Goda devi
-
మానవ కళ్యాణార్థం మార్గళీ వ్రతం!
పల్లాణ్డు పల్లాణ్డు పల్లాయిరత్తాణ్డుపలకోడి నూఱాయిరమ్ మల్లాణ్డు తిణ్ణోళ్ మణివణ్ణా! ఉన్ శేవడి శెవ్వి తిరుక్కాప్పు’ అంటూ భగవంతుడికే మంగళాశాసనం చేసిన మహాభక్తుడు విష్ణుచిత్తుడు. అతని గారాలపట్టి మన గోదాదేవి ఆచరించిన ముప్ఫై రోజుల వ్రతమే ధనుర్మాస వ్రతం.హేమంత ఋతువులో వాతావరణ ప్రభావం చేత మనుష్యులు సుషుప్తి అవస్థలో వుంటారు. అటువంటి మాయావస్థనుండి బయటపడవైచే ఒకానొక ఉద్దేశంతో ఈ వ్రతం స్వయంగా ఆమె ఆచరించీ, సామాన్యుల చేత ఆచరింపజేసిన మహా తల్లి గోదాదేవి. యితర గోపికలని కూడా కలుపుకుని వారిని వేకువజామునే మేలుకొలుపుతూ అందరిని ఆ భగవత్సన్నిధికి చేరవేసిన నిస్వార్ధపరురాలు. పరమాత్మునికి సామూహిక పూజే చాలా ప్రీతి అన్న విషయం ఎరిగినందుకే గోదాదేవి తన బృందంతో సహా శ్రీ కృష్ణుని వద్దకు వెళ్ళింది. లోకమంతా పచ్చగా, భోగభాగ్యాలతో కళకళలాడాలనే ఉద్దేశంతో పరమాత్మని ప్రార్థిస్తూ తెల్లవారుఝామున స్నానం చేసి సౌందర్యవంతులైన గోపికలతో కలసి చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం. ఇక్కడ సౌందర్యమంటే ఆత్మసౌందర్యం, స్నానమనగా భక్తితత్వంలో మునిగితేలడం. రోజుకొక పాశురం పాడుతూ ఒక్కొక్క గోపికను మేలుకొలిపే ముప్పై పాశురాల రాగమాలికే తిరుప్పావై!రమారమి క్రీ.శ.750 ప్రాంతంలో శ్రీరంగనాథస్వామి వెలసిన శ్రీరంగానికి దగ్గరలో శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో పెరియాళ్వార్ (విష్ణుచిత్తుని మరో పేరు)అనే భక్తశిఖామణి ఒకనాడు తన తులసివనంలో మొక్కలకు పాదులు తవ్వుతుండగా భూమిలో లభించిన ఈ బాలిక కర్కాటక మాసం, పుబ్బానక్షత్రంలో దొరికింది. ఈమెని పెరియాళ్వార్ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. విష్ణుచిత్తుని ఇంట అన్నసంతర్పణలూ, శ్రీరంగనాథుని భజనలే నిత్యకృత్యాలు. అందుకే గోదాదేవి చిన్నతనం నుంచి ఆ రంగనాథుడ్ని మనసారా సేవించింది. ఆమె భక్తితో కట్టే పూలదండలని వాసన చూసి ముందుగా తాను ధరించిన తరువాత వాటిని తండ్రిద్వారా ఆ రంగనాథునికి సమర్పించేది. పూలమాలలని ముందుగా తాను ధరించడంతో ఆమెకు శూడికొడుత్త అనే పేరువచ్చింది. గోదాదేవి ముందుగా ధరించి ఇచ్చిన పూలమాలలు తస్ప వేరే మాలలని తాను ధరించనని రంగనాథుడు స్వయంగా విష్ణుచిత్తునితో చెప్పడంతో తన బిడ్డ కారణ జన్మురాలని తనని తరింపజేయడానికే తన ఇంట వెలసిందని గ్రహించాడు.ద్వాపరయుగంలో గోపికలు శ్రీ కృష్ణుణ్ణి భర్తగా పొందదలచి కాత్యాయనీ వ్రతాన్ని చే శారని తండ్రి ద్వారా తెలుసుకుంది గోదాదేవి. శ్రీకృష్ణుని లీలలు కథలు కథలుగా అక్కడి అందరూ చెప్పుకోవడంతో తాను ఆ కృష్ణావతార సమయంలో ఉంటే బాగుండునని తలచింది. అయితే కృష్ణావతారంలో సత్యభామ తానేనని జ్ఞానసంపద కలిగిన ఓ గోపిక ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తాను కూడా ధనుర్మాస వ్రతమాచరించి ఆ శ్రీరంగనాథుని సన్నిధి చేరుకోవాలని కోరుకుంది. ‘శూడిక్కొడుత్త శుడర్ క్కోడియే..తోల్పావై పొడి యరుళ వల్ల పల్ వళైయామ్, వేంగడ వఱ్కెన్నైవిది యెన్ద విమ్మాత్తమ్, నాంగడవా వజ్రమే నల్గు’ దీని అర్ధం–‘సువాసనతో కూడిన బంగారుజిలుగులు (జ్ఞాన కాంతులు) వెదజల్లే పుష్పదండలను దాల్చి, వాటినే శ్రీరంగనాథునికి సమర్పించిన ఓ మెరుపుతీగా, ఆ వేంకటేశ్వరునికి నీవు ఎట్లైతే ప్రియము కల్గించుమని వేడుకొన్నావో అలాగే, నీ భక్తులమైన మాకు కూడా ఆ వ్రతఫలం కల్గించు తల్లీ!’ అంటూ పరాశరభట్టర్ గోదాదేవిని స్తుతించడం ఇక్కడ గమనించాలి. సుగంధమైన పుష్పమాలలని స్వామికి సమర్పించినందున ఆముక్తమాల్యద అనే పేరు గోదాదేవికి వచ్చింది. కోదై, నాచియార్, ఆండాళ్...ఇలా వివిధ నామధేయాలు ఆమెకున్నాయి.గోదాదేవి మెడలో ధరించే పూమాల భక్తిగీతమాలగా, చేతిలోని చిలుక గురువుకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. గోదాదేవి ధనుర్మాస వ్రతమాచరించడానికి తన గోపికలతో కలసి ఆ పరమాత్మని కోరినదేమిటంటే, భూమండలాన్ని దద్దరిల్లచేసే తెల్లనైన ΄ాంచజన్యమనబడే శంఖాన్నీ, విశాలమైన పర అనే వాద్యాన్ని, మంగళగానం చేయడానికి భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజములు కావాలని కోరింది. వీటిని ఆ భగవత్సేవ వినియోగం కొరకు కోరుకున్నారు. అంతేకాదు, పాంచజన్యం, పర అనే భౌతిక వస్తువులని ఎందుకు కోరారంటే ఈ పరికరాలు ఎల్లప్పుడూ ఆ భగవంతుని అంటి పెట్టుకుని ఉంటాయి. అటువంటివి తమ వద్దవుంటే ఆ భగవంతుడు తమతో ఉన్నట్టేనని భావించి కోరుకున్నారు. వ్రతమాచరించే ముప్పై రోజులూ ఆహారనిష్ఠలతోపాటూ ఇతర కఠినమైన నియమాలు పాటిస్తూ సదా భగవన్నామ స్మరణలో గడిపారు గోదాదేవి బృందం. ఎదుటి వారిని నొప్పించే మాటలు ఆడకుండా, వారికి సహాయపడుతూ కలసి మెలసి మెలుగుతూ లోకకళ్యాణం కొరకు వ్రతమాచరించడమే గోదాదేవి ముఖ్యోద్దేశం.విష్ణుచిత్తుడు ఆ రంగనాథుని ఆజ్ఞతో ముప్పైరోజుల వ్రతానంతరం గోదాదేవిని శ్రీరంగానికి తోడుకొనిపోయి ఆ శ్రీరంగనాథునితో కళ్యాణం జరిపించాడు. గోదాదేవి భక్తి ప్రవత్తుల కారణంగా, జనులందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో లీనమైపోయింది. పన్నిద్దరు ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి మన ఆండాళ్ తల్లి! ‘తిరు’ అంటే శ్రీ, లక్ష్మీ, అమృతం మొదలగు అర్థాలున్నాయి. ‘పావై’ అంటే పాటల సమాహారం, వ్రతం అనే అర్థాలున్నాయి. ‘శ్రీకృష్ణుని(రంగనాథుడు) పొందకోరి ఆచరించిన గానామృత వ్రతమే ఈ మార్గశీర్ష వ్రతం లేదా ధనుర్మాస వ్రతం! మార్గమంటే బుద్ధి, శీర్షమంటే ఉత్తమమైనది. ‘మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే!’ అని స్వయంగా శ్రీ కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. అటువంటి కృష్ణుణ్ణి పొందడానికి మార్గశిరమే ఉత్తమమైన కాలమని భావించి ఈ వ్రతమాచరించింది గోదాదేవి. – కారంపూడి వెంకట రామదాస్ -
Goda Stuti: మార్మిక వధూగీతం గోదాస్తుతి
పదమూడవ శతాబ్దంలో, ఒకనాటి సాయంత్రం, శ్రీవైష్ణవ కవి, తాత్త్వికులు వేదాంత దేశికులు తమిళనాడులో అడవుల మధ్య ఉన్న శ్రీవిల్లిపుత్తూరు మీదుగా ప్రయాణిస్తున్నారు. ఆనాడు త్రయోదశి, మహాప్రదోష సమయం. సంప్రదాయపరులైన శ్రీవైష్ణవులు నరసింహస్వామి ధ్యానంలో మౌనవ్రతాన్ని పాటించే రోజు. అందువల్ల దేశికులు నిశ్శబ్దంగా తమ విడిదిలోకి నిష్క్రమించారు. అప్పుడే ఆ వీధి నుండి పూర్వ శతాబ్దాలకు చెందిన కవయిత్రి, మార్మిక వధువు అయిన శ్రీ ఆండాళ్ ఉత్సవ విగ్రహపు ఊరేగింపు సాగింది. కనుల పండువగా, వైభవోపేతంగా పల్లకీలో సాగే ఆ ఊరేగింపు, ఆ ఊరి వేల్పు వటపత్ర శాయి ఆలయానికి సాగుతోంది. ఆ అద్భుత దృశ్యం దేశికుల మౌనవ్రతాన్ని హఠాత్తుగా భగ్నం చేసింది. వారి నోటి వెంట ఆశువుగా గోదాస్తుతి వెలువడింది. వారు రచించిన 28 స్తోత్రాలలోకి ఇది గొప్ప రచనగా పండితులు భావిస్తారు. నియమ బద్ధమైన మౌనాన్ని ఛేదిస్తూ ఆశుధారగా వెలువడిన ఆ స్తోత్రం శ్రీవైష్ణవ సాహిత్యం లోకెల్లా గంభీరమైన స్తోత్రంగా సంస్కృత పండితులే కాక వేదాంతులు కూడా భావిస్తారు. గోదాస్తుతికి గల గంభీర లక్షణాన్ని అర్థం చేసుకోవాలంటే, శ్రీ వైష్ణవ సిద్ధాంతాల పట్ల లోతైన అవగాహన, శ్రీ ఆండాళ్ కృతులలో, ఆమె పవిత్ర జీవిత గాథలో ప్రతీకాత్మకంగా చెప్పిన విషయాలను అర్థం చేసుకొనే శక్తి ఉండాలి. 1. భగవంతుని వారసులుగా తప్ప జీవాత్మలకు ఏ విధమైన గుర్తింపూ లేదు. 2. ఇహలోక యాత్రలో తమ ప్రాణేశ్వరుడైన పరమాత్మను అన్వేషించటం కంటే, అతనితో తమ జీవనాన్ని పెనవేసుకోవటం కంటే మరో ముఖ్యమైన కార్యక్రమం జీవాత్మలకు లేదు. 3. విశ్వజనీన వరుడు పరమాత్మతో కలయికకు ఎదురుచూడని జీవాత్మల గాథలు వ్యర్థాలు. శ్రీవైష్ణవ మతానుసారం, భగవానుని సంయోగం కోసం ఎదురుచూడని జీవుని జన్మ వృథా! అందువల్ల జీవాత్మ ఎప్పుడూ పరమాత్మ కోసం అన్వేషించి, తపించి, కనుగొని అతనిలో విశ్రమించాలి. ‘వధూమార్మికత’ అనే దృక్కోణంపై గోదాదేవి జీవితగాథ, ఆమె కవిత్వ మహత్తర సౌధం నిర్మితమైంది. ఆండాళ్ ‘నాచ్చియార్ తిరుమొళి’లో తొణికిసలాడుతున్న వధూమార్మికత లేదా ప్రణయభక్తి, పరమాత్మ కొరకు జీవుని వేదన... అప్పటి శ్రీ వైష్ణవ ఆలోచనాధారను ప్రభావితం చేశాయి. శ్రీవైష్ణవ సిద్ధాంతాలకు ఆనందప్రదమైన నిరూపణగా నిలిచిపోయాయి. ఈ విషయాన్నే దేశికులు గోదాస్తుతిలోని ఎనిమిదవ చరణంలో చెప్పారు. ఆమె తండ్రి అయిన పెరియాళ్వారుతో సహా వైదిక విశ్వాసం గల పెద్దలు కూడా తమ సంప్రదాయాలను వదలి, తమ ఆధ్యాత్మిక అన్వేషణలో గోదాదేవి చూపిన ప్రణయ భక్తి మార్గాన్ని అనుసరించారు. గోదాదేవి దాల్చి ఇచ్చిన మాలను ధరించి సంతోషించిన రంగనాథుడు, ఆమె పాశురాలకు పరవశించిన స్వామి, ఆమె జీవులను రక్షించటానికి ఏమి చేయమంటే అది చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని శ్రీవైష్ణవుల విశ్వాసం. (క్లిక్ చేయండి: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం) – శ్రీదేవి మురళీధర్ -
Dhanurmasam 2022: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం
గోదాదేవి పేరుతో తిరుప్పావై కావ్యాన్ని ఉపనిషత్తుల సారాంశం అని వర్ణిస్తారు. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషత్ అంటూ తిరుప్పావైని గోదోపనిషత్ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయం లోనే పఠించాలి. అందాల పల్లె వ్రేపల్లెలో కరువువచ్చింది. అందరూ ఆందోళన పడుతూ క్రిష్ణయ్య దగ్గరకు వెళ్లి తమను ఆదుకోమని గోప గోపీజనులు కోరారు. చిన్నారి కన్నె పిల్లలయిన గోపికలతో వ్రతం చేయిస్తే బాగుంటుందనీ అన్నారట. సరే నని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి నియమాలు వివరించి, తెల్లవారు ఝామున రావాలని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడు. దాంతో తిరుప్పావై కథావస్తువు మొదలైంది. శ్రీకృష్ణుడితో గడిపితే కలిగే ఆనందం, ఉత్సాహం గుర్తుకు వచ్చి గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రి గడిపారు. తెల్లవారు ఝామునే రమ్మన్నాడు కిట్టయ్య అందరినీ లేపుదాం అని బయలుదేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నాందీ ప్రస్తావన. తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగు వేల కవితలను నాలాయ రమ్ (నాల్ అంటే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమఱై అంటే నైవేద్యం తరువాత నాలాయిర ప్రబంధ పారాయణం... తిరుప్పావై మంగళా శాసనం ప్రణవ నాదంతో ముగుస్తుంది. ఈ తమిళ ప్రబంధ పారాయణానికి ఏ ప్రతి బంధకాలూ లేవు. కఠినమైన నిబంధనలు లేవు. వర్ణ భేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. నారాయణ మంత్ర సారాంశాన్ని పాశురంలోని అక్షరక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, నారాయణుని తిరుమంత్రాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ రహస్యాలు విప్పినవాడు రామానుజుడు. కుల మత భేదాలు లేకుండా అంద రికీ నారాయణుని చేరే జ్ఞాన, వ్రత, మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే ఇద్దరూ– గోదాదేవి, శ్రీరామానుజుడు. తిరుప్పావై జీయర్ అని రామానుజుని అంటారు. గోదాదేవి పుట్టి కావేరి నది తీరంలో శ్రీరంగనిలో లీనమైన రెండు వందల ఏళ్ల తరువాత క్రీస్తు శకం 1000లో జన్మించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం ఒక కారణమైతే... తనకు రంగనితో వివాహమైతే మధురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో శ్రీ సుందర బాహుస్వామికి వేయి బిందెల పాయసం చేయిస్తానన్న మొక్కును ఆయన తీర్చడం మరో కారణం. గోదాదేవి శ్రీరంగడిలో లీనం కావడం వల్ల ఆమె తన మొక్కు తీర్చలేకపోయారు. ఆ విషయం విన్న మరుక్షణమే రామానుజుడు శ్రీసుందర బాహుస్వామి ఆలయా నికి వెళ్లి వేయిబిందెల పాయసం సమర్పించారట. శంగత్తమిళ్ అంటే అందమైన తమిళ భాష అని అర్థం. డిసెంబర్ మధ్యలో ఉండే ధనుర్మా సంలో వచ్చే తమిళ నెల. సూర్యుడు ధనుర్ రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. గోదాదేవి రోజుకో పాశురాన్ని పాడి తోటి వారిని పూజకు పిలిచిన నెల ఇది. ఆ విధంగా 30 అందమైన ఎనిమిది పాదాల కవితలు గోదా గళం నుంచి జాలు వారాయి ఈ నెలలో. పదం పదంలో పుణ్యకథ కనిపిస్తుంది. వాటిని వింటుంటే రామాయణ ఘట్టాలూ, భాగవత తత్వం, శ్రీకృష్ణలీలలు కళ్ల ముందు కదలాడుతాయి. ఇందులో భక్తి సాహిత్యం, శరణాగతి, విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది. కానీ ఇది సిద్ధాంత తత్వ గ్రంథం కాదు. ఒక్కో పాశురం ఒక్కొక్క బోధనా, సాధనా... ఒక పిలుపు, వ్రతం, ఆరాధన కలిసిన ప్రేమరస ప్రవాహం. ఆద్యంతం భక్తిభావ బంధురం. తిరుమల తిరుపతిలో ఈ ధనుర్మాసపు ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు రచించిన పాశురాలు విన్న తరువాత... శ్రీనివాసుడు పొద్దున్నే లేవగానే శ్రావ్యంగా ఈ తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున మొత్తం 30 వింటాడు. గోదా గీతాగోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాసపు గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంథ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు 30 రోజులు సాగుతాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సిరినోము సంక్రాంతి దాకా సాగే ఆధ్యాత్మి కోద్యమం ఇది. (క్లిక్ చేయండి: అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే..) - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్ర యూనివర్సిటీ (డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా) -
16న గోదాదేవి పరిణయోత్సవం
సాక్షి, తిరుమల: ధనుర్మాసంలో చివరి రోజు శుక్రవారం కనుమ పండుగనాడు తిరుమల ఆలయంలో శ్రీగోదా పరిణయం నిర్వహించనున్నారు. శ్రీవారి వక్షస్థల లక్ష్మిని గోదాదేవిగా భావించి గోదాదేవి పరిణయోత్సవం ఏకాంతంగా (భక్తులను అనుమతించకుండా) నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తిరుపతి శ్రీగోవింద రాజస్వామి ఆలయంలోని గోదాదేవి (ఆండాళ్) ధరించిన పుష్పమాలలు తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారికి ధరింపజేస్తారు. అదే రోజు పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవమూర్తులు ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పార్వేట మండపం వద్దకెళ్లి వేట కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆరోజు ఆలయంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 15 నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి తిరుమల విజయ బ్యాంకులోని కరెంట్ బుకింగ్ కౌంటర్లో 100 సుప్రభాతం టికెట్లు కేటాయించనున్నారు. -
కనుల పండువగా గోదాదేవి కల్యాణం
వల్లూరు, న్యూస్‌లైన్: పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి కల్యాణోత్సవం మంగళవారం కనుల పండువగా జరిగింది. ఆలయ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి సమక్షంలో వేద పండితులు అఖిల్ దీక్షితులు, సుమంత్ దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీ మహా విష్ణువు అంశ అయిన శ్రీ చెన్న కేశవునికి , శ్రీమహాలక్ష్మి అంశ అయిన గోదాదేవి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాంగల్య ధారణ కార్యక్రమాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు . స్వామి వారి తలంబ్రాల కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. స్వామివారి తలంబ్రాలను వేదపండితులు భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టారు. ఈ సందర్భంగా కొండప్రాంతమంతా గోవిందనామ స్మరణతో మార్మోగింది. కాగా ఉదయం స్వామివారికి బిందె తీర్థ సేవను నిర్వహించారు. దనుర్మాస ప్రాతఃకాల పూజ నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కల్యాణోత్సవంలో మాజీ మేయర్ పుష్పగిరిలో జరిగిన గోదాదేవి కల్యాణంలో మాజీ మేయర్, వైఎస్ఆర్సీపీ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త పీ రవీంద్రనాధరెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సేవాదళ్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు ఇందిరెడ్డి శంకర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు ఈవీ. మహేశ్వరరెడ్డి, డీఎల్ శ్రీనివాసులురెడ్డి,డీఎల్ మురళీధర్‌రెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రాజోలు వీరారెడ్డి దంపతులు కూడా కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు.