
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల కూతురు ఉంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. ఇంకో బేబీకి ప్లాన్ చెయ్యాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
– రాధ, ధర్మవరం
వయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు తల్లికి, బిడ్డకి ఎక్కువ ఉంటాయి. మొదటి డెలివరీ, ప్రెగ్నెన్సీలో ఏదైనా సమస్యలు ఉంటే అవి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే ఇప్పుడు ఆ సమస్యలు ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏం చేసి వాటిని నార్మల్‌కి తీసుకురావాలి అని ముందే గైనకాలజిస్ట్‌ని కలవాలి.
మధుమేహం సమస్య ఇప్పుడు ఎక్కువ అయితే, హెచ్‌బి ఏ1సీ లెవెల్స్ డైట్ చెక్ చెయ్యండి. లెవెల్స్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యకు మందుల ద్వారా ముందే కరెక్ట్ చెయ్యాలి. థైరాయిడ్ లెవెల్స్ చాలామందికి ముందే తెలియటం లేదు. అది బేబీ మెదడు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది.
అందుకే, ముందు టీఎస్‌హెచ్ లెవెల్స్ చెక్ చెయ్యండి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో శిశువు ఎదుగుదల సమస్యలు వచ్చినట్టయితే ఈసారి రాకుండా కొన్ని మందులు, డైట్ ముందే మార్చి ఇస్తాం. రక్తం గడ్డకట్టడం అవుతుందా అనే రక్తపరీక్షలు ముందే చేయించుకొని, దానికి తగిన మందులు వాడాలి. రక్తహీనత వలన రెండో ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు ఉంటాయి.
శరీరంలో ఐరన్ లోపంతో ఇబ్బంది రావచ్చు. అందుకే సీబీపీ, విటమిన్ బీ–12, విటమిన్–డీ3 లెవెల్స్ ముందే చెక్ చేసుకోవాలి. భర్త వీర్య విశ్లేషణ కూడా ఒకసారి చేయించు కోవాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఇద్దరూ పాటించాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్‌జీ మాత్రలు ప్లానింగ్‌కి మూడు నెలల ముందు నుంచి తీసుకోవాలి. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఏవైనా చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉంటే అవి ఇప్పుడు రాకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి.
వాక్సినేషన్స్ కూడా చాలా ముఖ్యం. ఫ్లూ వాక్సిన్, ఎమ్‌ఎమ్‌ఆర్ వాక్సిన్, ఆటలమ్మ, రుబెల్లా వాక్సిన్స్ ముందు తీసుకోకపోతే ఇప్పుడు తీసుకొని, ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. మీ బరువు ఉండవలసిన బీఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్) కన్నా ఎక్కువ ఉంటే, బీఎమ్‌ఐ 30 కంటే ఎక్కువ ఉంటే కొంత బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.
సమతుల్యమైన, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వ్యాయామం ప్రారంభించాలి. మీరు ఏదైనా సమస్యలకు మందులు వాడుతుంటే అవి ప్రెగ్నెన్సీలో మంచివి కాకపోతే, సంబంధిత డాక్టర్‌ని కలసి మందులను మార్పించుకోవాలి. చాలామందికి ఆందోళన తగ్గించే మందులు, మూర్చవ్యాధికి మందులు మారుస్తాము. ఉద్యోగం ఒత్తిడి ఎక్కువ ఉంటే ఆ ప్రభావం శిశువు ఎదుగుదలపై పడుతుంది. అందుకే సరైన వర్క్ ప్లేస్ సెలక్ట్ చేసుకోండి. ధ్యానం, యోగా చేయటం మంచిది.
డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరిగితే సమస్యలు వస్తాయా..?