special worship
-
గంగా నదికి మోడీ ప్రత్యేక పూజలు
-
దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం బంగారు బోనం సమర్పించింది. 11 రకాల బోనాలు, పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి బంగారు బోనంతో పాటు అందజేసింది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీన్మార్ డప్పులు, కోలాట నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఇంద్రకీలాద్రికి చేరిన ఊరేగింపునకు దుర్గగుడి చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు బంగారు బోనం అందజేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న శాకంబరీదేవి ఉత్సవాలు ఆదివారం రెండో రోజూ వైభవంగా కొనసాగాయి. రికార్డు స్థాయిలో సుమారు 70 వేల పైచిలుకు భక్తులు అమ్మవారిని శాకంబరీదేవిగా దర్శించుకున్నారు. కాగా, దుర్గమ్మను శాకంబరీదేవి అలంకారంలో రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం దర్శించుకున్నారు. -
రంజాన్‌కు భారీ బందోబస్తు
సాక్షి హైదరాబాద్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు నిర్ణీత ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మీరాలం ఈద్గా వద్ద.. ఈద్గా మీరాలం ట్యాంక్ వైపు ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను పురానాపూల్, కామాటిపు రా, కిషన్‌బాగ్, బహదూర్‌పురా చౌరస్తా మీదుగా పంపిస్తారు. సాధారణ వాహనాలను బహదూర్‌పురా చౌరస్తా నుంచి కిషన్‌బాగ్, కామాటిపురా వైపు మళ్లిస్తారు. సైకిళ్లు, రిక్షాలను ఈద్గా క్రాస్ రోడ్స్ దాటి రానివ్వరు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాండ్స్‌లో వీటిని ఆపుకోవాలి. శివరాంపల్లి, నేషనల్ పోలీసు అకాడమీ వైపు నుంచి బహదూర్‌పురా వచ్చే ట్రాఫిక్‌ను ధనమ్మ గుడిసెలున్న టీ–జంక్షన్ నుంచి ఆలియాబాద్, తాడ్‌బండ్, బాయిస్ టౌన్ హైస్కూల్ మీదుగా పంపిస్తారు. ప్రార్థనల అనంతరం వేగంగా ప్రయాణించే వాహనాలను పునారాపూల్, సిటీ కాలేజ్ మీదుగా పంపుతారు. మాసబ్‌ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ వద్ద.. మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వచ్చే సాధారణ వాహనాలు అయోధ్య, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్, తాజ్‌కృష్ణా మీదుగా వెళ్లాలి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి మాసబ్‌ట్యాంక్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్‌కృష్ణా, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. లక్టీకాపూల్ నుంచి రోడ్ నంబర్ 1/12 వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను అయోధ్య, నిరంకారి, చింతల్‌బస్తీ మీదుగా పంపిస్తారు. (చదవండి: నైట్ బజార్.. ఫుల్ హుషార్.) -
తిరుమల ఆలయంలో 16 నుంచి ధనుర్మాస పూజలు
సాక్షి, తిరుమల: ఈనెల 15 నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో 16వ తేదీ ఉదయం నుంచి జనవరి 14 వరకు తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ నెల రోజులూ శ్రీవారిని సుప్రభాత సేవకు బదులుగా తిరు ప్పావై పఠనంతో మేల్కొలుపుతారు. అర్చ కులు రోజుకో పాశురం చొప్పున పఠిస్తారు. స్వామి వారి సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసీదళాలకు బదులుగా ఈ నెలరోజులూ బిల్వపత్రాలు ఉపయోగిస్తారు. ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు. రూ.1.66 కోట్ల విరాళం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం 1.66 కోట్లను దాతలు విరాళంగా అందజేశారు. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు ఎస్.వెంకట్ ఎస్వీ అన్నప్రసా దం ట్రస్టుకు రూ.1,05,06,500, చండీఘడ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ.. నెక్టార్ లైఫ్ సైన్సెస్ సీఎండీ సంజయ్ గోయల్ రూ.51 లక్షలు అందజేశారు. ఏపీ రైస్ మిల్లర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు రూ.10 లక్షలను విరాళంగా ఇచ్చారు. అజ్ఞాత భక్తుడు శ్రీవారికి మూడేళ్లకు సరిపడా మేల్చాట్ వస్త్రాల కోసం రూ.1.20 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
సిరుల తల్లికి మార్గశిర మాసోత్సవాలు
ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు సత్యంగల తల్లిగా.. కోరిన వరాలిచ్చే కల్పవల్లిగా, ఆంధ్రజనావళికి అమ్మగా భాసిల్లుతోంది విశాఖపట్నం నగరం ఓడరేవు ప్రాంతంలో బురుజుపేటలో వెలసిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు. తనని సేవించడానికి వర్ణ, వర్గ వివక్షతలేవి ఉండకూడదని అమ్మవారు తనకు గుడి కట్టవద్దని భక్తులకు ఆదేశం ఇవ్వడంతో ఆ తలంపును విరమించుకున్నారు. పూజలు చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించి సేవించుకొనే సంప్రదాయం ఈ ఆలయ ప్రత్యేకత. శ్రీకనక మహాలక్ష్మీ విగ్రహం ఇతర దేవాలయాల వలే గాక గోపురం లేని బహిరంగ మండపంలో ప్రతిష్ఠింపబడింది. భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతుంటారు. అమ్మవారికి ప్రీతికరమైన గురువారం తెల్లవారింది మొదలు రాత్రి వరకు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలతో పూజించి, నారికేళం సమర్పించడానికి వచ్చే భక్తులకు అంతుండదు. అమ్మవారి ఆలయం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. రాష్ట్రంలో 10 దేవాలయాల్లో ఒకటి రాష్ట్రంలోని పది ప్రధాన దేవాలయాల్లో కనకమహాలక్ష్మి దేవాలయం ఒకటి. మార్గశిర మాసోత్సవాల్లో నెలరోజులు నిత్యకల్యాణం, పచ్చతోరణంగా అమ్మవారి సన్నిధి కనబడుతోంది. మార్గశిర మాసోత్సవాలు.. శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మార్గశిర మాసోత్సవాల్లో వచ్చే గురువారాల్లో లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నెల 28, డిసెంబరు 5, 12, 19, 26 తేదీల్లో వచ్చే గురువారాల్లో ప్రత్యేకపూజలు, పంచామృతాభిషేకాలు, విశేషపూజలు నిర్వహిస్తుంటారు. డిసెంబర్ 15న వేదసభ, 21న రథోత్సవం, 22న అర్చక సదస్సు, 26న సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. 19న మహాన్నదానం జరపనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో మాదిరిగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. మార్గశిర మాసం చివరి గురువారం మరింత పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టనున్నారు. - చిటికిరెడ్డి వెంకటరమణ, సాక్షి, విశాఖ దక్షిణ మార్గశిర గురువారాల్లో జరిగే విశిష్ట కార్యక్రమాలు ►బుధవారం రాత్రి(తెల్లవారితే గురువారం) ►12.05 నుంచి 1.30 గంటల వరకు విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన పూజ, స్వర్ణాభరణ అలంకరణ ►1.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు సర్వదర్శనం ►11.30 నుంచి 12 గంటల వరకు మహానివేదన(రాజభోగం) ►మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం ►సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన , స్వర్ణాభరణ అలంకరణ ►రాత్రి 7 గంటల నుంచి సర్వదర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు ►ఉదయం 5 నుంచి 6 గంటల వరకు పంచామృతాభిషేకం, అమ్మవారికి సహస్ర నామార్చన ►ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం ►11.30 నుంచి మ«ధ్యాహ్నం 12.30 గంటల వరకుపంచామృతాభిషేకం, అష్టోత్తర నామార్చన ►12.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్వదర్శనం ►సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు విశేష పంచామృతాభిషేకం ►రాత్రి 7 నుంచి వేకువజాము 4.30 గంటల వరకు సర్వదర్శనం ►మండపంలో జరుగు వైదిక కార్యక్రమాలు.. (గురువారం మినహా..) ►ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పంచామృతాభిషేకం, శ్రీచక్ర నవావర్ణార్చన ►ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మార్గశిర మాస విశేష కుంకుమార్చన ►ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మార్గశిర మాస శ్రీలక్ష్మీ పూజ, వేదపారాయణ, మహావిద్యా పారాయణ, సప్తశతీ పారాయణ ►ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అష్టోత్తర కుంకుమార్చన -
పెన్‌గంగకు పాలాభిషేకం
జైనత్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం డొల్లార గ్రామంలో పెన్‌గంగా నదికి సోమవారం ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే బాపూరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. -
పుష్పం సమర్పయామి!
వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని పుష్పయాగం సోమవారం కనుల పండువగా నిర్వహించారు. ముందుగా సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను ఆలయ రంగమంటపంలో శేషవాహనం పడగ కింద ఆశీనులను చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన అనేక రకాల పూలతో స్వామిని పూజించారు. పుష్పయాగానికి అశేషంగా ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ కేవీ రమణ దంపతులు పాల్గొన్నారు. కోదండరాముని బ్రహ్మోత్సవంలో భాగంగా చివరి రోజు సోమవారం ఆలయ గర్భగుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పాన్పుపై సీతారాములను ఆసీనులను చేశారు. వివిధ రకాల పుష్పాలు, ఫలాలతో స్వాములవారి పాన్పును సుందరంగా అలంకరించారు. ఏకాంత సేవలో కొలువుదీరిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. - ఒంటిమిట్ట -
విఘ్నేశ్వరుని సేవలో వైఎస్సార్సీపీ నేతలు
నెల్లూరురూరల్, న్యూస్‌లైన్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వేదాయపాళెం సెంటర్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహాన్ని వైఎస్సార్సీపీ నాయకులు గురువారం రాత్రి దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిపి, ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్, నగర సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, స్థానిక నాయకులు భీమినేని మురహరి, పురుషోత్తంయాదవ్, నరసింహయ్యముదిరాజ్, రాజగోపాల్‌రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. రూ.1.18 లక్షలు పలికిన లడ్డూ వేదాయపాళెం సెంటర్లోని గణేష్ విగ్రహం వద్ద ఉంచిన స్వామి వారి లడ్డూకు వేలం నిర్వహించారు. స్థానికుడైన చంద్రమౌళినాయుడు రూ.1.18లక్షలకు ఆ లడ్డూను దక్కించుకున్నారు. -
నెట్టికంటి ఆలయంలో భక్తుల సందడి
కసాపురం(అనంతపురం), న్యూస్‌లైన్: మండల పరిధిలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి శ్రీఆంజనేయస్వామి ఆలయం శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా భక్తులతో సందడి నెలకొంది. ప్రధాన అర్చకులు వేకువజామునే స్వామి వారికి నిత్యాభిషేకం, సుప్రభాత సేవ, వజ్రకిరీటధారణ, వజ్రకవచ అలంకరణ చేశారు. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని ముస్తాబు చేశారు. భక్తులు స్వామి వారికి ఆకు పూజలు, వడమాల సేవ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసతి సముదాయాలు మొత్తం భర్తీ కావడంలో భక్తులు ఆలయ పరిసరాలు, పార్కులను ఆశ్రయించారు. తాగునీటికి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఈఓ ఎంవీ సురేష్‌బాబు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మల ఆధ్వర్యంలో భక్తులకు అన్నీ ఏర్పాట్లు చేశారు. రూరల్ సీఐ మున్వర్ హుస్సేన్, రూరల్ ఎస్ఐ వలిబాషా, వజ్రకరూరు ఎస్ఐ వంశీకృష్ణ పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పూజ కార్యక్రమాలకు స్థానికులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడ భారీగా తరలివచ్చారు. నెట్టికంటుడిని దర్శించుకున్న కర్ణాటక ఎమ్మెల్యేలు కర్ణాటక రాష్ట్ర బళ్లారి అర్బన్ మాజీ ఎమ్మెల్యే, కంప్లి ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్‌రెడ్డి, సురేష్‌బాబు శనివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని వేర్వేరుగా దర్శించుకున్నారు. శ్రావణమాసం శనివారం సందర్భంగా బళ్లారి అర్బన్ మాజీ ఎమ్మెల్యే, కర్ణాటక రాష్ట్ర మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గాలి సోమశేఖర్‌రెడ్డి దంపతులు బెంగళూరు నుంచి వస్తూ మురడి, నేమకల్లు ఆంజినేయ స్వామిని దర్శించుకుని అనంతరం కసాపురం ఆంజనేయస్వామి దర్శనార్థం వచ్చారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేష్‌బాబు తన మిత్రృబందంతో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే ఆర్.సాయినాథ్‌గౌడ్ కూడ పాల్గొన్నారు. -
వరలక్ష్మి... వరములీయవే!
శావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. వేకువజామునే లేచి వరాలతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాలకు తరలివెళ్లి అమ్మవారి వ్రతాలను ఆచరించారు. పసుపు, కుంకుమలు నెవేద్యంగా సమర్పించి పిల్లపాపలను చల్లంగా చూడాలని వరలక్ష్మీ మాతను వేడుకున్నారు.