పల్లాణ్డు పల్లాణ్డు పల్లాయిరత్తాణ్డుపలకోడి నూఱాయిరమ్ మల్లాణ్డు తిణ్ణోళ్ మణివణ్ణా! ఉన్ శేవడి శెవ్వి తిరుక్కాప్పు’ అంటూ భగవంతుడికే మంగళాశాసనం చేసిన మహాభక్తుడు విష్ణుచిత్తుడు. అతని గారాలపట్టి మన గోదాదేవి ఆచరించిన ముప్ఫై రోజుల వ్రతమే ధనుర్మాస వ్రతం.
హేమంత ఋతువులో వాతావరణ ప్రభావం చేత మనుష్యులు సుషుప్తి అవస్థలో వుంటారు. అటువంటి మాయావస్థనుండి బయటపడవైచే ఒకానొక ఉద్దేశంతో ఈ వ్రతం స్వయంగా ఆమె ఆచరించీ, సామాన్యుల చేత ఆచరింపజేసిన మహా తల్లి గోదాదేవి. యితర గోపికలని కూడా కలుపుకుని వారిని వేకువజామునే మేలుకొలుపుతూ అందరిని ఆ భగవత్సన్నిధికి చేరవేసిన నిస్వార్ధపరురాలు. పరమాత్మునికి సామూహిక పూజే చాలా ప్రీతి అన్న విషయం ఎరిగినందుకే గోదాదేవి తన బృందంతో సహా శ్రీ కృష్ణుని వద్దకు వెళ్ళింది. లోకమంతా పచ్చగా, భోగభాగ్యాలతో కళకళలాడాలనే ఉద్దేశంతో పరమాత్మని ప్రార్థిస్తూ తెల్లవారుఝామున స్నానం చేసి సౌందర్యవంతులైన గోపికలతో కలసి చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం. ఇక్కడ సౌందర్యమంటే ఆత్మసౌందర్యం, స్నానమనగా భక్తితత్వంలో మునిగితేలడం. రోజుకొక పాశురం పాడుతూ ఒక్కొక్క గోపికను మేలుకొలిపే ముప్పై పాశురాల రాగమాలికే తిరుప్పావై!
రమారమి క్రీ.శ.750 ప్రాంతంలో శ్రీరంగనాథస్వామి వెలసిన శ్రీరంగానికి దగ్గరలో శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో పెరియాళ్వార్ (విష్ణుచిత్తుని మరో పేరు)అనే భక్తశిఖామణి ఒకనాడు తన తులసివనంలో మొక్కలకు పాదులు తవ్వుతుండగా భూమిలో లభించిన ఈ బాలిక కర్కాటక మాసం, పుబ్బానక్షత్రంలో దొరికింది. ఈమెని పెరియాళ్వార్ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
విష్ణుచిత్తుని ఇంట అన్నసంతర్పణలూ, శ్రీరంగనాథుని భజనలే నిత్యకృత్యాలు. అందుకే గోదాదేవి చిన్నతనం నుంచి ఆ రంగనాథుడ్ని మనసారా సేవించింది. ఆమె భక్తితో కట్టే పూలదండలని వాసన చూసి ముందుగా తాను ధరించిన తరువాత వాటిని తండ్రిద్వారా ఆ రంగనాథునికి సమర్పించేది. పూలమాలలని ముందుగా తాను ధరించడంతో ఆమెకు శూడికొడుత్త అనే పేరువచ్చింది. గోదాదేవి ముందుగా ధరించి ఇచ్చిన పూలమాలలు తస్ప వేరే మాలలని తాను ధరించనని రంగనాథుడు స్వయంగా విష్ణుచిత్తునితో చెప్పడంతో తన బిడ్డ కారణ జన్మురాలని తనని తరింపజేయడానికే తన ఇంట వెలసిందని గ్రహించాడు.
ద్వాపరయుగంలో గోపికలు శ్రీ కృష్ణుణ్ణి భర్తగా పొందదలచి కాత్యాయనీ వ్రతాన్ని చే శారని తండ్రి ద్వారా తెలుసుకుంది గోదాదేవి. శ్రీకృష్ణుని లీలలు కథలు కథలుగా అక్కడి అందరూ చెప్పుకోవడంతో తాను ఆ కృష్ణావతార సమయంలో ఉంటే బాగుండునని తలచింది. అయితే కృష్ణావతారంలో సత్యభామ తానేనని జ్ఞానసంపద కలిగిన ఓ గోపిక ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తాను కూడా ధనుర్మాస వ్రతమాచరించి ఆ శ్రీరంగనాథుని సన్నిధి చేరుకోవాలని కోరుకుంది.
‘శూడిక్కొడుత్త శుడర్ క్కోడియే..తోల్‌పావై పొడి యరుళ వల్ల పల్ వళైయామ్, వేంగడ వఱ్కెన్నైవిది యెన్ద విమ్మాత్తమ్, నాంగడవా వజ్రమే నల్గు’ దీని అర్ధం–‘సువాసనతో కూడిన బంగారుజిలుగులు (జ్ఞాన కాంతులు) వెదజల్లే పుష్పదండలను దాల్చి, వాటినే శ్రీరంగనాథునికి సమర్పించిన ఓ మెరుపుతీగా, ఆ వేంకటేశ్వరునికి నీవు ఎట్లైతే ప్రియము కల్గించుమని వేడుకొన్నావో అలాగే, నీ భక్తులమైన మాకు కూడా ఆ వ్రతఫలం కల్గించు తల్లీ!’ అంటూ పరాశరభట్టర్ గోదాదేవిని స్తుతించడం ఇక్కడ గమనించాలి. సుగంధమైన పుష్పమాలలని స్వామికి సమర్పించినందున ఆముక్తమాల్యద అనే పేరు గోదాదేవికి వచ్చింది. కోదై, నాచియార్, ఆండాళ్...ఇలా వివిధ నామధేయాలు ఆమెకున్నాయి.
గోదాదేవి మెడలో ధరించే పూమాల భక్తిగీతమాలగా, చేతిలోని చిలుక గురువుకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. గోదాదేవి ధనుర్మాస వ్రతమాచరించడానికి తన గోపికలతో కలసి ఆ పరమాత్మని కోరినదేమిటంటే, భూమండలాన్ని దద్దరిల్లచేసే తెల్లనైన ΄ాంచజన్యమనబడే శంఖాన్నీ, విశాలమైన పర అనే వాద్యాన్ని, మంగళగానం చేయడానికి భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజములు కావాలని కోరింది.
వీటిని ఆ భగవత్సేవ వినియోగం కొరకు కోరుకున్నారు. అంతేకాదు, పాంచజన్యం, పర అనే భౌతిక వస్తువులని ఎందుకు కోరారంటే ఈ పరికరాలు ఎల్లప్పుడూ ఆ భగవంతుని అంటి పెట్టుకుని ఉంటాయి. అటువంటివి తమ వద్దవుంటే ఆ భగవంతుడు తమతో ఉన్నట్టేనని భావించి కోరుకున్నారు. వ్రతమాచరించే ముప్పై రోజులూ ఆహారనిష్ఠలతోపాటూ ఇతర కఠినమైన నియమాలు పాటిస్తూ సదా భగవన్నామ స్మరణలో గడిపారు గోదాదేవి బృందం. ఎదుటి వారిని నొప్పించే మాటలు ఆడకుండా, వారికి సహాయపడుతూ కలసి మెలసి మెలుగుతూ లోకకళ్యాణం కొరకు వ్రతమాచరించడమే గోదాదేవి ముఖ్యోద్దేశం.
విష్ణుచిత్తుడు ఆ రంగనాథుని ఆజ్ఞతో ముప్పైరోజుల వ్రతానంతరం గోదాదేవిని శ్రీరంగానికి తోడుకొనిపోయి ఆ శ్రీరంగనాథునితో కళ్యాణం జరిపించాడు. గోదాదేవి భక్తి ప్రవత్తుల కారణంగా, జనులందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో లీనమైపోయింది. పన్నిద్దరు ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి మన ఆండాళ్ తల్లి!
‘తిరు’ అంటే శ్రీ, లక్ష్మీ, అమృతం మొదలగు అర్థాలున్నాయి. ‘పావై’ అంటే పాటల సమాహారం, వ్రతం అనే అర్థాలున్నాయి. ‘శ్రీకృష్ణుని(రంగనాథుడు) పొందకోరి ఆచరించిన గానామృత వ్రతమే ఈ మార్గశీర్ష వ్రతం లేదా ధనుర్మాస వ్రతం! మార్గమంటే బుద్ధి, శీర్షమంటే ఉత్తమమైనది. ‘మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే!’ అని స్వయంగా శ్రీ కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. అటువంటి కృష్ణుణ్ణి పొందడానికి మార్గశిరమే ఉత్తమమైన కాలమని భావించి ఈ వ్రతమాచరించింది గోదాదేవి.
– కారంపూడి వెంకట రామదాస్
Comments
Please login to add a commentAdd a comment