ఆన్‌లైన్‌తో పాటు దేవస్థానం టికెట్ల కౌంటర్లలో లభ్యం
వైదిక కమిటీతో ఈవో సమావేశం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో వచ్చాయి. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను నిర్వహిస్తారు.
ఆయా టికెట్ల ధరలను దేవస్థానం ఖరారు చేయగా, ఆన్‌లైన్‌తో పాటు దేవస్థానం ఆవరణలోని టికెట్ కౌంటర్, మహామండపం దిగువన టోల్‌ఫ్రీ నంబర్ కౌంటర్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ. 5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ. 3 వేలుగా నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన టికెట్ ధర రూ. 5 వేలు.
ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చనకు టికెట్ ధర రూ. 3 వేలు, ప్రత్యేక చండీహోమం టికెట్ ధర రూ. 4 వేలుగా నిర్ణయించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే వేద విద్వత్ సభ అక్టోబర్ 10న, అర్చన సభ 11న నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారికి విశేష అలంకారాలు, ప్రత్యేక పూజలు, నివేదనలు, వేద సభ, అర్చక సత్కారం వంటి వైదిక కార్యక్రమాలపై వైదిక కమిటీ సభ్యులతో ఈవో రామారావు గురువారం సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment