
సాక్షి, తిరుమల: ఈనెల 15 నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో 16వ తేదీ ఉదయం నుంచి జనవరి 14 వరకు తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ నెల రోజులూ శ్రీవారిని సుప్రభాత సేవకు బదులుగా తిరు ప్పావై పఠనంతో మేల్కొలుపుతారు. అర్చ కులు రోజుకో పాశురం చొప్పున పఠిస్తారు. స్వామి వారి సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసీదళాలకు బదులుగా ఈ నెలరోజులూ బిల్వపత్రాలు ఉపయోగిస్తారు. ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు.
రూ.1.66 కోట్ల విరాళం
టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం 1.66 కోట్లను దాతలు విరాళంగా అందజేశారు. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు ఎస్.వెంకట్ ఎస్వీ అన్నప్రసా దం ట్రస్టుకు రూ.1,05,06,500, చండీఘడ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ.. నెక్టార్ లైఫ్ సైన్సెస్ సీఎండీ సంజయ్ గోయల్ రూ.51 లక్షలు అందజేశారు. ఏపీ రైస్ మిల్లర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు రూ.10 లక్షలను విరాళంగా ఇచ్చారు. అజ్ఞాత భక్తుడు శ్రీవారికి మూడేళ్లకు సరిపడా మేల్‌చాట్ వస్త్రాల కోసం రూ.1.20 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.