ఒకప్పటి రోజుల్లో ఇంటి ఇల్లాలు ΄పొద్దున్నే లేవగానే చేసే పని,,, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయడం. వెసులుబాటును బట్టి, సందర్భాన్ని బట్టీ చిన్న ముగ్గెయ్యాలో... పెద్ద ముగ్గెయ్యాలో... చుక్కల ముగ్గు పెట్టాలో, గీతల ముగ్గు వెయ్యాలో ముందే అనుకునేవారు. ఇక సంక్రాంతి నెల వచ్చిందంటే పోటా పోటీలుగా ముగ్గులు వేసేవారు. పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా పెట్టేవాళ్లు.
ముగ్గుల మీద కార్టూన్లు కూడా బాగానే పడేవి. ఇక ముగ్గులోకి దించటం, ముగ్గు΄పొయ్యటం లాంటి జాతీయాలు, ముత్యాల ముగ్గు లాంటి సినిమాల సంగతి సరేసరి. ముగ్గులు ఒకప్పుడు శుభాశుభ సంకేతాలుగా పనిచేసేవి. పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు రోజూ ఇల్లిల్లూ తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటిలోకి అడుగుపెట్టేవారు కాదు.
వారే కాదు యాచకులు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్లేవారు కాదు! ఎందుకంటే, ఇంటి వాకిట్లో ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. ధనుర్మాసంలో ప్రతి ఇంటిముందు తెల్లవారుఝామున ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజించడం ఆచారం. ఎందుకంటే గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం.
గొబ్బియల్లో... గొబ్బియల్లో
ముగ్గులకు ఎంత ప్రాధాన్యముందో, ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లు లేదా గొబ్బెమ్మలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు తెలుగువాళ్లు. ఎందుకంటే గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గుమధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని విశ్వాసం. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో.. అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు.
గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. శ్రీ కృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో,, అలాగే గొబ్బిళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడుతారు.
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment