ధనుర్మాసంలో చివరి రోజు శుక్రవారం కనుమ పండుగనాడు తిరుమల ఆలయంలో శ్రీగోదా పరిణయం నిర్వహించనున్నారు.
సాక్షి, తిరుమల: ధనుర్మాసంలో చివరి రోజు శుక్రవారం కనుమ పండుగనాడు తిరుమల ఆలయంలో శ్రీగోదా పరిణయం నిర్వహించనున్నారు. శ్రీవారి వక్షస్థల లక్ష్మిని గోదాదేవిగా భావించి గోదాదేవి పరిణయోత్సవం ఏకాంతంగా (భక్తులను అనుమతించకుండా) నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా తిరుపతి శ్రీగోవింద రాజస్వామి ఆలయంలోని గోదాదేవి (ఆండాళ్) ధరించిన పుష్పమాలలు తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారికి ధరింపజేస్తారు. అదే రోజు పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవమూర్తులు ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పార్వేట మండపం వద్దకెళ్లి వేట కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా ఆరోజు ఆలయంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 15 నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి తిరుమల విజయ బ్యాంకులోని కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో 100 సుప్రభాతం టికెట్లు కేటాయించనున్నారు.