ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం బంగారు బోనం సమర్పించింది. 11 రకాల బోనాలు, పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి బంగారు బోనంతో పాటు అందజేసింది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తీన్‌మార్ డప్పులు, కోలాట నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఇంద్రకీలాద్రికి చేరిన ఊరేగింపునకు దుర్గగుడి చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు బంగారు బోనం అందజేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న శాకంబరీదేవి ఉత్సవాలు ఆదివారం రెండో రోజూ వైభవంగా కొనసాగాయి.
రికార్డు స్థాయిలో సుమారు 70 వేల పైచిలుకు భక్తులు అమ్మవారిని శాకంబరీదేవిగా దర్శించుకున్నారు. కాగా, దుర్గమ్మను శాకంబరీదేవి అలంకారంలో రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment