సందళ్ల సంక్రాంతి | Significance of Makar Sankranti Festival | Sakshi
Sakshi News home page

సందళ్ల సంక్రాంతి

Published Sun, Jan 12 2025 7:51 AM | Last Updated on Sun, Jan 12 2025 11:10 AM

Significance of Makar Sankranti Festival

మనకు ఎన్ని పండుగలు ఉన్నా, సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. సంక్రాంతి అంటేనే సందడి అనేంతగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయి. సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెట్టే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయనం మొదలవుతుంది. ఉత్తరాయనాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అందువల్ల మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో పద్ధతి. సంక్రాంతికి ముందురోజున భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు వేయడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిపించే సంక్రాంతి సందళ్ల గురించి తెలుసుకుందాం.

సంక్రాంతి రోజుల్లో తెలుగునాట ఊరూరా ముంగిళ్లు గొబ్బెమ్మలను తీర్చిదిద్దిన ముగ్గులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గంగిరెద్దుల గంటల సవ్వడులు, బుడబుక్కల వాయిద్యాల ధ్వనులు, హరిదాసుల హరినామ సంకీర్తనలు వినిపిస్తాయి. కొన్నిచోట్ల కోడిపందేల కోలాహలాలు, ఇంకొన్ని చోట్ల నింగిని తాకే పతంగుల రంగులు కనువిందు చేస్తాయి.  కొన్నిచోట్ల ఆడపడుచులు సంక్రాంతి సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు కూడా పెడతారు. మకర సంక్రాంతి వేడుకలను సాధారణంగా మూడు రోజులు, ఒక్కోచోట నాలుగు రోజులు కూడా జరుపుకొంటారు. 

మకర సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ, సంక్రాంతి మరునాడు కనుమ పండుగ, కనుమ మరునాడు ముక్కనుమ జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ సంక్రాంతి వేడుకలను దాదాపు ఒకేరీతిలో అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. సంక్రాంతి ప్రధానంగా వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. పంటల కోతలు పూర్తయ్యాక వచ్చే పండుగ ఇది. సంక్రాంతి నాటికి రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి. మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. ఇంటికి ధాన్యలక్ష్మి చేరుకునే రోజుల్లో వస్తుంది కాబట్టి, సంక్రాంతి లక్ష్మి అని, పౌష్యలక్ష్మి అని అంటారు. ‘వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. 



నెల్లాళ్లు రంగవల్లుల వేడుక
మకర సంక్రాంతికి నెల్లాళ్లు ముందు వచ్చే ధనుస్సంక్రాంతి నుంచి ముంగిళ్లలో నెల్లాళ్ల పాటు రంగవల్లుల వేడుక సాగుతుంది. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది వాటిని గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అష్టదళ పద్మం, నాగబంధం, మారేడు దళాలు, శివుడి త్రినేత్రాలు, పెళ్లిపీటల ముగ్గు వంటి సంప్రదాయ ముగ్గులతో పాటు రకరకాల ముగ్గులను తీర్చిదిద్దుతారు. ధనుస్సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు సాగే నెల్లాళ్లను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలను పఠిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. కట్టుపొంగలి, చక్కెరపొంగలి వంటి వంటకాలను నైవేద్యంగా పెడతారు. భోగి పండుగ రోజున ఆలయాల్లో గోదా కల్యాణం వేడుకలను నిర్వహిస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేస్తారు. దీనిని దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి పయనం సాగించిన సూర్యుని రథంగా భావిస్తారు.

భోగ భాగ్యాల భోగి
పూర్వం విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడికి ఒకనాడు తులసివనంలో ఒక పసిబిడ్డ దొరికింది. విష్ణుచిత్తుడు ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచాడు. ఆమె గోదాదేవి. చిన్ననాటి నుంచి శ్రీరంగనాథుడిని ఆరాధించేది. శ్రీరంగనాథుడు ఆమెను మకర సంక్రాంతికి ముందు ధనుర్మాసం చివరి రోజున పెళ్లాడాడు. ఆమెను భోగభాగ్యాలతో ముంచెత్తాడు. రంగనాథుని పెళ్లాడటంతో గోదాదేవి కైవల్య భోగాన్ని పొందిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గోదా రంగనాథుల పరిణయానికి, భోగభాగ్యాలకు ప్రతీకగా భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

 భోగి రోజున ఇంట్లోని చిన్నపిల్లలకు రేగుపండ్లు, చెరకు ముక్కలతో భోగిపండ్లు పోసి, పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. హేమంత రుతువులో చలితీవ్రత ఎక్కువగా ఉండేరోజుల్లో ఈ పండుగ వస్తుంది కాబట్టి, భోగిపండుగ రోజున వేకువ జామున ఇళ్ల ముంగిట గాని, వీథి చివరన గాని పెద్దపెద్ద భోగిమంటలు వేస్తారు. భోగిమంటల్లో పిడకల దండలు, ఎండిపోయిన తాటాకులు, పెద్దపెద్ద కర్రదుంగలు, పాత వస్తువులు వేస్తారు. రైతులు భోగిరోజున కోతలు పూర్తయిన తమ పొలాలను కొంత నీటితో తడుపుతారు. దీనిని ‘భోగి పులక’ అంటారు. భోగి రోజు నుంచి గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. 
 


సిరుల వేడుక సంక్రాంతి
«రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడే రోజుల్లో వచ్చే సిరుల పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి, కొత్తబియ్యంతో పాయసం వండుతారు. పితృదేవతలను పూజించి, పితృతర్పణాలు విడుస్తారు. శ్రీకృష్ణుడు ఇదేరోజున గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుంచి యాదవులను కాపాడాడని, ఇంద్రునికి గర్వభంగం చేశాడని పురాణాల కథనం. ఈరోజున ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని పూజిస్తారు.

 సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుందనే నమ్మకం ఉండటంతో ఈరోజున విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఇళ్లకు వచ్చే హరిదాసులకు, బుడబుక్కల వాళ్లకు, గంగిరెద్దులను ఆడించేవాళ్లకు యథాశక్తి ధన ధాన్యాలను దానం చేస్తారు. సంక్రాంతి రోజున డబ్బు, ధాన్యం మాత్రమే కాకుండా, విసనకర్రలు, వస్త్రాలు, నువ్వులు, చెరకు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా దానం చేస్తారు. సంక్రాంతి రోజున చేసే గోదానం విశేష ఫలితం ఇస్తుందని చెబుతారు. అందువల్ల సంపన్న గృహస్థులు సంక్రాంతి రోజున గోదానాలు కూడా చేస్తారు. 

పశువుల పండుగ కనుమ
మకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకొంటారు. పొలం పనుల్లో ఏడాది పొడవునా చేదోడు వాదోడుగా నిలిచిన పశువులను అలంకరించి, వాటికి ఇష్టమైన మేతను పుష్టిగా పెడతారు. కనుమ రోజున మాంసాహారులు రకరకాల మాంసాహార వంటకాలతో విందుభోజనాలు చేస్తారు. మనకు కనుమ నాడు మినుము తినాలని సామెత ఉంది. మాంసాహారం తినని శాకాహారులు మాంసకృత్తులు పుష్కలంగా ఉండే మినుములతో తయారుచేసే గారెలు, ఆవడలు వంటి వంటకాలను ఆరగిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తోంది.

ముగింపు ముక్కనుమ
సంక్రాంతి వేడుకల్లో మొదటి మూడు రోజుల్లోనూ నిర్దిష్టంగా పాటించవలసిన సంప్రదాయ నియమాలు ఉన్నాయి గాని, నాలుగో రోజైన ముక్కనుమకు ప్రత్యేక నియమాలేవీ లేవు. కొందరు మాంసాహారులు కనుమనాడు మాంసాహారం తినరు. వారు ముక్కనుమ రోజున మాంసాహార విందులు చేసుకుంటారు. ముక్కనుమ రోజున నవవధువులు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని బొమ్మల నోము అంటారు. నోము పూర్తయ్యాక, పూజలో ఉంచిన బొమ్మలను నిమజ్జనం చేస్తారు. 

ముమ్మతాల పండుగ
మకర సంక్రాంతి హిందువుల పండుగ మాత్రమే కాదు, ఇది ముమ్మతాల పండుగ. హిందువులతో పాటు జైనులు, సిక్కులు కూడా మకర సంక్రాంతి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. జైన ఆగమం ప్రకారం ఈ దేశాన్ని పాలించిన భరత చక్రవర్తి మకర సంక్రాంతి రోజున అయోధ్యలో సూర్యుడిని చూసినప్పుడు, ఆయనకు సూర్యుడిలో ‘జిన’ దర్శనం లభించింది. వెంటనే ఆయన జినాలయాన్ని దర్శించుకున్నప్పుడు, ఆ ఆలయ ద్వారం అయోధ్య నగరానికి అభిముఖంగా ఉందట! జైన మతం ప్రకారం ఇంద్రియాలను జయించిన ఆధ్యాత్మిక విజేతను ‘జిన’ అంటారు. మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకొనే జైనులు, ఆరోజున జైన ఆలయాలను దర్శించుకుని, ప్రార్థనలు జరుపుతారు. ఆలయాల వద్ద, తమ తమ నివాసాల వద్ద విరివిగా దానాలు చేస్తారు.

సిక్కులు మకర సంక్రాంతిని ‘మాఘి’ పేరుతో జరుపుకొంటారు. సిక్కుల గురువైన గురు గోబింద్‌సింగ్‌ అనుచరుల్లో నలభైమంది 1705లో సంక్రాంతి రోజున జరిగిన ముక్తసర్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల సిక్కులు సంక్రాంతిని ఆ నలభై మంది అమరవీరుల స్మారకదినంగా పాటిస్తారు. ముక్తసర్‌లోని గురుద్వారాలో ఉన్న తటాక జలాల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. పంజాబ్, హరియాణా, జమ్ము, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి ముందు రోజును ‘లోహ్రీ’ పండుగగా జరుపుకొంటారు. లోహ్రీ సందర్భంగా వీథుల్లో భోగిమంటల మాదిరిగానే భారీగా చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో ఆనందం పంచుకుంటారు. హిమాచల్‌ ప్రజలు సంక్రాంతి వేడుకల్లో అగ్నిదేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.

పతంగుల పండుగ
సంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసే సంప్రదాయం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉంది. గుజరాత్‌లో పతంగుల సందడి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాతీలు ధనుర్మాసం నెల్లాళ్లూ గాలిపటాలను ఎగురవేస్తారు. పలుచోట్ల గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సంక్రాంతి రోజుల్లో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కర్ణాటక పర్యాటక శాఖ గోకర్ణ, కార్వార్‌ తదితర బీచ్‌లలో గాలిపటాల వేడుకలను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికే గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం పుట్టిందని చెబుతారు. చారిత్రకంగా చూసుకుంటే, మొఘల్‌ల కాలం నుంచి మన దేశంలో గాలిపటాలను ఎగురవేయడం వినోదక్రీడగా మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి.

కోడి పందేలు
కోడి పందేలు మన దేశంలో పురాతన వినోద క్రీడ. చట్టపరమైన నిషేధాలు ఉన్నా, నేటికీ ఏటా సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేల కారణంగానే పలనాటి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే! దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ కోడి పందేల ఆచారం ఉన్నా, తెలుగునాట కోడి పందేలు మరింత ఎక్కువగా జరుగుతాయి. కోడి పందేల్లో గెలుపు సాధించడం కోసం పూర్వీకులు ఏకంగా ‘కుక్కుట శాస్త్రం’ రాశారంటే, కోడిపందేల పట్ల జనాల మక్కువ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు పెందేల కోసం మేలిరకం కోడిపుంజులను పెంచుతుంటారు. 

ఇదివరకు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలు పందెంకోళ్లకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఏళ్ల కిందట ఆయిల్‌ పామ్‌ సాగు మొదలైనప్పటి నుంచి ఇక్కడ కూడా పందెం కోళ్ల పెంపకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే పందెంకోళ్లు చౌకగా లభిస్తుండటంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా పందెంరాయుళ్లు పుంజులను కొనేందుకు అశ్వారావుపేట, దమ్మపేట వంటి చోట్ల బారులు తీరుతుండటం విశేషం. పందెం కోళ్ల పెంపకం, వాటి శిక్షణ కోసం కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. సంక్రాంతికి ఏటా కోట్లాది రూపాయల్లో కోడి పందేలు జరుగుతాయి. పందెం కొళ్లకు లక్షల్లో ధరలు పలుకుతాయి. 

పొరుగు దేశాల్లో సంక్రాంతి
మన పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ మకర సంక్రాంతి వేడుకలను జరుపుకొంటారు. బంగ్లాదేశ్‌లోని బెంగాలీ హిందువులు సంక్రాంతి ముందురోజు భోగిమంటలు వేసి, బాణసంచా కాలుస్తారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. పండుగ రోజుల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్రులతో కలసి వినోదంగా పాచికలాట ఆడతారు. ఈ రోజుల్లో సమీపంలోని చెరువులకు, నదులకు వెళ్లి చేపలను వేటాడతారు. పండుగ రోజుల్లో ఎవరికి పెద్దచేపలు చిక్కుతాయో వారికి ఏడాదంతా అదృష్టం బాగుంటుందని నమ్ముతారు. నేపాల్‌ ప్రజలు మకర సంక్రాంతిని ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. 

థారు, మగర్‌ సహా వివిధ స్థానిక తెగల ప్రజలు తమ తమ సంప్రదాయ రీతుల్లో ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దేవాలయాల వద్దకు చేరుకుని, సంప్రదాయ నృత్యగానాలను ప్రదర్శిస్తారు. పాకిస్తాన్‌లోని సింధీ ప్రజలు మకర సంక్రాంతిని ‘తిర్మూరి’ పేరుతో జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి నుంచి నువ్వులతో తయారు చేసిన పిండివంటలను పంపుతారు. శ్రీలంక ప్రజలు తమిళనాడులో మాదిరిగానే ‘పొంగల్‌’ వేడుకలు జరుపుకొంటారు. 
ఇన్‌పుట్స్‌: దాళా రమేష్‌బాబు, గుంటూరు తాండ్ర కృష్ణగోవింద్, కొత్తగూడెం ఫొటోలు: షేక్‌ రియాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement