సంక్రాంతి జరీచీర | Sakshi Editorial On Sankranti Festival | Sakshi
Sakshi News home page

సంక్రాంతి జరీచీర

Published Mon, Jan 13 2025 1:06 AM | Last Updated on Mon, Jan 13 2025 4:53 AM

Sakshi Editorial On Sankranti Festival

ఏదో తప్పదు కావున పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారనీ, సంక్రాంతికి పిన్నీ బాబాయిలు పుట్టింటి హోదాలో తననూ భర్తనూ పిలిచేదేమీ లేదనీ తేలిపోయాక చిన్నబుచ్చుకుంది ఆ కొత్త పెళ్లి కూతురు. భర్త గమనించాడు. వాళ్లు రాసినట్టే పిలిచినట్టే ఒక కార్డుముక్క సృష్టించాడు. పండక్కు ముందు భార్యను బయల్దేరదీశాడు. పట్నానికి తీసుకెళ్లి దర్జాగా హోటల్‌లో దించాడు. ‘ఇదేమిటండీ’ అని ఆశ్చర్యపోయింది భార్య. ‘మరేటనుకున్నావోయ్‌. ఇంతకు మించిన పుట్టిల్లు లేదు. కోరిన టిఫెను, భోజనం గదిలోకే వస్తాయి. సాయంత్రమైతే సినిమాలు షికార్లు బోలెడన్ని. ఇదే నీ పుట్టిల్ల నుకొని సంతోషపడు’ అంటాడు. మనసుంటే పండగ ఉండదా? మధురాంతకం రాజారాం ‘పండగ అల్లుడు’ కథ ఇది.

చార్జీలు, పండగ ఖర్చులు తలచి పాపం ఆ పేద తల్లిదండ్రులు పెద పండుగ ఊసే ఎత్తలేదు కూతురి సంగతే మరిచినట్టు. అల్లుడు అది గమనించాడు. పండక్కు తన భార్య కొత్తచీర కట్టుకుంటే ఆ మురిపెం వేరు. సింగారమూ వేరు. కోర్టు గుమాస్తా అతను. చిన్న జీతమే. కాని పెద్ద మనసు. రిక్షా ఎక్కడం మానేశాడు. బయట టిఫెన్లు కాఫీలు మానేశాడు. నాటకాలు చూడ్డం మానేశాడు. పుస్త కాలు కొనడమున్నూ. ప్రతి పైసాను పొదుపు చేసి తెచ్చాడు ఆఖరుకు ‘పుల్లంపేట జరీచీర’! పది హేను మూరల ఆ జరీచీర కట్టుకుని కళకళ్లాడిన భార్య ‘ఇంత కష్టం చేసి నా కోసం తెచ్చారా’ అని భర్త కంఠార తల ఆన్చి బాష్పాలు రాలుస్తుంది. సయోధ్య ఉంటే కాపరం పండగే. శ్రీపాద కథ ఇది.

కరువు రోజుల్లో పండగంటే ఎంత కష్టం. ఇంటి పెద్ద మనసు కష్టపెట్టుకుంటూనే ఎక్కడ ఏది సర్ది చెప్పాలా అని ఆగమవుతూ ఉంటాడు. పిల్లలకిది పడుతుందా? పండగ మరో నెలుందనగానే తట్టలు పట్టి ఎక్కడి పేడంతా సేకరించి పిడకలు కొట్టి ఆరబెట్టారు. ‘ఎన్నర్రా’ అని తండ్రి అడిగితే ‘300’ అన్నారు గర్వంగా. తండ్రికి ఎన్నో ఆలోచనలు. వాటిని పొయ్యిలోకి వాడితే కట్టెలైనా మిగిలి నాలుగు పైసలు ఆదా అవుతాయి గదా అని. ‘ఇవ్వండ్రా’ అనంటే ‘ఊహూ’. భోగి మంటలేసి ఎగిసే మంటలను చూసి పక్కింటివాళ్లను ఓడిస్తేనే పిల్లలకు ఆనందం. పేదవాడికి పండగంటే ‘సర్దుబాటే’. సాక్షాత్తూ ఆరుద్ర రాసిన కథ ఇది. 

అయితే ‘ఇప్పటి భోగిమంటలు ఒక మంటలేనా’ అంటారు ముళ్లపూడి వెంకట రమణ. జగన్నా థుని రథమంత ఎత్తున లేసేలా వేస్తేనే వేసినట్టట. ‘ఒరే ఫ్రెండూ... వెళ్లి రెండు బైండింగ్‌ అట్టలైనా పట్టుకురారా మంట పెంచుదాం’ అనంటే ఎవరింట ఉన్నాయట బైడింగ్‌ అట్టలూ పుస్తకాలూనూ. కోళ్లగంపలూ తాటాకు బుట్టలూ తప్ప. కావున జానెడు ఎత్తు మంటే జగన్నాథుడితో సమానం. అయితే పిల్లకారుకు చిన్న సరదా ఉందిలే. ఆ చిరుచీకట్లలో ప్లీడరు శేషయ్యగారి బోర్డు ఊడబెరికి మంటల్లో వేసి గోడ ఖాళీ ఎందుకని భోజనం తయార్‌ బోర్డు తెచ్చి అక్కడ వేళ్లాడదీశారు. 

పండగంటే పిల్లల అల్లరిది. జీవితాంతం చెప్పుకునేటందుకు జ్ఞాపకమై గూడుకట్టేది. ముళ్లపూడి ‘భోగి మంటలు’ బలే సరదా కథ. అయితే స్త్రీగళాన్ని ఎలా వదిలేస్తాం? ఒక సింగిల్‌ ఉమన్‌కు అందరూ గది అద్దెకిస్తారుగాని ఒకటే షరతు... రోజూ ఇంటి ముందర ముగ్గేయాలని. ఆ సింగిల్‌ ఉమన్‌ మంచి జర్నలిస్టు. ఆలోచనాశీలి. సమాజానికి పనికొచ్చే పనులు చేయగలిగినది. మించి తన జీవి తాన్ని తాను నిర్మించుకోగలిగేది. 

అయినా సరే. ముగ్గేయాల్సిందే. ‘నాకు రాదు... వచ్చినా వేయను’... ‘పనిమనిషితోనైనా వేయించు’... పండుగ నెల వచ్చిందంటే ఆమెకు గండం. ముగ్గు లేని వాకిలిగా ఆమె ఇల్లే కనపడుతుంది. ఆ నెల్లో యజమాని ఖాళీ చేయించడం ఖాయం. మరో గదికి చలో. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలట. ఇల్లాలి చదువు, జ్ఞానం, వికాసం వీటి వల్ల కాదా దేశానికి పండగ వచ్చేది? పి.రామకృష్ణారెడ్డి కథ ‘ముగ్గు’.

సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండగ. యుగాంతం వరకూ నిలిచే పండగ. సంస్కృతిని ఎప్పటికీ కాపాడుకోవాల్సిందే. కాని సందర్భాలలోని అంతరాలను చూసి సరిచేసి పండుగ అర్థాన్ని విశాలం చేసుకోవాలి కూడా. ‘గుమ్మం ముందు బొబ్బిలిపాట గాళ్లేమిటి... బుడబుక్కల వాళ్లేమిటి... తందానపదం వాళ్లేమిటి... గంగిరెడ్ల వాళ్లేమిటి... పగటి వేషగాళ్లేమిటి... తోలు బొమ్మలాళ్లేమిటి... ఎరకలాళ్లేమిటి... చెంచులాళ్లేమిటి... జంగాలేమిటి... సన్నాయి వాళ్లేమిటి... వీళ్లంతా నిమిష నిమి షానికి వచ్చేవాళ్లే’ అని రాస్తారు కవికొండల వేంకటరావు ‘మా ఇంట సంక్రాంతి’ కథలో. 

పండగ ఒకరు చేసుకునేదిగా... మరొకరు వారింటి ముందుకు వచ్చి ఇనాము అడిగేదిగా ఎందుకు ఉండాలి? ఇనాము ఇచ్చే స్థాయిలో ఒకరు, పొందే స్థాయిలో ఒకరు ఉంటే అది న్యాయమైన సమాజమేనా? జన్మ అంతరాలు, ఆర్థిక అగాథాలనే కాబోలు భోగిజ్వాలల్లో పడేయాల్సింది. గాయకుడు పుట్టా పెంచల్దాసు ‘యేటంబిడ యేడుచ్చా పోయా’ అనే కథను రాశాడు. 

భోగి రోజు పండగ చేసుకోనీకుండా, ఇల్లు గడిచేందుకు భత్యాలు తీసుకురమ్మని తల్లి పోరుపెడితే, చీకటితో బయల్దేరి ఇంటింటా పాటలు పాడి గింజలు, వడ్లు తీసుకుని చీకటి పడ్డాక ఇల్లు చేరి, అప్పుడు కొత్త బట్టలు కట్టుకుని ఎవరికి చూపించుకోవాలో తెలియక దిగాలు పడే పసివాడి కథ అది. దుఃఖం వస్తుంది. 

సంక్రాంతి ఎంతో సంబరమైన పండగ. కాని సమకాంతికై అది చేసే వాగ్దానాన్ని మనం ఇంకా అందుకోవలసే ఉంది. సామాజికంగా అందరూ అడుగు పెట్టగలిగేదే ఉత్తరాయణం అంటే. క్రాంతి రావడమే సరైన సంక్రాంతి. అటువంటి సంక్రాంతిని కాంక్షిస్తూ గుమ్మడి పూల, పసుపు చేమంతుల శుభాకాంక్షలు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement