కసాపురం(అనంతపురం), న్యూస్‌లైన్: మండల పరిధిలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి శ్రీఆంజనేయస్వామి ఆలయం శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా భక్తులతో సందడి నెలకొంది. ప్రధాన అర్చకులు వేకువజామునే స్వామి వారికి నిత్యాభిషేకం, సుప్రభాత సేవ, వజ్రకిరీటధారణ, వజ్రకవచ అలంకరణ చేశారు. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని ముస్తాబు చేశారు. భక్తులు స్వామి వారికి ఆకు పూజలు, వడమాల సేవ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వసతి సముదాయాలు మొత్తం భర్తీ కావడంలో భక్తులు ఆలయ పరిసరాలు, పార్కులను ఆశ్రయించారు. తాగునీటికి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఈఓ ఎంవీ సురేష్‌బాబు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మల ఆధ్వర్యంలో భక్తులకు అన్నీ ఏర్పాట్లు చేశారు. రూరల్ సీఐ మున్వర్ హుస్సేన్, రూరల్ ఎస్‌ఐ వలిబాషా, వజ్రకరూరు ఎస్‌ఐ వంశీకృష్ణ పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పూజ కార్యక్రమాలకు స్థానికులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడ భారీగా తరలివచ్చారు.
నెట్టికంటుడిని దర్శించుకున్న కర్ణాటక ఎమ్మెల్యేలు
కర్ణాటక రాష్ట్ర బళ్లారి అర్బన్ మాజీ ఎమ్మెల్యే, కంప్లి ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్‌రెడ్డి, సురేష్‌బాబు శనివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని వేర్వేరుగా దర్శించుకున్నారు. శ్రావణమాసం శనివారం సందర్భంగా బళ్లారి అర్బన్ మాజీ ఎమ్మెల్యే, కర్ణాటక రాష్ట్ర మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గాలి సోమశేఖర్‌రెడ్డి దంపతులు బెంగళూరు నుంచి వస్తూ మురడి, నేమకల్లు ఆంజినేయ స్వామిని దర్శించుకుని అనంతరం కసాపురం ఆంజనేయస్వామి దర్శనార్థం వచ్చారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేష్‌బాబు తన మిత్రృబందంతో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే ఆర్.సాయినాథ్‌గౌడ్ కూడ పాల్గొన్నారు.