కనులపండువగా నగరోత్సవం
నేడు మూలా నక్షత్రం.. పట్టువ్రస్తాలను సమర్పించనున్న ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు మంగళవారం మహాలక్ష్మిదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సాయంత్రం నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్‌లో కళావేదికపై ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
బుధవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రాత్రి 11 గంటల నుంచే ఇంద్రకీలాద్రిపైకి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూలా నక్షత్రం నాడు 2 లక్షల మందికిపైగా భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు తగినట్లు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది.
క్యూలైన్లలో మార్పులు చేసింది. వీఐపీ దర్శనాలనూ రద్దు చేసింది. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటల నంచి రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తోంది. ఫ్లైవోవర్ కింద వాహనాలకు అనుమతి రద్దు చేసింది. సీఎం చంద్రబాబు బుధవారం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
నేడు శ్రీ సరస్వతిదేవిగా...
ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం శ్రీ సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. ఈ రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment