంకరా! మా ఆకలి ఇంకా తీరలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు అనుమతిస్తే, సమస్త ప్రాణులనూ భక్షిస్తాం’ అన్నారు.
మాతృకల కోరిక విని శివుడు దిగ్భ్రాంతి చెందాడు. ‘మాతృకలారా! మీ ఆలోచన తప్పు. మీరంతా లోకాన్ని రక్షించాలి గాని, భక్షించాలని కోరుకోవడం దారుణం’ అన్నాడు.
మాతృకలు శివుడి మాటలను లెక్కచేయకుండా, ముల్లోకాలలోనూ ప్రాణులను భక్షించడం మొదలుపెట్టారు. మాతృకల ఆగడానికి దేవ దానవ మానవులందరూ హాహాకారాలు ప్రారంభించారు. శివుడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. తాను సృష్టించిన మాతృకలను తానే సంహరించలేక, కనీసం వాని నిలువరించలేక సతమతమయ్యాడు.
చివరకు శివుడు నరసింహావతారాన్ని స్మరించాడు. మెరిసే జూలుతో కూడిన సింహం తల, పదునైన గోళ్లు, పెద్దకోరలతో సాగరఘోషను మించిన భీకర గర్జన చేస్తూ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు.
శివుడు నరసింహుడిని పరిపరి విధాలుగా స్తుతించాడు. ‘స్వామీ! నేను సృష్టించిన మాతృకలు నా అదుపు తప్పారు. నా మాటను లక్ష్యపెట్టకుండా లోకాలను భక్షిస్తున్నారు. నా చేతులతో సృష్టించిన వారిని నేను నాశనం చేయలేకపోతున్నాను. కనుక నువ్వే మాతృకలను అదుపు చేయాలి’ అని ప్రార్థించాడు.
శివుడి విన్నపాన్ని ఆలకించిన నరసింహుడు వాగీశ్వరి, మాయ, భగమాలిని, కాళి అనే నాలుగు శక్తులను, వారికి అనుచరులుగా ఉండటానికి మరో ముప్పయిరెండు దేవతా శక్తులను సృష్టించాడు. నరసింహుడి ఆజ్ఞతో ఈ శక్తులన్నీ కలసి లోకాలను భక్షిస్తున్న మాతృకలపై మూకుమ్మడిగా దాడి చేశాయి. నృసింహ శక్తుల ధాటికి తట్టుకోని మాతృకలు పరుగు పరుగున వచ్చి నరసింహుడి పాదాల ముందు మోకరిల్లి శరణు వేడుకున్నాయి. నరసింహుడు వారికి అభయమిచ్చాడు.
‘మాతృకలారా! దేవతా శక్తులు మానవులను దయతో పాలించాలి, వారిని భక్షించకూడదు. నా మాట ప్రకారం మీరు ఈనాటి నుంచి లోకాలను పాలిస్తూ, అందరూ పరమేశ్వరుణ్ణి పూజించేలా చేయండి. నా భక్తులకు, శివభక్తులకు, మీకు బలులు సమర్పించేవారికి రక్షణ కల్పిస్తూ, వారు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తూ ఉండండి. రానున్న కాలంలో మీరందరూ మానవుల పూజలు అందుకుంటారు’ అని చెప్పి, నరసింహుడు తాను సృష్టించిన శక్తులతో పాటు అంతర్ధానమయ్యాడు. మాతృకలు ఆనాటి నుంచి నరసింహుడు ఆజ్ఞాపించిన ప్రకారం శాంతియుతంగా మారి లోకాలను కాపాడుతూ వస్తున్నారు. – సాంఖ్యాయన
ఇవి చదవండి: 'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...!
Comments
Please login to add a commentAdd a comment