Dhanurmasam 2022 Start And End Date, Special Story About Dhanurmasam In Telugu - Sakshi
Sakshi News home page

Dhanurmasam 2022: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం

Published Thu, Dec 15 2022 1:16 PM | Last Updated on Thu, Dec 15 2022 1:43 PM

Dhanurmasam 2022 Start And End Date, Special About Dhanurmasam - Sakshi

గోదాదేవి పేరుతో తిరుప్పావై కావ్యాన్ని ఉపనిషత్తుల సారాంశం అని వర్ణిస్తారు. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషత్‌ అంటూ తిరుప్పావైని గోదోపనిషత్‌ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయం లోనే పఠించాలి.  

అందాల పల్లె వ్రేపల్లెలో కరువువచ్చింది. అందరూ ఆందోళన పడుతూ క్రిష్ణయ్య దగ్గరకు వెళ్లి తమను ఆదుకోమని గోప గోపీజనులు కోరారు. చిన్నారి కన్నె పిల్లలయిన గోపికలతో వ్రతం చేయిస్తే బాగుంటుందనీ అన్నారట. సరే నని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి నియమాలు వివరించి, తెల్లవారు ఝామున రావాలని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడు. దాంతో తిరుప్పావై కథావస్తువు మొదలైంది. శ్రీకృష్ణుడితో గడిపితే కలిగే ఆనందం, ఉత్సాహం గుర్తుకు వచ్చి గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రి గడిపారు. తెల్లవారు ఝామునే రమ్మన్నాడు కిట్టయ్య అందరినీ లేపుదాం అని బయలుదేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నాందీ ప్రస్తావన.

తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగు వేల కవితలను నాలాయ రమ్‌ (నాల్‌ అంటే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమఱై అంటే నైవేద్యం తరువాత నాలాయిర ప్రబంధ పారాయణం... తిరుప్పావై మంగళా శాసనం ప్రణవ నాదంతో ముగుస్తుంది. ఈ తమిళ ప్రబంధ పారాయణానికి ఏ ప్రతి బంధకాలూ లేవు. కఠినమైన నిబంధనలు లేవు. వర్ణ భేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు.

అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. నారాయణ మంత్ర సారాంశాన్ని పాశురంలోని అక్షరక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, నారాయణుని తిరుమంత్రాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ రహస్యాలు విప్పినవాడు రామానుజుడు. కుల మత భేదాలు లేకుండా అంద రికీ నారాయణుని చేరే జ్ఞాన, వ్రత, మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే ఇద్దరూ– గోదాదేవి, శ్రీరామానుజుడు. తిరుప్పావై జీయర్‌ అని రామానుజుని అంటారు. గోదాదేవి పుట్టి కావేరి నది తీరంలో శ్రీరంగనిలో లీనమైన రెండు వందల ఏళ్ల తరువాత క్రీస్తు శకం 1000లో జన్మించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం ఒక కారణమైతే... తనకు రంగనితో వివాహమైతే మధురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో శ్రీ సుందర బాహుస్వామికి వేయి బిందెల పాయసం చేయిస్తానన్న మొక్కును ఆయన తీర్చడం మరో కారణం. గోదాదేవి శ్రీరంగడిలో లీనం కావడం వల్ల ఆమె తన మొక్కు తీర్చలేకపోయారు. ఆ విషయం విన్న మరుక్షణమే రామానుజుడు శ్రీసుందర బాహుస్వామి ఆలయా నికి వెళ్లి వేయిబిందెల పాయసం సమర్పించారట.

శంగత్తమిళ్‌ అంటే అందమైన తమిళ భాష అని అర్థం. డిసెంబర్‌ మధ్యలో ఉండే ధనుర్మా సంలో వచ్చే తమిళ నెల. సూర్యుడు ధనుర్‌ రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. గోదాదేవి రోజుకో పాశురాన్ని పాడి తోటి వారిని పూజకు పిలిచిన నెల ఇది. ఆ విధంగా 30 అందమైన ఎనిమిది పాదాల కవితలు గోదా గళం నుంచి జాలు వారాయి ఈ నెలలో. పదం పదంలో పుణ్యకథ కనిపిస్తుంది. వాటిని వింటుంటే రామాయణ ఘట్టాలూ, భాగవత తత్వం, శ్రీకృష్ణలీలలు కళ్ల ముందు కదలాడుతాయి. ఇందులో భక్తి సాహిత్యం, శరణాగతి, విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది. కానీ ఇది సిద్ధాంత తత్వ గ్రంథం కాదు. ఒక్కో పాశురం ఒక్కొక్క బోధనా, సాధనా... ఒక పిలుపు, వ్రతం, ఆరాధన కలిసిన ప్రేమరస ప్రవాహం. ఆద్యంతం భక్తిభావ బంధురం. 

తిరుమల తిరుపతిలో ఈ ధనుర్మాసపు ముప్పయ్‌ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు రచించిన పాశురాలు విన్న తరువాత... శ్రీనివాసుడు పొద్దున్నే లేవగానే శ్రావ్యంగా ఈ తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున మొత్తం 30 వింటాడు. గోదా గీతాగోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాసపు గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంథ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు 30 రోజులు సాగుతాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సిరినోము సంక్రాంతి దాకా సాగే ఆధ్యాత్మి కోద్యమం ఇది. (క్లిక్ చేయండి: అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే..)


- మాడభూషి శ్రీధర్‌ 
డీన్, స్కూల్‌ ఆఫ్‌ లా, మహీంద్ర యూనివర్సిటీ
(డిసెంబర్‌ 16న ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement