భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.? | Sankranti 2025: Significance Of Bhogi Festival And Rituals | Sakshi
Sakshi News home page

భోగి పండగ వెనుకున్న​ అంతరార్థం..? ఆచరించడానికి రీజన్‌..

Published Sun, Jan 12 2025 2:31 PM | Last Updated on Sun, Jan 12 2025 3:55 PM

Sankranti 2025: Significance Of Bhogi Festival And Rituals

'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!

భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.

ఆరోగ్యం రహస్యం..
ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. 

అవి కాలడానికి ఆవు నెయ్యని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. పైగా దీన్నుంచి  వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 

భోగి మంటలు ఎందుకంటే..
చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై  ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. 

అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.

ఈ పండగ సందేశం, అంతరార్థం..
చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని  తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. 

మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.

(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement