ఇంద్రకీలాద్రిపై పోటెత్తుతున్న భక్తులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి(విజయవాడ పర్పింమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మూడోరోజు అన్నపూర్ణాదేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. సెలవుల నేపథ్యంలో ఆదివారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దర్శనానికి వచ్చే వీఐపీలు తమకు నిర్దేశించిన సమయంలోనే రావాలని కలెక్టర్ డాక్టర్ సృజన, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు.
దుర్గమ్మకు మంగళ సూత్రాల సమర్పణ
ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన చిరువ్యాపారి కళ్లకుంట అంకులయ్య, రాజేశ్వరి దంపతులు దుర్గమ్మకు బంగారు మంగళ సూత్రాలు తయారు చేయించారు. రూ.18 లక్షలు విలువ చేసే 203 గ్రాముల బంగారు మంగళ సూత్రాలను శనివారం సమర్పించారు. అలాగే గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు 5.7 కిలోల వెండితో తయారు చేసిన హంస వాహనాన్ని శనివారం జగన్మాతకు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో కె.ఎస్.రామారావు దాతలను అభినందించారు.
కనులవిందుగా నగరోత్సవం
దసరా మహోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల నగరోత్సవం నయనమనోహరంగా సాగింది. ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, పండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నేటి అలంకారం.. శ్రీలలితా త్రిపుర సుందరీదేవి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో నాలుగోరోజైన ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహా మంత్రాధిదేవతగా వేం చేసి ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా, చిరు మందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరుకుగడను చేత పట్టుకుని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నది.
ద్వారకా తిరుమల నుంచి పట్టువ్రస్తాలు
దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టువ్రస్తాలను సమర్పించేందుకు ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో మూర్తి, ఆలయ అర్చకులు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆయనకు, దేవస్థాన అర్చకులకు, దుర్గగుడి దేవస్థానం తరఫున ఈవో కె.ఎస్.రామారావు అమ్మవారి ప్రసాదాలను అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment