ఇంద్రకీలాద్రికి పెరుగుతున్న భక్తుల రద్దీ
వీఐపీలకే పెద్దపీట..సామాన్య భక్తులకు తిప్పలు
నేడు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు.
సాయంత్రం ఆదిదంపతుల నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్‌లో కళావేదికపై ప్రదిర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. సోమవారం శ్రీ మహా చండీదేవి అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.
వీఐపీలకే పెద్దపీట...
ఇంద్రకీలాద్రిపై రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల సిఫారసు లేఖలు రావడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు.
వీఐపీలు తమకు నిర్దేశించిన సమయంలోనే దర్శనానికి రావాలని కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదు. రూ.500 టికెట్ కొన్నవారికి దర్శనానికి ఐదు గంటలు పట్టింది. రూ.100, రూ.300 దర్శనం టికెట్లు కొన్న వారికే త్వరగా దర్శనమవుతోంది.
జత్వానీకి రాచమర్యాదలు
చీటింగ్ కేసులో నిందితురాలు, సినీ నటి కాదంబరీ జత్వానీకి ఇంద్రకీలాద్రిపై రాచమర్యాదలు చేశారు. తల్లిదండ్రులతో కలిసి ఆదివారం ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆమెకు పోలీసులు ప్రత్యేక ప్రొటోకాల్ ఏర్పాటు చేశారు. ఆమెకు ఇద్దరు కానిస్టేబుళ్లు దగ్గరుండి మరీ వీఐపీ దర్శనం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment