బ్రహ్మదేవుడి ఆదేశంతో సూర్యుడు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ లోకానికి వెలుగు పంచుతూ వస్తున్నాడు. సూర్యుడు ప్రదక్షిణ చేసే పర్వతం కావడంతో మిగిలిన దేవతలందరూ మేరువును గౌరవించసాగారు. మేరువు వైభవం వింధ్యపర్వతానికి అక్కసు కలిగించింది. సూర్యుడు మేరువు చుట్టూనే తిరుగుతుండటం, దేవతలు సైతం మేరువునే గౌరవిస్తుండటం, మేరువును గౌరవించే వారెవరూ తనను పట్టించుకోకపోవడం వింధ్యుడి అహాన్ని దెబ్బతీసింది.
నారద మహర్షి ఒకనాడు ఆకాశమార్గాన వింధ్యను దాటుకుని కాశీనగరం వైపు వెళుతుండగా, వింధ్యుడు ఆయనను పలకరించి, ‘మహర్షీ! మా పర్వతాల్లో మేరువు గొప్పా? నేను గొప్పా?’ అని అడిగాడు. ‘ఇద్దరూ ఉన్నతులే! ఎవరి గొప్ప వారిదే!’ అని పలికి, నారద మహర్షి నారాయణ నామజపం చేస్తూ ముందుకు సాగిపోయాడు. నారదుడి సమాధానం వింధ్యుడికి రుచించలేదు.
ఒకనాడు వింధ్యుడు ఉండబట్టలేక సూర్యుడిని అడ్డగించి, ‘ఓ కర్మసాక్షీ! ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను. నువ్వు ఆ మేరుపర్వతం చుట్టూనే ప్రదక్షిణగా తిరుగుతున్నావు. నా వంక చూసీ చూడనట్లు సాగిపోతావేం? నీకిది ఏమైనా మర్యాదగా ఉందా?’ అని నిలదీశాడు. ‘సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకే నేను మేరువు చుట్టూ పరిభ్రమిస్తున్నాను. నేను ఆయన ఆజ్ఞ మీరి లోకరీతిని తప్పితే, జీవులకు మనుగడ అసాధ్యం’ అన్నాడు సూర్యుడు.
సూర్యుడి మాటలు వినే స్థితిలో లేని వింధ్యుడు ‘లోకరీతి ప్రకారం నాలాంటి ఉన్నతుల మాట కూడా నెగ్గాలి. రేపటి నుంచి నువ్వు నా చుట్టూ కూడా తిరుగు’ అని హుకుం జారీ చేశాడు.
‘అయ్యా! నేనేమీ చేయలేను. మేరుపర్వతం మహోన్నతమైనదే కాదు, సృష్టికర్త ఆదేశం కూడా తనకే అనుకూలంగా ఉంది’ అంటూ సూర్యుడు చక్కా పోయాడు.
అహం దెబ్బతిన్న వింధ్యుడు ఎలాగైనా మేరువుకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తనను తాను అంతకంతకూ పెంచుకుని, ఆకాశానికి అడ్డుగా నిలిచాడు. ఆ దెబ్బకు సూర్యచంద్రుల గతులు తప్పి లోకం అంధకారంలో మునిగిపోయింది. వింధ్యుడి విశ్వరూపం చూసి, దేవతలకు దిక్కు తోచలేదు. వారంతా వెంటనే ఇంద్రుడి వద్దకు పరుగు పరుగున వెళ్లి, జరుగుతున్న ఉత్పాతాన్ని వివరించారు.
లోకానికి తలెత్తిన ఈ విపత్తును తప్పించగల సమర్థుడు అగస్త్యుడు మాత్రమేనని తలచాడు ఇంద్రుడు. వెంటనే దేవతలను వెంటపెట్టుకుని, అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్లాడు. వింధ్యుడి ఆగడాన్ని ఆయనకు చెప్పి, ‘మహర్షీ! ఎలాగైనా నువ్వే ఈ ఆపదను తప్పించాలి’ అని ప్రార్థించాడు.
‘మరేమీ భయం లేదు. వింధ్యుడి సంగతి నేను చూసుకుంటాను’ అని చెప్పి అగస్త్యుడు ఇంద్రాది దేవతలను సాగనంపాడు. ఇంద్రాదులు తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాక, అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్యపర్వతం దిశగా బయలుదేరాడు. దేవతలు, మహర్షులు పట్టించుకోవడం మానేసిన తనవైపు అగస్త్యుడు సతీ సమేతంగా వస్తుండటం చూసి, వింధ్యుడి ఆనందానికి అవధులు లేకపోయాయి.
‘మహర్షీ! నా జన్మ ధన్యమైంది. నేను తమ వద్దకు రాలేనని ఎరిగి, నా జన్మ పావనం చేయడానికే మీరిలా తరలి వచ్చినట్లున్నారు. మీకు ఏవిధంగా సేవ చేయగలనో ఆదేశించండి’ అంటూ అగస్త్యుడి ముందు మోకరిల్లాడు వింధ్యుడు.
‘ఓ పర్వతరాజా! నేను అత్యవసరమైన పని మీద దక్షిణ దిశగా వెళుతున్నాను. నువ్వేమో దారికి అడ్డుగా ఇంత ఎత్తుగా ఉన్నావు. అసలే పొట్టివాణ్ణి. నువ్వు కాస్త తలవంచి తగ్గావంటే, ఏదోలా నిన్ను దాటుకుని దక్షిణాపథం వైపు వెళతాను’ అని పలికాడు అగస్త్యుడు.
‘ఓస్! అదెంత పని!’ అంటూ వింధ్యుడు తలవంచి, పూర్తిగా మోకరిల్లాడు.
వింధ్యుడు శిరసు వంచడమే తరువాయిగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి పర్వతానికి అటువైపు చేరుకున్నాడు.
‘పర్వతరాజా! నాది మరో విన్నపం. పని పూర్తయ్యాక నేను ఏ క్షణాన అయినా ఇటు తిరిగి రావచ్చు. నేను మళ్లీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉన్నావంటే, నేను సులువుగా నా ప్రయాణాన్ని పూర్తి చేసుకోగలను’ అన్నాడు. మాట నిలబెట్టుకోవడానికి వింధ్యుడు తలవంచుకుని అలాగే ఉండిపోయాడు. అగస్త్యుడు ఇప్పటికీ అటువైపుగా మళ్లీ రాలేదు. వింధ్యుడి గర్వాన్ని అగస్త్యుడు చాకచక్యంగా అణచాడు. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment