సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ భోగి. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. కర్రపుల్లలు, పిడకల దండలు, పాత సామాన్లు, కొబ్బరిమట్టలు... లాంటివాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. పాత వస్తువులతో పాటు, మనుషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆరోజు నుంచి కొత్త ఆయనంలోకి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచనగా భావిస్తారు.
గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ రోజున భోగి మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం.
వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి తోటి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలికాచుకుంటూ కోలాహలంగా కనిపిస్తారు.
సైన్సుపరంగా చెప్పాలంటే, చలికాలం వాతావరణంలో సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందడానికి అనువైన కాలం. అందువల్ల అందరూ ఏకకాలంలో భోగిమంటలు వేయడం వల్ల సూక్ష్మక్రిములన్నీ నశించిపోయి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అదేవిధంగా ఎప్పటెప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత సామానును ఏడాదికోసారి ఈ విధంగా వదిలించుకోవడం వల్ల దుమ్ము, ధూళి, ఎలుకలు, వాటిని తినడానికి పాములు చేరకుండా ఉంటాయనేది పెద్దల మాట.
భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగిపళ్లు పోసేటప్పుడు రేగు పళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడిటినీ కలిపి తలచుట్టూ మూడుసార్లు తిప్పి తలమీద పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగ ముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూలరేకలు అన్నీ కలిపి పోస్తారు.
దీనివల్ల దృష్టి దోషం పోతుందని విశ్వాసం. పిల్లలు కూర్చునే పీటకింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరవాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క ఇస్తారు. మన పండుగల వెనుక సంప్రదాయంతోపాటు ఆరోగ్య కోణమూ దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగా వస్తున్నాయి.
వస్తు వ్యామోహానికి మంట
మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు కాబట్టి భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం.
ఇక పోతే, భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు.
రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదని దాని అర్థం. రేగుపండ్లు శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. రేగుపండ్లకున్నప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు.
మహా భక్తురాలైన గోదాదేవి భోగినాడే రంగనాథుని పతిగా పొందిందని ద్రవిడ వేదం చెబుతోంది. అందువల్ల విష్ణ్వాలయాలలో భోగిరోజు గోదా రంగనాథులకు కల్యాణం జరిపిస్తారు.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment